Pak Power Bills: అధిక విద్యుత్ బిల్లులపై ఆగస్టు 3వ తేదీన పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మొదలైన నిరసనలు క్రమంగా పాకిస్థాన్ అంతటా దావానలంలా వ్యాపించాయి. పలు నగరాలు, పట్టణాల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల భారీ ధరల పెరుగుదలతో పీకల్లోతు కష్టాలు పడుతున్న సామాన్యులపై ఈ విద్యుత్ గుదిబండ మోపడంతో వారిలో ఓపిక నశించి రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. నిరసనల తీవ్రత కారణంగా పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కకర్ అత్యవసర సమావేశం నిర్వహించిన 48 గంటల్లో పరిష్కారం కనుక్కోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
3 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయ ప్యాకేజీని ఆమోదించే సమయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి విధించిన కఠినమైన షరతుల వల్ల పాక్ లో ద్రవ్యోల్బణంలో విపరీతంగా పెరిగిపోయింది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పూట గడవడం కూడా గగనంలా మారింది. అలాంటి సమయంలో కరెంటు ఛార్జీల పెంపు సమస్యను తీవ్రతరం చేసింది. దీంతో ఓపిక నశించిన పౌరులు.. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. పాక్ దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. అలాగే దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తీవ్రమైన కరెంటు కోతలు వేధిస్తున్నాయి. అధిక కరెంటు బిల్లులపై నిరసనగా రోడ్లపైకి వస్తున్న ప్రజలు.. ఇతర సమస్యలపైనా గళం విప్పుతున్నారని చరిత్రకారుడు అమ్మర్ అలీ జాన్ చెప్పుకొచ్చారు.
రాజకీయ అస్థిరత, నిరంకుశత్వం, సామాజిక వైరుధ్యాలు, ప్రకృతి విపత్తులతో ప్రజల జీవితం అగమ్యగోచరంగా మారిందని, సామాన్యులను అన్ని వైపుల సమస్యలు వేధిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అధిక విద్యుత్ బిల్లులు ఆ సమస్యలకు ఆజ్యం పోసి, ప్రజలను రోడ్లపైకి వచ్చి నిరసనలు చేసేలా ప్రేరేపించిందని పంజాబ్ యూనివర్సిటీ హిస్టరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అమ్మర్ అలీ తెలిపారు.
Also Read: UP Teacher: 'నేను తప్పు చేశాను, కానీ అందులో మతపరమైన విద్వేషమేమీ లేదు'
ఆగస్టు 3వ తేదీన పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ప్రారంభమైన నిరసనలు కరాచీ, ఖైబర్ వరకు వ్యాపించాయని చెబుతున్నారు. ప్రజలు తమ నెలవారీ ఆదాయంలో 20 నుంచి 50 శాతం వరకు విద్యుత్ బిల్లులు కట్టాల్సిన దుస్థితి వచ్చిందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి బిల్లుల ఫోటోలను సోషల్ మీడియాల్లో పోస్టు చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కరాచీ, పెషావర్, రావల్పిండిలో సామాన్య ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున పౌరులు రోడ్లపైకి వచ్చి విద్యుత్ బిల్లులను తగలబెడుతున్నారు. ప్రజలు తమ విద్యుత్ బిల్లులను తగలబెడుతున్న వీడియోను నేషనల్ ఈక్వాలిటీ పార్టీ జమ్మూ కాశ్మీర్ గిల్గిత్ బాల్టిస్థాన్ అండ్ లడఖ్ (NEPJKGBL) ఛైర్మన్ సజ్జాద్ రాజా షేర్ చేశారు. గుజ్రాన్ వాలాలో ఆందోళనకారుల నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. గుజ్రాన్ వాల్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ కార్యాలయాన్ని చుట్టుముట్టి దాడి చేశారు. నరోవల్, అటాక్, సర్గోధా, హరిపూర్ సహా అనేక నగరాల్లో నిరసనలు హోరెత్తుతున్నాయి.