Pakistan Economic Crisis:  పక్క దేశం పాకిస్థాన్ ను ఆర్థిక సంక్షోభం వెంటాడుతూనే ఉంది. రోజువారీ సరకుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరుగుతున్న ధరలతో పాక్ ప్రజలు కడపు నింపుకునేందుకు పోరాటం చేయాల్సి వస్తోంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి అత్యవసర ఆహార పదార్ధాలు సామాన్యులకు అందకుండా పోతున్నాయి. 


ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తో రుణ ఒప్పందాన్ని పూర్తి చేయాలని పాకిస్థాన్ కోరుతోంది. ఈ ఒప్పందం పూర్తికాకముందే పరిగెడుతున్న ధరలతో పాకిస్థాన్ లో వినియోగదారులు పాట్లు పడుతున్నారు. పాలు, చికెన్ సహా రోజువారీ సరకుల ధరలు ఆకాశాన్ని అంటడంతో ఏం చేయాలో పాలుపోక నిస్సహాయులవుతున్నారు. కడుపు నిండడమూ కష్టమైపోతోంది. 


అందనంత దూరంలో పాలు, చికెన్ ధరలు


పాకిస్థాన్ లో పాల ధరలు లీటరు రూ. 190 నుంచి రూ. 210 వరకు ఉంది. బ్రాయిలర్ చికెన్ ధర 2 రోజుల్లో కిలోకు రూ. 30- 40 కి పెరిగింది. గతంలో కిలో రూ. 620- 650 మధ్య ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ. 700- 780 మధ్యలో ఉంది. అలాగే బోన్ లెస్ చికెన్ అయితే ఏకంగా వెయ్యికి చేరింది. ఇది ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరిందని డాన్ వార్తాపత్రిక నివేదించింది. వెయ్యి మందికి పైగా దుకాణదారులు పాల ధరలను పెంచారు. పాడి రైతులు, హోల్ సేల్ వ్యాపారులు ధరల పెంపును వెనక్కి తీసుకుంటే ధరలు తగ్గవచ్చు అని కరాచీ మిల్క్ రిటైలర్స్ అసోసియేషన్ ప్రతినిథి వాహిద్ అన్నారు. 


చికెన్ టోకు రేటు కిలో రూ. 600 ఉండగా.. వాటి మాంసం ఖరీదు రూ. 650- 700ల మధ్య ఉంది. ద్రవ్యోల్బణం పెరుగుదల ఈ మధ్యనే ఎక్కువగా ఉంది. ఐఎంఎఫ్, పాకిస్థాన్ మధ్య చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఇది షెహబాద్ షరీఫ్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అని పౌల్ట్రీ, సింధ్ పౌల్ట్రీ హెల్ సేలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్సి కమల్ అక్తర్ సిద్ధిఖీ అన్నారు. 






పెరుగుతోన్న నిరుద్యోగ రేటు


పాకిస్థాన్ లో నిరుద్యోగిత రేటు రోజురోజుకూ పెరుగుతోంది. వేలాదిమంది పాకిస్థానీయులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. దీనికి తోడు పాక్ కు చెందిన డాన్ వార్తాపత్రిక ఇచ్చిన నివేదిక ఆ దేశ ప్రధానితో సహా అందరిలోనూ ఆందోళన పెంచుతోంది. ఈ నివేదిక ప్రకారం ఈ ఏడాదిలో ఆ దేశంలో నిరుద్యోగుల సంఖ్య 62.5 లక్షలకు చేరుకుంటుందని అంచనా. ఈ ప్రకారం నిరుద్యోగుల సంఖ్య పెరిగితే అది దేశ అభివృద్ధిని మరింత కుంగదీస్తుంది. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన ఆ దేశానికి ఇది మరింత ఆందోళన కలిగించే అంశం ఇది.  జనవరి 13 నాటి డేటా ప్రకారం, ఇప్పుడు పాకిస్తాన్ వద్ద కేవలం 4.6 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు మాత్రమే ఉన్నాయి. పాకిస్థాన్‌లో రిఫైనరీలు, వస్త్రాలు, ఇనుము, ఆటోమొబైల్స్, ఎరువులకు సంబంధించిన ఉత్పత్తులు గత కొన్ని నెలలుగా సరిగ్గా నడవడంలేదు. అవి మూసివేత దిశగా సాగుతున్నాయి.