Ukraine Russia War: అణ్వాయుధాల వినియోగంపై రష్యా సంచలన వ్యాఖ్యలు- అమెరికా సీరియస్

ABP Desam   |  Murali Krishna   |  24 Mar 2022 04:01 PM (IST)

అణ్వాయుధాలు వినియోగంపై రష్యా మరోసారి హెచ్చరికలు చేసింది. తమ మనుగడకు ప్రమాదమొస్తే అణ్వాయుధాలు కూడా వినియోగిస్తామని రష్యా తెలిపింది.

అణ్వాయుధాల వినియోగంపై రష్యా సంచలన వ్యాఖ్యలు- అమెరికా సీరియస్

అణ్వాయుధాల వినియోగంపై రష్యా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ మనుగడకు ముప్పు వాటిల్లితే అణ్వాయుధ వినియోగానికి కూడా సిద్ధంగా ఉన్నామని రష్యా హెచ్చరికలు చేసింది. అమెరికాకు చెందిన సీఎన్‌ఎన్‌కు ఇచ్చి ఓ ఇంటర్వ్యూలో రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

"పుతిన్‌ అణ్వాయుధాల వినియోగానికి అనుమతించరని మీరు నమ్ముతున్నారా?" అని అడిగిన ప్రశ్నకు దిమిత్రి ఇలా బదులిచ్చారు.

మా మనుగడకు ముప్పుంటే అణ్వాయుధ వినియోగాన్ని అధ్యక్షుడు పుతిన్‌ తోసిపుచ్చరు. మా దేశీయ భద్రతా విధానంలో అణ్వాయుధాల వాడకానికి తగిన కారణాలున్నాయి. ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో మా ఉనికికి ముప్పు కలిగితే భద్రతా విధానం ప్రకారం మేం అణ్వాయుధాలు వాడొచ్చు.                                                       - దిమిత్రి పెస్కోవ్, క్రెమ్లిన్ అధికార ప్రతినిధి

గుర్రుగా అమెరికా

రష్యా చేసిన ప్రకటనపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. దిమిత్రి చేసిన వ్యాఖ్యలపై అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ప్రతినిధి జాన్‌ కిర్బీ మండిపడ్డారు.

ఇది ప్రమాదకర ధోరణి. అణ్వాస్త్రాలు కలిగిన ఓ బాధ్యతాయుత దేశం ప్రవర్తించాల్సిన తీరు ఇది కాదు. పరిస్థితిని ప్రతి రోజూ పర్యవేక్షిస్తాం.                                                           -   జాన్ కిర్బీ, పెంటగాన్ ప్రతినిధి

రష్యాకు నష్టం

యుద్ధంలో ఉక్రెయిన్ నష్టం గురించే అందరూ మాట్లాడుతున్నారు. కానీ రష్యాకు ఏ మేర నష్టం కలిగిందో క్రెమ్లిన్ పూర్తిగా చెప్పడం లేదు. అయితే నాటో అధికారి ఒకరు మాత్రం.. నాలుగు వారాల్లో రష్యాకు చెందిన 7 వేల నుంచి 15 వేల మంది సైనికులు మృతి చెంది ఉంటారని తెలిపారు. మరో 30 వేలన నుంచి 40 వేల మంది సైనికులకు గాయాలు కావడం, బందీలుగా దొరకడం, కనపడకుండా పోవడం వంటివి జరిగి ఉంటాయని వెల్లడించారు. 

మరోవైపు ఈ యుద్ధంలో 2,500 మంది వరకు పౌరులు మృతి చెంది ఉంటారని ఐరాస తెలిపింది. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

ఇప్పటికే ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ లాంటి నగరాలు ధ్వంసమయ్యాయి. దక్షిణ నగరమైన మరియూపోల్‌ను కూడా రష్యా బలగాలు ముట్టడించాయి.

Also Read: Viral News: పిల్లి చేసిన లొల్లి- ఒకటి, రెండు కాదు రూ.100 కోట్ల నష్టం, ఇంకేంటంటే?

Also Read: Russia Ukraine War: 4 వారాల్లో ప్రపంచాన్నే మార్చేసిన రష్యా- ఉక్రెయిన్ యుద్ధం- నెగ్గేదెవరు? తగ్గేదెవరు?

Published at: 24 Mar 2022 04:00 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.