Pakistan Prime Minister Shehbaz Sharif: ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి పాకిస్తాన్‌కు పూర్తిగా మతిపోయింది. ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు. కిందపడినా సరే తమదే విజయమని సంబరాలు చేసుకుంటున్నారు. భారత్ దాడిలో చాలా విధ్వంసం జరిగిందని విదేశీ మీడియా కోడై కూస్తున్నప్పటికీ నిజాలు గుర్తించలేకపోతున్నారు. ఇప్పుడు భారత్‌ను హెచ్చరిస్తున్నారు. మరోసారి దాడి చేయొద్దని వార్నింగ్‌లు ఇస్తుననారు.
పహల్గాం దాడి జరిగినప్పటి నుంచి పాకిస్థాన్ ఇలాంటి ఉత్తుత్తి వార్నింగ్‌లు ఇస్తూనే ఉంది. మా వద్ద అణు ఆయుదాలు ఉన్నాయని చెబుతూ వచ్చింది. భారత్ దాడి చేస్తే చూపుతోనే చంపేస్తామంటూ హెచ్చరికలు చేసింది. తీరా భారత్ ఉగ్రవాదులపై దాడి చేసే సరికి ఏం చేయాలో తెలియక డ్రోన్‌లు, క్షిపణులు పంపించింది. వాటిని మన సైన్యం సరిహద్దు దాటకుండానే ధ్వంసం చేసింది. అంతేకాదు వాళ్ల అడ్డాలోనే ఉరికించి కొట్టింది. భారీ విధ్వంసం సృష్టించింది.
ఇంత జరిగినా పాకిస్తాన్‌కు ఇంకా బుద్ది వచ్చినట్టు లేదు. మరోసారి పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మతిలేని వార్నింగ్లు ఇస్తున్నారు. శుక్రవారం (మే 16, 2025) యౌమ్-ఎ-తషక్కూర్ (ధన్యవాద దినోత్సవం) వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పాకిస్తాన్ సైన్యాన్ని సత్కరించారు.
అదే సమయంలో, షెహబాజ్ షరీఫ్ తన ప్రసంగంలో భారతదేశానికి మరోసారి హెచ్చరిక జారీ చేస్తూ, పాకిస్తాన్ ఒక శాంతికాముకల దేశం అని ముసుగు తొడుక్కున్నారు. పాకిస్తాన్ తన ఆత్మరక్షణ కోసం తీవ్రమైన ప్రతిస్పందన ఇవ్వడానికి హక్కు కలిగి ఉందని అన్నారు.
ప్రధానమంత్రి నివాసంలో యౌమ్-ఎ-తషక్కూర్ వేడుకలు
ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇస్లామాబాద్‌లోని ప్రధానమంత్రి నివాసంలో జరిగిన యౌమ్-ఎ-తషక్కూర్ వేడుకల సందర్భంగా పాకిస్తాన్ జెండాను ఎగురవేశారు. షెహబాజ్ షరీఫ్ ప్రసంగంలో ఆపరేషన్ సింధూర్ భయం స్పష్టంగా కనిపించింది. ఆయన హెచ్చరిస్తూ, "పాకిస్తాన్ ఒక శాంతి ప్రియుల దేశం, కానీ తన రక్షణ కోసం తీవ్రమైన ప్రతిస్పందన ఇవ్వడానికి హక్కు కలిగి ఉంది" అని అన్నారు. ఈ సందర్భంగా షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ సైన్యంను ప్రశంసించారు. పాక్ సైన్యం దేశ సైనిక చరిత్రలో ఒక స్వర్ణాధ్యాయాన్ని రచించిందని ఆయన అన్నారు.
ఆపరేషన్ సింధూర్‌లో మరణించిన స్క్వాడ్రన్ లీడర్ ఇంటికి షెహబాజ్
పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఆపరేషన్ సింధూర్‌లో మరణించిన స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్ ఇంటికి వెళ్లి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, సైన్యాధ్యక్షుడు జనరల్ ఆసిమ్ మునీర్ , సమాచార మంత్రి అత్తాఉల్లా తారర్ కూడా ఉన్నారు.
రేడియో పాకిస్తాన్ ప్రకారం, యౌమ్-ఎ-తషక్కూర్ సందర్భంగా ఇస్లామాబాద్‌లో 31 తుపాకుల సలాం, రాష్ట్ర రాజధానులలో 21 తుపాకుల సలాంలతో రోజు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. సాయుధ దళాలతో ఏకత్వాన్ని ప్రదర్శించేందుకు ర్యాలీలు కూడా నిర్వహించారు.
పాకిస్తాన్ రాజీ పడదు: ఆసిఫ్ అలీ జర్దారి
అదే సమయంలో, ఈ సందర్భంగా పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి, "పాకిస్తాన్ తన సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రత, దేశ మంచి కోసం ఎప్పటికీ రాజీ పడదు" అని అన్నారు.