పిల్లో ఫైట్ (దిండ్లతో కొట్లాట) ఇప్పుడు బెడ్ రూంలను దాటేసింది. అక్కాచెల్లెళ్లు, అన్నాచెల్లెళ్లు తలగడలతో కొట్టుకోవడం దాదాపు వారు ఉన్న ప్రతి ఇంట్లో జరిగేదే. కానీ, ఇలా దిండ్లతో కొట్లాడుకొనే ఆట ప్రత్యేక గుర్తింపు పొందింది. అది ఏకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్), ప్రొ కబడ్డీ లీగ్ అని మన దేశంలో ఉన్నట్లుగా ఫ్లోరిడాలో ఏకంగా ‘పిల్లో ఫైట్ ఛాంపియన్‌ షిప్ (పీఎఫ్‌సీ)’ అయింది. ఈ ఆట మొత్తం ఓటీటీలో లైవ్‌లో ప్రసారం కావడం విశేషం. జనవరి 29న ఈ ఆటకి సంబంధించిన మొదటి లైవ్, అది కూడా పే-పర్-వ్యూ పద్ధతిలో ఈ ఈవెంట్‌ ప్రసారమైంది. ఫ్లోరిడాలో ఈ ఆటకు ఇంతటి గుర్తింపు, ఆదరణ లభించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇలా పిల్లో ఫైటింగ్ బెడ్‌రూమ్ నుంచి బాక్సింగ్ రింగ్‌లోకి రావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.


స్టీవ్ విలియమ్స్ అనే వ్యక్తి తన చిన్ననాటి ఈ ఆటను ప్రొఫెషనల్ పోరాట క్రీడగా మార్చాలనే కల ఉన్న ఓ వ్యక్తి. ఆ క్రమంలోనే పీఎఫ్‌సీని మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ లేదా బాక్సింగ్‌ల జోలికి పోకుండా హ్యాండ్-టు హ్యాండ్ అన్ని డ్రామాలను అందించేలా రూపొందించాడు. ‘‘పిల్లో ఫైట్ అంటే ఆట చూస్తున్న ప్రేక్షకులు ఆడియన్స్ ప్లేస్‌లో కూర్చొని నవ్వడం, పోటీదారులు దిండ్లతో కొట్టుకుంటుంటే వాటి నుంచి ఈకలు ఎగరడం మాత్రమే కాదు. ఇది చాలా సీరియస్ ఆట. ఇందులో పోటీదారులు ప్రత్యేకమైన దిండ్లతో కొట్టుకుంటారు. ఆటలో ఈ ప్రత్యేకమైన దిండ్లు ఒక తరహా ఊపును కలిగిస్తాయి’’ అని పీఎఫ్‌సీ నిర్వహిస్తున్న మేనేజ్‌మెంట్ సీఈవో విలియమ్స్ రాయిటర్స్‌ వార్తా సంస్థతో చెప్పారు.


‘‘గత జనవరిలో జరిగిన ఈ పిల్లో ఫైట్ ఈవెంట్‌లో పురుషులు, మహిళా పోటీదారులు ఇద్దరూ పాల్గొన్నారు. వీరిలో ఎక్కువగా మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ), బాక్సింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినవారు ఉన్నారు. వారు ప్రపంచదేశాల నుంచి వచ్చి పాల్గొన్నారు. ఈ ఆటలో ఎంత ప్రశాంతత ఉంటుందంటే.. పిల్లలు ఈ పోటీలను చూసిన తర్వాత కూడా హాయిగా నిద్రపోతారు.’’ అని  విలియమ్స్ చెప్పారు.


‘‘మా పిల్లో ఫైట్‌కు, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌కు ఉన్న తేడా ఏంటంటే మా ఆటలో పోటీదారులు ఎవ్వరూ గాయపడే అవకావమే లేదు. పార్టిసిపెంట్స్ కూడా గాయపడటానికి ఇష్టపడరు. అంతేకాక, ప్రేక్షకుల్లో చాలా మంది ఆటలో హింస, రక్తాన్ని చూడకూడదనుకునే మనస్తత్వం కల వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వారు మా ఆటలను చూసి ఆస్వాదిస్తున్నారు. చాలా మంది వ్యక్తులు తమ తోబుట్టువులను, స్నేహితులను, తల్లిదండ్రులను దిండ్లతో కొట్టడం ద్వారా పెరిగారు. అలాంటి కొట్లాటకు ఈ ఆట ఒక అద్దంగా నిలుస్తుంది. అందుకే ఈ ఆట వైపు కొత్త ప్రేక్షకులు ఆకర్షణకు గురవుతారు. ప్రతి ఒక్కరి జీవితానికి ఈ ఆట కనెక్ట్ చేయబడి ఉంటుంది’’ అని అన్నారు.


స్పోర్ట్స్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ఎఫ్ఐటీఈ (FITE)లో ఈ ఆటను వీక్షించవచ్చు. గతంలో ర్యాప్ సంగీతంతో కంట్రీ మ్యూజిక్‌ని ఎలా మిక్స్ చేసి, విభిన్నమైన ప్రేక్షకులను ఒకచోటకు చేర్చారో.. తమ ఆటలో కూడా అదే జరుగుతుందని విలియమ్స్ అన్నారు. ఇప్పుడు తాము కూడా అదే చేస్తున్నామని.. పీఎఫ్‌సీ కూడా విభిన్నమైన వీక్షకులను తీసుకువస్తుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు.