రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీకి కోర్టులో షాక్ తగిలింది. మోసం, కోర్టు ధిక్కరణ అభియోగాలకు సంబంధించిన కేసుల్లో నావల్నీని కోర్టు దోషిగా తేల్చింది. ఆయనకు తొమ్మిదేళ్ల కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దాదాపు రూ.8.75 లక్షల జరిమానా చెల్లించాలని కూడా అందులో పేర్కొంది. తాజా తీర్పుపై నావల్నీ అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది.
పుతిన్‌తో అంతే
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు నావల్నీ రాజకీయాల్లో బద్ధ శత్రువు. ఆయన్ను దీర్ఘకాలంపాటు జైలుకు పరిమితం చేసేందుకుగాను దురుద్దేశపూర్వకంగా తప్పుడు అభియోగాలు మోపినట్లు పుతిన్‌పై విమర్శలు వస్తున్నాయి.
నావల్నీ 2021 జనవరిలో అరెస్టయ్యారు. ఓ పాత కేసులో పెరోల్ నిబంధనలను ఉల్లంఘించారన్న అభియోగాలపై ఇప్పటికే రెండున్నరేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నారు.
ఇదే కేసు
2014లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలను కూడా నావల్నీ ఎదుర్కొంటున్నారు. 2020లో ఆయనపై విష ప్రయోగం జరిగింది. అనంతరం చికిత్స తర్వాత 2021 జనవరి 17న జర్మనీ నుంచి స్వదేశానికి వచ్చిన నావల్నీని విమానాశ్రయంలో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరిలో కోర్టు ముందు హాజరుపరిచిన అనంతరం నావల్నీని జైలుకు తరలించారు. అక్కడి జైలు అధికారులు వేధిస్తున్నారనే ఆరోపణలతో నావల్నీ నిరాహార దీక్ష కూడా చేశారు.
అయితే, అధ్యక్షుడు పుతిన్ నావల్నీని హత్య చేయించేందుకు ప్రయత్నం చేసినట్లు వచ్చిన ఆరోపణలను క్రెమ్లిన్ ఖండించింది. అయితే, ప్రతిపక్ష నాయకుడి అరెస్టును ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. కానీ పుతిన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు ఏకంగా నావల్నీకి 9 ఏళ్ల జైలు శిక్ష పడింది.
ఉక్రెయిన్‌పై యుద్ధంలోనూ పుతిన్ ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా లెక్కచేయడం లేదు. తమ లక్ష్యాన్ని చేరుకునే వరకు ఉక్రెయిన్‌ను విడిచిపెట్టబోమని పుతిన్ తేల్చిచెప్పారు. దాదాపు నెల రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తోంది.
Also Read: Russia Ukraine War: రష్యా అంటే నాటోకు భయం- ఊ అంటారా ఊఊ అంటారా: జెలెన్‌స్కీ
Also Read: Russia Ukraine War: రష్యాపై ఆంక్షలు విధిస్తే భారత్ వణుకుతోంది: బైడెన్