China's Real Estate Sector: 


రియల్ ఎస్టేట్ సెక్టార్ కుదేలు..


చైనాలో కొత్త సమస్య వచ్చి పడింది. ప్రస్తుతం అక్కడి జనాభా 140 కోట్లకు పైగానే ఉంది. అయినా అక్కడ చాలా ఇళ్లు ఖాళీగానే కనిపిస్తున్నాయి. ప్రాపర్టీ సెక్టార్ దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఇళ్లు పూర్తిగా నిండిపోవాలంటే ఉన్న 140 కోట్ల జనాభా కూడా చాలడం లేదట. దేశవ్యాప్తంగా చాలా చోట్ల అపార్ట్‌మెంట్‌లు బోసిగా కనిపిస్తున్నాయి. చైనా రియల్ ఎస్టేట్ సెక్టార్‌పై చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అఫీషియల్‌గా ఓ అధికారి ఈ విషయం వెల్లడించారు. చైనాలోని  statistics bureau మాజీ డిప్యుటీ హెడ్ హీ కెంగ్ (He Keng) లెక్కలతో సహా వివరించారు. 


"చైనాలో ఎన్ని ఇళ్లు ఖాళీగా ఉన్నాయని అడిగితే ఒక్కొక్కరూ ఒక్కో లెక్క చెబుతున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఓ నంబర్‌పై అందరికీ క్లారిటీ వచ్చింది. దాదాపు 300 కోట్ల మందికి సరిపడా ఖాళీ ఇళ్లు కనిపిస్తున్నాయి. ఈ అంచనా చాలా ఎక్కువగా అనిపిస్తుండొచ్చు. కానీ పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఇప్పుడున్న 140 కోట్ల మంది జనాభాతో ఆ ఖాళీ ఇళ్లను ఫిల్ చేయలేం"


- హీ కెంగ్, చైనా అధికారి


2021 నుంచే పతనం..


2021 నుంచే చైనాలో రియల్ ఎస్టేట్ సెక్టార్ పతనం మొదలైంది. ఆ దేశ రియల్ ఎస్టేట్‌ రంగంలో అతి పెద్ద కంపెనీ అయిన China Evergrande Group అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆ తరవాత కొత్త ఇళ్ల కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి. మరో బడా సంస్థ Country Garden Holdings పరిస్థితీ ఇదే. దాదాపు దివాళా వరకూ వచ్చేసింది. ఫలితంగా ప్రాపర్టీలు కొనాలనుకునే వాళ్లు వెనకడుగు వేస్తున్నారు. చైనా National Bureau of Statistics (NBS) లెక్కల ప్రకారం ప్రస్తుతానికి అక్కడ అమ్ముడు పోని ఇళ్ల విస్తీర్ణం 648 మిలియన్ చదరపు మీటర్లుగా ఉంది. ఆగస్టు చివరి నాటి లెక్కలు ఇవి. సగటున ఓ ఇంటికి 90 చదరపు మీటర్ల విస్తీర్ణంతో లెక్కగట్టినా మొత్తంగా 72 లక్షల ఇళ్లు ఖాళీగా ఉన్నట్టు లెక్క. ఇక కొన్ని ప్రాజెక్ట్‌లు దాదాపు పూర్తై అమ్ముడుపోయినప్పటికీ ఇంకా కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. 2016లోనే ప్రాపర్టీలు కొని పెట్టుకున్న వాళ్లు ఇప్పుడు వాటిపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా...అలా పెద్ద ఎత్తున ఇళ్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. తమ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో రికవరీ అయిపోయిందని చైనా పదేపదే ప్రచారం చేసుకుంటోంది. కానీ అక్కడ వాస్తవాలు మాత్రం వేరుగా ఉన్నాయి. చైనా పరిస్థితి అయిపోయిందని, ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనన్న వాదనలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. కానీ చైనా మాత్రం ఆ ప్రచారాన్ని కొట్టి పారేస్తోంది. నిజాలు దాచిపెట్టడం చైనాకి కొత్తేమీ కాదు. కరోనా సమయంలోనూ మృతుల సంఖ్యని దాచి పెట్టి చీవాట్లు పెట్టించుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మందలించింది. అయినా డ్రాగన్ తీరు మారలేదు. 


Also Read: ఆ ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగానే భారత్‌పై కెనడా ఆరోపణలు! వెలుగులోకి సంచలన విషయం