శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. నిత్వావసర వస్తువుల ధరలు పెరిగిపోయి, ఆసుపత్రుల్లో ఔషధాలు లేక, పెట్రోల్ బంకుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. అయితే తాజాగా శ్రీలంకకు మరో సమస్య వచ్చిపడింది. అదే విద్యుత్ సమస్య. ఎంతలా అంటే రోజుకు 10 గంటల పాటు శ్రీలంక ప్రజలు పవర్ కట్ ఎదుర్కొంటున్నారు.
ఎందుకిలా?
శ్రీలంకలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇందుకు ప్రధాన కారణం ఇంధన కొరత. దీని వల్లే విద్యుత్ లేక కోతలు మొదలయ్యాయి. తాజాగా ఈ పవర్ కట్ సమయాన్ని మరింత పెంచుతూ లంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రోజుకు 7 గంటలు విధిస్తోన్న కరెంట్ కోతను బుధవారం నుంచి 10 గంటలకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. అంటే ఇక దేశవ్యాప్తంగా రోజుకు 10 గంటల పాటు కరెంట్ కోతలు ఫిక్స్ అన్నమాట.
ధరల పెరుగుదల
శ్రీలంక ప్రస్తుతం ఆహార, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. శ్రీలంకలో ప్రస్తుత ధరలు చూస్తే కళ్లు పైర్లు కమ్ముతాయి. కోడి గుడ్డు రూ.35, లీటర్ కొబ్బరి నూనె రూ.900, కిలో చికెన్ రూ.1000, కిలో పాల పొడి రూ.1945.. ఇవి ప్రస్తుతం శ్రీలంకలో నిత్యవసర ధరల పరిస్థితి. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో నిత్యావసరాల ధరలు అమాంతం ఆకాశన్నంటాయి.
నిత్యావసరాలు, ఆహార పదార్థాలపై ప్రభుత్వ నియంత్రణ సన్నగిల్లడం వల్ల చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం డాలర్‌తో శ్రీలంక కరెన్సీ విలువ 270 రూపాయలకు చేరింది. ఫలితంగా నిత్యవసర వస్తువులతో పాటు ఇంధనం, గ్యాస్ ధరలు అందనంత ఎత్తుకు వెళ్లిపోయాయి.
1970లో సంభవించిన కరవు కంటే దారుణమైన పరిస్థితులను ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటోంది. దేశంలో డాలర్ల కొరతను సర్దుబాటు చేసేందుకు శ్రీలంక తీసుకున్న సరళమైన విదేశీ మారక రేటు విధానమే, ప్రస్తుత ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ పాలనపై ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ధరల పెరుగుదలకు ప్రభుత్వ వైఫల్యాలే కారణమంటున్నారు. విపక్షాలు కూడా ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మరి శ్రీలంకలో ఈ ధరల మోత ఎప్పటికి అదుపులోకి వస్తుందో!
Also Read: Hydrogen Car : దేశంలో ఇక హైడ్రోజన్ కార్లు - కిలో మీటర్ ఖర్చు రూ. రెండే !