Iran Attack On Jaish al Adl: ఇరాన్ మంగళవారం తమ దేశంపై క్షిపణి దాడులకు పాల్పడిందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ దాడుల్లో ఇద్దరు చిన్నారులు చనిపోయారని, మరో ముగ్గురు గాయపడ్డారని పాక్ వెల్లడించింది. పాకిస్తాన్‌లోని ‘జైష్ అల్ అదిల్’ చెందిన రెండు స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్ సైన్యానికి అనుబంధంగా పనిచేసే ఓ వార్తాసంస్థ ప్రకటించింది. దీనిపై పాక్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ ప్రకటనను తీవ్రంగా ఖండించింది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైన చర్య అని, ఇలాంటిది తీవ్ర పర్యవసానాలకు దారి తీయొచ్చంటూ మండిపడింది


ఇరాన్ కొద్ది రోజులుగా ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే సిరియా, ఇరాక్‌లపైనా దాడులు చేసింది. తాజాగా పాకిస్తాన్‌లో ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది. అయితే ఇటీవల కాలంలో పాక్‌పై ఇరాన్ ఇలా క్షిపణి దాడి చేయలేదు. మంగళవారం బలూచిస్తాన్ నైరుతి ప్రాంతంలో పాకిస్తాన్-ఇరాన్ సరిహద్దుల్లో ఉండే ఓ గ్రామంపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది.  


పాక్ ఆగ్రహం
ఇరాన్ దాడులపై పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ మండిపడింది. దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన జారీ చేసింది. తమ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే తమ గగనతలంలో ఇరాన్ ఉల్లంఘనలకు పాల్పడిందంటూ ప్రకటనలో పేర్కొంది. ఇరాన్‌ దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడింది. పాకిస్తాన్, ఇరాన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అయినా ఇరాన్ అక్రమంగా ఇలాంటి దాడులకు దిగడం ఆందోళన కలిగిస్తోందని ప్రకటనలో పేర్కొంది. పాక్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా పాల్పడిన ఈ తీవ్ర ఉల్లంఘనలకు, పర్యవసానాలకు ఇరాన్ పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. 


ఉగ్ర గ్రూపులపై ఇరాన్ దశాబ్దాల పోరు
పాకిస్తాన్, ఇరాన్ సరిహద్దులలో జనసాంద్రత తక్కువగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో జైష్ అల్ అదిల్ సహా వివిధ వేర్పాటువాద గ్రూపులు స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. వాటిపై పాకిస్తాన్, ఇరాన్ దశాబ్దాలుగా పోరాడుతున్నాయి.   గత నెలలో జైష్ అల్ అదిల్ జరిపిన దాడులలో ఇరాన్‌కు చెందిన పోలీసు అధికారులు పది మంది  చనిపోయారు. ఆ దాడులకు జైష్ అల్ అదిల్‌కు సంబంధం ఉందని, మిలిటెంట్లు పాకిస్తాన్ నుంచి తమ దేశంలోకి ప్రవేశించారని ఇరాన్ హోం మంత్రి అహ్మద్ వాహిది ఆరోపించారు. 


అసలు జైష్ అల్ అదిల్ కథ ఏంటి? 
బలూచిస్తాన్, సిస్తాన్ ప్రాంతాలలో సున్నీ మిలిటెంట్ గ్రూప్ జైష్ అల్ అదిల్‌. 2012లో ఆ సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఇరాన్‌లో సున్నీల హక్కులను పరిరక్షించడమే తమ లక్ష్యమని చెప్పుకుంటూ దాడులకు దిగుతోంది. అలాగే ఆగ్నేయ సిస్తాన్, బలూచిస్తాన్‌ ప్రావిన్సులో చురుకుగా ఉంటోంది. పాకిస్తాన్ సరిహద్దు వెంబడి కొన్ని సున్నీ బలూచ్ తెగల మద్దతుతో దాడులకు పాల్పడుతోంది. 


ఇరాన్ ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తోంది. దీనిని అక్రమ సైన్యమని పిలుస్తోంది. ఇరాన్‌ ఆగ్నేయ ప్రాంతంలోని సిస్తాన్ బలూచిస్తాన్‌లోని మిలటరీ స్థావరంపై 2013 అక్టోబరు 26న దాడి చేసింది. ఈ ఘటనలో 14 మంది ఇరానియన్ గార్డులను చంపింది. 2013 నవంబర్‌లో సిస్తాన్ బలూచిస్తాన్‌లోని జబోల్ నగరంలో ప్రభుత్వ న్యాయవాది మౌసా నూరిని హతమార్చింది.