ఉక్రెయిన్‌ ఆర్మీ, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని రష్యా పదేపదే చెబుతున్నప్పటికీ వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. రష్యా సైనికులు చేస్తున్న దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.


ఉక్రెయిన్ మహిళలపై రష్యా సైనికులు అత్యాచారాలకు తెగబడుతున్నారని ఇప్పటికే చాలా సార్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఓ షాకింగ్ విషయం బయటపడింది. కన్నబిడ్డ పక్కనే గుక్క పట్టి ఏడుస్తున్నా వదలకుండా ఆ తల్లిని రష్యా సైనికులు అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఎంపీ మరియా మెజెంత్సేవా ఓ టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు.


ఏం జరిగింది?


ఉక్రెయిన్‌లో భీకర దాడులు చేస్తోన్న రష్యా సైనికులు.. ఓ మహిళ  ఇంటి వద్దకు వచ్చి మొదట ఆ  ఇంట్లోని పెంపుడు కుక్కను చంపేశారు. ఆ తర్వాత  మహిళ భర్తను కూడా చంపేశారని ఎంపీ తెలిపారు. ఆ తర్వాత రష్యా సైనికులు మహిళ తలపై తుపాకి పెట్టి తాము చెప్పినట్టు వినకపోతే చంపేస్తామని బెదిరించారట. ప్రతిఘటించినప్పటికీ ఆ మహిళపై రష్యా సైనికులు సామూహిక అత్యాచారం చేశారు.


ఆ సమయంలో బాధిత మహిళ నాలుగేళ్ల కొడుకు భయంతో బాయిలర్‌ రూమ్‌లో గుక్కపెట్టి ఏడుస్తూ ఉన్నాడు. అయినప్పటికీ రష్యా సైనికులు వదల్లేదని.. బాధిత మహిళ ఆ నాటి  ఘటనను గుర్తుతెచ్చుకుంటూ కన్నీటి పర్యంతమైందని ఎంపీ వివరించారు.  ఆ తర్వాత మహిళ తన  కుమారుడితో  అక్కడి నుంచి భయంతో పారిపోయిందని, ఆమె  భర్త శవాన్ని కూడా అక్కడే వదిలేశారని ఎంపీ అన్నారు. ప్రస్తుతం అధికారులు ఈ  ఆరోపణలపై విచారణ చేపట్టారు.


చర్చలు సఫలం


మరోవైపు రష్యా-ఉక్రెయిన్​ మధ్య చర్చలు మొత్తానికి ఫలించాయి. యుద్ధం ముగింపు దిశగా అడుగులు వేసేలా రెండు దేశాల మధ్య కీలక ఏకాభిప్రాయం కుదిరింది. టర్కీలోని ఇస్తాంబుల్​లో జరిగిన చర్చలు ఫలప్రదంగా సాగినట్లు రష్యా రక్షణ శాఖ సహాయ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ ప్రకటించారు.


రాజధాని కీవ్ సహా మరో ప్రధాన నగరమైన చెర్నిహివ్​ నుంచి సైన్యం ఉపసంహరణకు రష్యా అంగీకరించింది. శాంతి చర్చలపై ఉక్రెయిన్​కు మరింత భరోసా కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. 


Also Read: COVID-19 Lockdown in China: అదే వైరస్, అదే భయం, అదే వణుకు- చైనాలో మళ్లీ లాక్‌డౌన్


Also Read: Optical Illusion: ఈ ఫోటోలో మీకు ఏం కనిపిస్తోందో చెప్పండి, మీరెలాంటి వ్యక్తిత్వం కలవారో తెలిసిపోతుంది