Ramayana, Mahabharata In Saudi Arabia School Curriculum: సౌదీ అరేబియా (Saudi Arabia) విద్యా వ్యవస్థలో భారతదేశ చరిత్ర, సంస్కృతులు భాగం అవుతున్నాయి. అక్కడి ఇంటర్నేషనల్ పాఠశాలల్లో బోధించే పాఠాల్లో భారతదేశ మతాలు, ధర్మం గురించి ప్రస్తావించారు. హిందూ సాహిత్యంలో మహాభారతం, రామాయణాలను పాఠ్యాంశాలుగా చేర్చారు. 


దక్షిణాసియా చరిత్ర, భౌగోళికం, సింధు లోయ నాగరికత, ఆర్యుల నాగరికతలను విద్యార్థులకు ప్రత్యేక చాప్టర్లుగా పొందుపరిచారు. మరో విభాగంలో భారతదేశంలోని హిందూ మతం, బౌద్ధమతం గురించి వివరించారు. అలాగే భారతదేశంపై దండయాత్రల గురించి పాఠ్యాంశాలుగా చేర్చారు. 


అరేబియాలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్ధి తల్లి దీని గురించి వీడియో తీశారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆమె తన పేరు ప్రస్తావించకుండా, భౌగోళిక శాష్త్రం పుస్తకంలోని కొన్ని ఫొటోలను షేర్ చేసింది. విద్యార్థుల సాంస్కృతిక జ్ఞానాన్ని పెంపొందించేందుకు, యోగా, ఆయుర్వేదం వంటి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన భారతీయ సంస్కృతులపై అధ్యయనం చేసేందుకు ఈ పాఠ్యాంశాలు దోహదపడతాయని పేర్కొంది.  


విజన్ 2030లో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం పలు కీలక సంస్కరణలు చేపట్టింది. విద్యార్థుల పాఠ్యాంశాల్లో రామాయణం, మహాభారతాన్ని ప్రవేశపెట్టడంపై అధ్యయనం చేస్తున్నారు. దీనితో పాటుగా ఇంగ్లిష్‌ను తప్పనిసరి చేశారు. దీనితో ఆదేశ విద్యార్థులు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందేందుకు దోహదపడుతుందని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది.


సౌదీ అరేబియా విజన్-2030, సిలబస్‌ గురించి ఆదేశానికి చెందిన సోషల్ మీడియా ఎక్స్  వినియోగదారుడు ట్వీట్ చేశారు. కొత్త సిలబస్ సమగ్రమైన, సహనంతో కూడిన భవిష్యత్తును నిర్మించడంలో సహాయపడతాయని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఆయన తన కొడుకు సిలబస్ స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నాడు.


‘ఇందులో అనేక రకాల సంస్కృతులు ఉన్నాయి. సాంఘిక శాష్త్రం పుస్తకంలో హిందూ మతం, బౌద్ధమతం, రామాయణం, కర్మ, మహాభారతం, ధర్మం, భారత చరిత్ర గురించి ఉన్నాయి. ఇవి నా కొడుకు చదువులో భాగం అవడం సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. అయితే ఈ పాఠ్యాంశాలు ప్రభుత్వంచే ఆమోదించబడలేదు. సౌదీ అరేబియాలోని కొన్ని ఇంటర్నేషనల్ స్కూళ్లు మాత్రమే భారతీయ చరిత్ర, రామాయణం, మహాభారతాన్ని పాఠ్యాంశాలుగా బోధిస్తున్నాయి.  


ఇదే అంశం రెండేళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. సౌదీ అరేబియాకు చెందిన ప్రసిద్ధ కాలమిస్ట్ ఇబ్రహీం అల్-సులైమాన్ తన ట్వీట్ ద్వారా స్పందించారు. సౌదీ అరేబియా ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూళ్లల్లో పాఠ్యప్రణాళిక నిర్ణయించుకోవడానికి స్వేచ్ఛ ఉందని, ఈ స్కూళ్ళు వారి స్వంత ఫ్రేమ్‌వర్క్‌లు పాటిస్తాయని తెలిపాడు. అయితే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల పాఠ్యప్రణాళిక ఒకటే కాదన్నారు. ఇంకో వ్యక్తి స్పందిస్తూ ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్ కొన్నేళ్లుగా ఇదే పాఠ్యాంశాలను బోధిస్తుందని ట్వీట్ చేశారు.