Pakistan Iran Row: పాకిస్థాన్, ఇరాన్ మధ్య విభేదాలు  (Pakistan Iran Tensions) ముదిరాయి. పాక్‌లోని బలూచిస్థాన్‌పై ఇరాన్‌ దాడులు చేసింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌ దాడులకు పాక్ ప్రతీకారం తీర్చుకుంది. ఇరాన్‌లోని ఉగ్రస్థావరాలపై పాక్ దాడి చేసింది. Siestan-o-Baluchistan ప్రావిన్స్‌లో కొందరు ఉగ్రవాదులు రహస్యంగా తలదాచుకున్నారని తెలిసి ఆ ప్రాంతాలపైనే బాంబుల వర్షం కురిపించింది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. అంతే కాదు. ఈ ఆపరేషన్‌కి Marg Bar Sarmachar అని పేరు పెట్టింది. పాకిస్థాన్‌తో సరిహద్దు పంచుకునే ప్రాంతంలోనే ఈ దాడి జరగడం మరింత అలజడి సృష్టించింది. పాకిస్థాన్‌ బదులు తీర్చుకునేందుకు వరుస పెట్టి దాడులు చేసిందని....ఈ ఘటనలో నలుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు మృతి చెందారని స్థానిక మీడియా వెల్లడించింది. ఇప్పటికే పాకిస్థాన్‌ ఇరాన్‌పై తీవ్రంగా మండి పడుతోంది. బలూచిస్థాన్‌పై దాడి చేయడాన్ని ఖండించింది. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. ఇరాన్ అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘించిందని అసహనం వ్యక్తం చేసింది. 


దీటుగా బదులిస్తాం: పాకిస్థాన్


ఈ దాడులపై ఇరాన్ విదేశాంగ మంత్రి స్పందించారు. పాకిస్థాన్‌లోని Jaish al-Adl టెర్రరిస్ట్ గ్రూప్‌ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు వెల్లడించారు. ఇదో సున్నీ మిలిటెంట్ గ్రూప్. 2012లో ప్రారంభమైన ఈ ఉగ్ర సంస్థ పాకిస్థాన్‌ సరిహద్దులో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అయితే...ఈ దాడుల తరవాత పాకిస్థాన్‌ చాలా తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌లోని తమ దౌత్యవేత్తని వెనక్కి పిలిపించింది. పాకిస్థాన్‌కి ఇరాన్ అంబాసిడర్ రాకుండా ఆంక్షలు విధించింది. అటు ఇరాక్‌, సిరియాని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తున్న సమయంలోనే పాక్‌పైనా దాడులు జరగడం పరిస్థితుల్ని ఉద్రిక్తంగా మార్చాయి. ఈ దాడులకు కచ్చితంగా దీటైన బదులు ఇస్తామని ఇప్పటికే పాకిస్థాన్ ప్రకటించింది. ఈ దాడుల తరవాత రెండు దేశాల మధ్య ఇన్నాళ్లూ ఉన్న బంధానికి బీటలువారే అవకాశముందని తేల్చి చెప్పింది.