Pakistan government to dissolve Parliament: పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అయిదేళ్ల గడువు ముగిసేలోపే పాక్ పార్లమెంట్ ను రద్దు చేయాలని అధికార కూటమి భావిస్తోంది. పాక్ లో పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) కూటమి అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీల నేతలు ఆగస్టు 8 న పాక్ పార్లమెంట్ ను రద్దు చేడానికి అంగీకరించారు. కానీ మరో నాలుగు రోజులు గడిస్తే పాక్ ప్రభుత్వ 5 ఏళ్ల పదవీ కాలం ముగియనుంది. అయితే 4 రోజుల ముందే ప్రభుత్వ రద్దుకు పీపీపీ, పీఎంఎల్ ఎన్ నేతలు అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది.


పాక్ పార్లమెంట్ ఐదేళ్ల రాజ్యాంగ పదవీకాలం ఆగస్టు 12 అర్ధరాత్రితో ముగియనుంది. అయిదే ప్రభుత్వంలోని ప్రధాన పార్టీలు పార్లమెంట్ రద్దు చేయాలనుకున్నారు. తొలుత ఆగస్ట్ 9, లేదా 10 తేదీలలో పార్లమెంట్ ను రద్దు చేయాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికార కూటమి నేతలతో చర్చించారు. కానీ దిగువ సభను రద్దు చేస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే విషయాలపై సైతం చర్చ జరిగింది. సుదీర్ఘ ఆలోచనల తరువాత ఆగస్టు 8న పాక్ పార్లమెంట్ రద్దు చేయాలని ప్రభుత్వం భావించిందని నివేదికలు పేర్కొన్నాయి. 


చట్టం ప్రకారం ప్రభుత్వ నిర్ణయాన్ని సిఫార్సు చేయగా ప్రెసిడెంట్ దాన్ని ఆమోదించకపోతే, 48 గంటల తర్వాత పాక్ పార్లమెంట్ రద్దు అవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 8ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పాక్ రాజ్యాంగం ప్రకారం, ప్రభుత్వ గడువు ముగిస్తే 60 రోజులలో ఎన్నికలు నిర్వహించాలి. ఒకవేళ 5 ఏళ్ల నిర్ణీత గడువుకు ముందే ప్రభుత్వం కూలిపోతే, లేక పార్లమెంట్ ముందే రద్దయితే పాకిస్థాన్ ఎన్నికల సంఘం 90 రోజుల్లోగా సాధారణ ఎన్నికలను నిర్వహించనుంది. నిర్ణీత కాలానికి ముందే రద్దు చేయడం తమకు కలిసొస్తుందని పీఎంఎల్-ఎన్ నేతృత్వంలోని పాకిస్థాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ కూటమి భావిస్తోంది.


పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల ఒక కార్యక్రమంలో.. వచ్చే నెలలో మా ప్రభుత్వం పదవీకాలం ముగియనుంది. అంతకు ముందే మేం పార్లమెంట్ రద్దు చేయాలని భావిస్తున్నాం అన్నారు.  గతంలో బిలావల్ జర్దారీ- భుట్టో నేతృత్వంలోని PPP నిర్ణీత పదవీకాలానికి ముందే పార్లమెంట్ రద్దు చేసింది. కానీ పార్లమెంట్ రద్దుకు తేదీ ఖరారు చేయలేదని సమాచార మంత్రి మర్రియం ఔరంగజేబ్ అన్నారు. అయితే ప్రభుత్వ కూటమిలో ప్రధాన పార్టీలు నిర్ణయం తీసుకుంటాయని చెప్పిన తరువాత ప్రధాని ముందస్తుకు వెళ్లాలనుకున్నట్లు ప్రకటించారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడే వరకు షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా కొనసాగుతారు. ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని నడిపించేందుకు ప్రధానిగా సూచించేందుకు తనతో సహా మొత్తం 3 పేర్లను ప్రతిపక్ష నేత రాజా రియాజ్‌కు షెహబాబ్ లేఖ రాయనున్నారు.


పాక్ పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ద్వారా పీటీఐ చైర్మన్ ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అనంతరం గతేడాది ఏప్రిల్‌లో షెహబాజ్ షరీఫ్ పాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి పాక్ లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial