PM Modi Ukraine Visit: ఇటీవ‌ల కాలంలో ప్ర‌పంచ దేశాల‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్న అంశం ఉక్రెయిన్ - ర‌ష్యా దేశాల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధమే. ఈ నేప‌థ్యంలో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఉక్రెయిన్‌లో ప‌ర్య‌టించ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ప్ర‌పంచ దేశాల‌న్నీ మోడీ ఉక్రెయిన్ ప‌ర్య‌ట‌న‌పై ఆస‌క్తిగా ఎదురు చూశాయి. ఒక రోజు ప‌ర్య‌ట‌న ముగించుకున్న మోడీ తిరిగి స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చారు. 1992 త‌ర్వాత ఉక్రెయిన్ వెళ్లిన భార‌త ప్ర‌ధానిగా మోడీ చ‌రిత్ర సృష్టించారు. మూడు ద‌శాబ్దాల క్రితం ఇరుదేశాల మ‌ధ్య ఏర్ప‌డిన సంబంధాల త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు మోడీ ఉక్రెయిన్‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆహార ప‌రిశ్ర‌మ‌లు, వ్య‌వ‌సాయం, వైద్య రంగాల్లో ప‌ర‌స్ప‌ర సహ‌కారం చేసుకునేలా ఇరుదేశాలు ఒప్పందాలు చేసుకోవ‌డం విశేషం.. 


తిట్టిన నోటితోనే మోడీని పొగిడి.. 


గ‌త నెల‌లో ప్ర‌ధాని మోడీ మాస్కో ప‌ర్య‌ట‌నపై ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెల‌న్ స్కీ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌ను మోడీ క‌ల‌వ‌డంపై ఆయ‌న స్పందిస్తూ ప్ర‌పంచంలోనే అత్యంత ర‌క్త‌పాత నేర‌స్తుడిని కౌగిలించుకున్న మోడీ అంటూ త‌న త‌న నిర‌స‌న తెలియ‌జేశారు. అదే జెల‌న్ స్కీ కైవ్‌లో మోడీకి స్వాగ‌తం ప‌లికారు. మా రెండు దేశాల మ‌ధ్య శాంతి సామ‌ర‌స్యం నెల‌కొనేలా చూడ‌గ‌ల స‌త్తా భార‌త‌దేశానికి మాత్ర‌మే ఉంద‌ని ప్ర‌సంశ‌లు కురిపించాడు. దీంతోపాటు ఉక్రెయిన్‌లో భార‌త్ వ్యాపారాల‌కు ఆహ్వానం ప‌లికారు. భార‌త ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేయ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని జెల‌న్‌స్కీ ప్ర‌కటించారు. మోడీతో భేటీ అనంత‌రం మీడియాతో మాట్లాడిన జెల‌న్ స్కీ.. త‌మ భేటీ చారిత్రాత్మ‌కమైన‌ద‌ని అన్నారు. భార‌త ప్ర‌ధాని మోడీ శాంతిని కోరుకుంటున్నార‌ని, కానీ పుతిన్ శాంతిని ఒప్పుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు. ఉక్రెయిన్ పై పుతిన్ చేస్తున్న అస‌లైన యుద్ధాన్ని భార‌త్ గుర్తించ‌డం మొద‌లైంద‌ని వ్యాఖ్యానించారు. భార‌త్ త‌ల‌చుకుంటే ర‌ష్యాను నిలువ‌రించే స‌త్తా ఉంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. వారి ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఆప‌వ‌చ్చ‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్ ర‌ష్యా దేశాల మ‌ధ్య చాలా ఒప్పందాలున్నాయ‌ని, కానీ ప్ర‌స్తుతం ర‌ష్యా వ‌ద్ద చ‌మురు త‌ప్ప మ‌రేమీ లేద‌న్నారు.  కీవ్‌లో భార‌తీయ కంపెనీలు ప్రారంభిస్తే ఆహ్వానించడానికి తాము సిద్ధంగా ఉన్న‌ట్టు జెల‌న్‌స్కీ ప్ర‌క‌టించారు. 


భార‌త ప‌ర్య‌ట‌నకు జెల‌న్ స్కీకి మోడీ ఆహ్వానం..


భార‌త్‌లో ప‌ర్య‌టించేందుకు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెల‌న్‌స్కీని భార‌త ప్ర‌ధాని మోడీ ఆహ్వానించిన‌ట్టు భార‌త విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్ వెల్ల‌డించారు. అవ‌కాశం చూసుకుని ఎప్పుడైనా భార‌త‌దేశంలో ప‌ర్య‌టిస్తార‌ని జైశంక‌ర్ ధృవీక‌రించారు. గ‌డిచిన మూడేళ్ల‌లో మోడీ , జెలెన్ స్కీ మూడుసార్లు కలుసుకున్నారు . అంతేకాకుండా 2020 నుండి అనేకసార్లు ఫోన్‌లో కూడా మాట్లాడుకున్నారు. మొన్న మార్చిలోనూ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా భారతదేశంలో పర్యటించారు. ప్ర‌ధాని మోడీ ఉక్రెయిన్ ప‌ర్య‌ట‌న‌పై యూఎన్ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేసింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అధికారి ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ ప‌లు కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ పర్యటనతో ఉక్రెయిన్ - ర‌ష్యా యుద్ధానికి ముగింపు ల‌భిస్తుంద‌ని ఆశిస్తున్నట్లు చెప్పారు. 
 
మోడీ శాంతి సందేశం..


ఉక్రెయిన్‌- ర‌ష్యా యుద్ధంపై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మేం త‌ట‌స్థంగా ఉండ‌టం లేదు, శాంతి ప‌క్షాన ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్రారంభం నుంచీ శాంతివైపే ఉన్నామ‌ని పున‌రుద్ఘాటించారు. బుద్ధుడి నేల నుంచి వ‌చ్చిన వాళ్లం, ప్ర‌పంచానికి శాంతి సందేశ‌మిచ్చిన గాంధీ పుట్టిన దేశం మాది.. మేం ప్ర‌పంచ శాంతినే కోరుకుంటామ‌ని మోడీ తెలిపారు. ఉక్రెయిన్‌లో శాంతి పునః స్థాప‌న జ‌రిగేందుకు చేస్తున్న ప్ర‌తి ప్ర‌య‌త్నంలో భార‌త్ అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. ఇంకెంత‌మాత్ర‌మూ స‌మ‌యం వృథా చేయ‌కుండా ఇరు దేశాలు కూర్చుని మాట్లాడుకోవాల‌ని సూచించారు. అందుకు భార‌త్ స‌హ‌కరిస్తుంద‌ని మోడీ తెలిపారు. ఇక‌నైనా యుద్ధానికి ముగింపు ప‌ల‌కాల‌ని సూచించారు. 


Also Read: PM Modi: అప్పుడు పుతిన్‌కి, ఇప్పుడు జెలెన్‌స్కీకి మోదీ ఆలింగనం - భారత్‌ వైఖరికి ఇది సంకేతమా?