Russia-Ukraine War:
జెలెన్‌స్కీ అమెరికా పర్యటన..
ఉక్రెయిన్‌కి మొదటి నుంచి మద్దతునిస్తూ వస్తోంది అగ్రరాజ్యం. రష్యా సైనిక చర్యని తీవ్రంగా ఖండిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చాలా సార్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. పూర్తి స్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే అమెరికా పర్యటనకు వచ్చిన జెలెన్‌స్కీ అక్కడి ఫైనాన్షియర్‌లు, బడా వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌లో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. రష్యా యుద్ధం కారణంగా ధ్వంసమైన దేశాన్ని మళ్లీ నిర్మించుకునేందుకు తంటాలు పడుతున్నారు జెలెన్‌స్కీ. ఈ విషయంలో అమెరికా సాయం తీసుకుంటున్నారు. పెట్టుబడులు భారీగానే వెల్లువెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.
"అమెరికాలోని బడా వ్యాపారవేత్తలతో సమావేశమయ్యాను. అందరూ ఉక్రెయిన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మా దేశాన్ని రీబిల్డ్ చేసుకునేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. బహుశా భారీగానే పెట్టుబడులు వస్తుండొచ్చు. కాకపోతే యుద్ధం ముగిసిన తరవాతే ఈ ఇన్వెస్ట్‌మెంట్‌లు తరలి వస్తాయి. ఈ యుద్ధంలో గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం"
- జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు
కెనడాలోనూ పర్యటన..
అమెరికాతో పాటు కెనడాలోనూ పర్యటించారు జెలెన్‌స్కీ. రెండు దేశాల సహకారం కోరారు. మిలిటరీ సహకారంతో పాటు ఆర్థిక సాయం కూడా కావాలని విజ్ఞప్తి చేశారు. రష్యా ఉక్రెయిన్ మధ్య దాదాపు 19 నెలలుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. చర్చలకు సిద్ధమే అని రష్యా పైకి చెబుతున్నా...సైనిక చర్య మాత్రం ఆపడం లేదు. ఈ యుద్ధం కారణంగా ఇరువైపులా భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.