Putin and Kim ఉత్తర కొరియా నియంత కిమ్‌కి రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ డ్రైవర్ గా మారిపోయారు. 24 ఏళ్లలో ఎప్పడూ ఉత్తర కొరియా రాని పుతిన్ ఈ సారి ఎందుకొచ్చారు?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తో దోస్తీ కట్టేందుకు ఎందుకో బాగా ఆసక్తి చూపిస్తున్నాడు. ఇటీవల కిమ్ కు తన ప్రెసిడెన్షియల్ కార్ అయిన ఆరస్ సెనట్ ని గిఫ్ట్ పంపిన పుతిన్ ఈ సారి నేరుగా ఉత్తర కొరియాకు కిమ్ ను కలిసేందుకు వెళ్లాడు.
అయితే తన వెంట మరో ఆరస్ సెనట్ కారు తీసుకొచ్చి కిమ్ కి ఇచ్చాడు. గత 24 ఏళ్లలో ఎప్పుడూ ఉత్తర కొరియాకు రాని రష్యా అధ్యక్షుడు కిమ్ కోసం రావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనికి తోడు ఇప్పుడు ఈ ఆరస్ సెనట్ కారు కూడా వార్తల్లో నిలిచింది.
స్నేహ హస్తం..
ఉత్తర కొరియాతో వ్యూహాత్మక మైత్రి కోసం గత కొంత కాలంగా రష్యా చూస్తోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ లు ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఉత్తర కొరియాకు వచ్చేటప్పుడు తమ స్నేహానికి గుర్తుగా పుతిన్ ఆరస్ సెనట్ అనే లావిష్ రష్యన్ ఫుల్ సైజు కారును తనతో తీసుకురావడం, గతంలోనూ ఈ కారు ఒక సారి కిమ్ కు పంపించడం వెనక ఆంతర్యమేంటో ఎవ్వరికీ అర్థం కావట్లేదు.
అసలీ కారు సంగతేంటి?
ఆరస్ సెనట్ అనేది రష్యాకు చెందిన ప్రెసిడెన్షియల్ కారు. దీన్ని రాజకుటుంబాలు మాత్రమే ఉపయోగిస్తాయి. పొడవుగా లావిష్‌గా, ఖరీదైనదిగా కనిపించే ఈ కారు ధర దాదాపు మూడు లక్షల డాలర్లు. అంటే రెండున్న కోట్ల రూపాయల పైమాటే. పూర్తిగా ఆర్మర్ ప్రూఫ్ గా ఈ కారు ఉంటుంది. అంటే కారు రక్షన కవచం కలిగి ఉంటుందన్న మాట. అంటే గన్నులు, బుల్లెట్లు ఈ కారును ఏమీ చేయలేవు. దీంట్లో 4.4 లీటర్ల ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ ఉంది. దీని ద్వారా 598 హెచ్ పీ, 880 ఎన్ ఎమ్ భారీ టార్క్ విడుదలవుతుంది. అంటే ఆ రైడింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్ గా ఉంటుందన్నమాట. ఇక ఈ కారు మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ సెనట్, సెనట్ లాంగ్, సెనట్ లిమోసిన్ వెర్షన్లలో ఈ కారు దొరుకుతుంది. వీటిలో సెనట్ లిమోసిన్ వేరియంట్ ను పుతిన్ కిమ్ కు గిఫ్టిచ్చాడు.
డ్రైవర్ పుతిన్.. ఓనర్ కిమ్
బ్లాక్ కలర్లో ఉన్న లావిష్ రష్యన్ లిమోసిన్ అరస్ సెనట్లో ఈ అగ్ర రాజ్యాల అధ్యక్షులిద్దరూ టెస్ట్ రైడ్ కూడా చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలూ వీడియోలూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రష్యాకి చెందిన ఓ టీవీ ఛానల్ పుతిన్ ఒక ఆర్మర్డ్ బ్లాక్ ఆరస్ డ్రైవ్ చేస్తోన్న వీడియోని టెలికాస్ట్ చేసింది. పుతిన్ అధికారిక వాహనమైన ఆ ప్రెసిడెన్షియల్ కారులో కిమ్ జోంగ్ ఉన్ కూడా ప్యాసింజర్ సీటులో కూర్చొని ఉన్నాడు. పుతిన్ ఫిబ్రవరిలో కూడా ఓ ఆరస్ సెనట్ కారుని కిమ్ కి గిఫ్టిచ్చిన నేపథ్యంలో కిమ్ దగ్గర ఈ లక్జరీ క్లాస్ కార్ల సంఖ్య రెండుకు చేరింది.