Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగడాన్ని అమెరికా సహా పలు దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. గురువారం రోజు రష్యా జరిపిన బాంబు దాడులలో పౌరులు, సైనికులు కలిపి మొత్తం 137 మంది చనిపోయారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Ukraine President Volodymyr Zelensky) నేటి ఉదయం ప్రకటించారు. రష్యాతో యుద్ధం విషయంలో తమను ఒంటరిని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పౌరులను యద్ధం చేయాలని, ఆయుధాలు సమకూర్చుతామని చెప్పిన జెలెన్‌స్కీ సైనికుడి దుస్తులు ధరించి స్వయంగా యుద్ధరంగంలోకి దిగారు. ఈ ఫొటో నెటిజన్లను సైతం కదిలిస్తోంది.


గురువారం అర్ధరాత్రి జెలెన్‌స్కీ దేశంలో ప్రస్తుత పరిస్థితి (Ukraine Russia Conflict)పై మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. సొంత భూమి కోసం, దేశం కోసం తాము చేస్తున్న పోరాటంలో ఒంటరిగా మిగిలిపోయామన్నారు. దేశాన్ని రక్షించుకునేందుకు యుద్ధం చేయడానికి ఎంత మంది ముందుకువస్తారని అడిగారు. రష్యా విధ్వంసకర టీమ్స్ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోకి చొరబడ్డాయని, పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజధానిలో కర్ఫ్యూను పాటించి ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకూడదని చెప్పారు. రష్యా ఇప్పటివరకూ ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో యుద్ధాన్ని మొదలుపెట్టగా, త్వరలోనే పశ్చిమ ఉక్రెయిన్‌లోనూ దాడులు జరిపేందుకు వ్యూహాలు రచిస్తోంది.






రష్యా తనను తొలి టార్గెట్ చేసుకోగా, తన కుటుంబాన్ని సైతం శత్రుసేనలు లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొన్నారు. దేశ అధినేతను, ఆయన కుటుంబాన్ని బంధించి ఉక్రెయిన్‌ను అన్ని విధాలుగా నాశనం చేయాలని వ్యూహాలు పన్నారని జెలెన్‌స్కీ ఆరోపించారు. శుక్రవారం సైతం రష్యా బాంబు దాడులు కొనసాగుతున్నాయి. సమ్మీ నగరంలో ఆటోమేటిక్ గన్స్ ద్వారా యుద్దాన్ని మరో దశకు తీసుకెళ్లాయి రష్యా బలగాలు. అందాల సమ్మీ నగరం నిప్పుల కొలిమిలా మారిపోయింది. ఎటు చూసినా మంటలు, శిథిలాలతో అందవిహీనంగా, జీవం కోల్పోయినట్లుగా తయారైంది.






ఇంత అరాచకానికి పాల్పడుతున్న రష్యా అంతకంతకూ అనుభవించాల్సి వస్తుందని ఉక్రెయిన్ పౌరులు అన్నారు. యుద్ధాన్ని ఆపాలని, శాంతికి పిలుపునివ్వాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు. పలు దేశాలు ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై స్పందిస్తున్నాయి. కానీ నేరుగా ఉక్రెయిన్‌కు సాయం అందకపోవడంతో అధ్యక్షుడు జెలెన్‌స్కీ జోక్యం కోసం పలు దేశాలను అడిగారు. నేడు సైతం రెండో రోజూ రష్యా దాడులు ముమ్మరం చేసింది.


ఉక్రెయిన్‌కు చెందిన 11 ఎయిర్‌ఫీల్డ్స్, 18 రాడార్ స్టేషన్లు, మూడు కమాండ్ పోస్టులను రష్యా ధ్వంసం చేసింది. తూర్పు ఉక్రెయిన్‌లో శుక్రవారం సైతం బాంబుల వర్షం కురిపిస్తోంది రష్యా. చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం రష్యా ఆధీనంలోనే ఉంది. ఉక్రెయిన్ పై దాడులు నిలిపివేయాలని ఫ్రాన్స్ అధినేత మేక్రాన్ కూడా సూచించారు.


Also Read: Russia Ukraine Crisis: రష్యాను వెనకేసుకొచ్చిన చైనా, అవి దాడులు కావట ! 


Also Read: Russia Ukraine Conflict: ఉక్రెయిన్​పై రష్యా దాడులు, తొలిరోజు 137 మంది మృతిచెందారని జెలెన్‌స్కీ వెల్లడి