Imran Khan Jail: 



జైల్లో సకల సౌకర్యాలు..


పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. తోషాఖానా కేసులో అరెస్ట్ అయిన ఆయనపై మరి కొన్ని కేసులు నమోదయ్యాయి. అటాక్ డిస్ట్రిక్ జైల్లో నరకం చూపిస్తున్నారని, ఎలాంటి సౌకర్యాలూ కల్పించడం లేదని చాలా సందర్భాల్లో ఇమ్రాన్ తరపున లాయర్‌లు వాదించారు. దాదాపు 20 రోజులుగా ఇదే అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇమ్రాన్. దీనిపై PTI కార్యకర్తలు తీవ్రంగా మండి పడ్డారు. హత్యలు, అత్యాచారాలు చేసిన నేరస్థుడి లాగా ట్రీట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వివాదాస్పదం అవడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఇమ్రాన్‌ ఖాన్‌కి జైల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఓ పోలీస్ ఉన్నతాధికారి ప్రత్యేకంగా ఇమ్రాన్‌ని కలిసి అక్కడి వసతులపై ఆరా తీశారు. ఇమ్రాన్‌ ఈ సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారట. ఆయన ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సీసీ కెమెరాల పొజిషన్ కూడా మార్చినట్టు అధికారులు వెల్లడించారు. మంచం, పరుపు, దిండు, కుర్చీ, ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదంతా చట్టానికి లోబడే చేసినట్టు తెలిపారు. ఫ్యాన్‌తో పాటు ఓ ప్రేయర్ రూమ్‌ని ఏర్పాటు చేశారు. ఖురాన్‌తో పాటు మరికొన్ని పుస్తకాలు, ఖర్జూర పండ్లు, తేనె, పర్‌ఫ్యూమ్, టిష్యూ పేపర్‌లు...ఇలా అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చారు. బాత్‌రూమ్‌ కూడా చాలా విలాసంగా ఉందట. ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీసేందుకు ఐదుగురు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. దాదాపు 8 గంటల పాటు వీళ్లు పని చేస్తున్నారు. స్పెషల్ డైట్‌ కూడా పాటిస్తున్నారు ఇమ్రాన్ ఖాన్. ఓ డాక్టర్ పూర్తిగా పరీక్షించిన తరవాతే ఆ ఆహారాన్ని ఇమ్రాన్‌కి అందిస్తున్నారు. 


ఇమ్రాన్ ముందు రెండు ఆప్షన్స్..


ప్రస్తుతానికి పాకిస్థాన్‌ నేషనల్ అసెంబ్లీ రద్దైంది. ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్‌ బాధ్యతలు తీసుకున్నారు. కానీ...అధికారం అంతా సైన్యం చేతుల్లోనే ఉంది. ఇమ్రాన్ ఖాన్‌పై పాక్ సైన్యం కుట్రపన్ని ఇలా జైలుపాలు చేసిందని PTI నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పాక్ సైన్యం...ఇమ్రాన్‌కి రెండు ఆప్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రాజకీయాల నుంచి తప్పుకోవడమో లేదంటే ఉరిశిక్షకు సిద్ధం కావడమో నిర్ణయించుకోవాలని ఆదేశించినట్టుగా సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడం ఇమ్రాన్‌ ఖాన్‌కి కత్తిమీద సామైంది. తరవాత ఏం జరగనుందో అన్న ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. ఇమ్రాన్ ఖాన్ ఇటీవలే ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. పాకిస్థాన్‌కి స్వేచ్ఛనివ్వాలని, అభివృద్ధి చేయాలని కలలు కన్న తనకు ఈ శిక్ష పడాల్సిందే అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇమ్రాన్‌ జైల్లో ఉన్న ఫొటోతో, పాత వీడియోలన్నీ కలిపి ఎడిట్ చేశారు. "అటోక్ జైల్, బరాక్ నంబర్ 3, ప్రిజనర్ నంబర్ 804" అంటూ మొదలైన ఈ వీడియోలో ఇమ్రాన్ ఖాన్ పాక్‌ కోసం ఏం చేయాలనుకున్నాడో వివరించారు.