Remi Lucidi Dies: 


పట్టు తప్పి..


అత్యంత ఎత్తైన భ‌వ‌నాల‌ను అధిరోహించ‌డంలో ఎక్స్‌పర్ట్‌ అయిన ఫ్రాన్సు కు చెందిన రెమీ లుసిడి (Remi Lucidi) ప్ర‌మాద‌వ‌శాత్తు 68వ అంత‌స్తు నుంచి ప‌డి మృతి చెందాడు. అత్యంత ఎత్తైన భ‌వ‌నాల‌ను అధిరోహిస్తూ.. ప్ర‌మాదాల‌తో చెల‌గాట‌మాడ‌డం (Daredevil) అత‌డికి స‌ర‌దా. ఆ స‌ర‌దానే ఇప్పుడు అత‌డి ప్రాణాల‌ను కోల్పోయేలా చేసింది. రెమీ లుసిడి అనుమతులు లేకుండా ఓ భవంతిపై నుంచి అదుపు తప్పి పడిపోయాడు. ఈ ఘటన హాంకాంగ్‌లో చోటు చేసుకొంది. హాంకాంగ్‌లోని ది ట్రెగంటెర్‌ టవర్‌ కాంప్లెక్స్‌ను అధిరోహించేందుకు ప్రయత్నించాడు. 68వ ఫ్లోర్‌లోని పెంట్‌హౌస్‌ కిటికి బయట చిక్కుకుపోయాడు. భయంతో ఆ కిటికీని బలంగా తన్నాడు. ఇరుక్కుపోయిన లుసిడిని చూసిన ఓ మహిళ పోలీసుల‌కు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చే లోపే రెమీ కాలు పట్టు తప్పింది. నేరుగా కిందపడిపోయి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.


ఇదీ జరిగింది..


హాంకాంగ్‌ అధికారుల కథనం ప్రకారం.. ఘ‌ట‌న జ‌రిగిన రోజు లుసిడి సాయంత్రం 6 గంటల సమయంలో బిల్డింగ్ సెక్యూరిటీ వద్దకు వచ్చాడు. 40వ అంతస్తులో తన మిత్రుడు ఉన్నాడని చెప్పి లోపలకు వెళ్లిపోయాడు. కానీ, 40వ అంతస్తులోని ఆ వ్యక్తి.. లుసిడి ఎవరో తనకు తెలియదని సెక్యూరిటీకి చెప్పాడు. సెక్యూరిటీ సిబ్బంది లుసిడిని ఆపేందుకు య‌త్నించ‌గా, అప్పటికే అత‌డు ఎలివేటర్‌లోకి వెళ్లిపోయాడు. అతడు 49వ ఫ్లోర్‌ నుంచి మెట్ల మార్గంలో పైకి వెళ్లినట్లు అక్కడి వారు చెబుతున్నారు. అత‌డి కోసం సెక్యూరిటీ సిబ్బంది గాలించిన‌ప్ప‌టికీ, భవనం పైకప్పుపై కనిపించలేదని పేర్కొన్నారు.  7.38 గంట‌ల‌ సమయంలో అతడిని పెంట్‌హౌస్‌లోని పనిమనిషి చూసి పోలీసులకు కాల్‌ చేసింది. అనంతరం అతడు పట్టుతప్పి కిందపడిపోయాడు. అతడు బ్యాలెన్స్‌ తప్పడంతో సాయం కోసం కిటీకిని తన్ని ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో లుసిడి కెమెరాను స్వాధీనం చేసుకొన్నారు. అందులో అతని అడ్వెంచర్‌ వీడియోలన్నీ ఉన్నాయి. ఓ సాహ‌సికుడిగా రెమీ లుసిడి పేరు చ‌రిత్ర‌లో నిలిచి ఉంటుంద‌ని అంటున్నారు అభిమానులు. అయితే ఇటువంటి సాహ‌సాల‌ను చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.