Hinduja Group: భారత మూలాలున్న స్విట్జర్లాండ్‌కు చెందిన వ్యాపార దిగ్గజం హిందూజా ఫ్యామిలీ గురించి ఓ వార్త ఇటీవల బాగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబ సభ్యులు వారి ఇంట్లో పని చేసే సిబ్బందికి అతితక్కువ వేతనాలు ఇస్తున్నారని.. కనీసం వారి ఇంట్లో పెంపుడు శునకానికి వెచ్చించే డబ్బు కూడా వారికి ఇవ్వడం లేదని ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. 


హిందూజా ఫ్యామిలీ ఇంట్లో పని చేసేవారికి రోజుకు 7 ఫ్రాంక్స్ అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.660 మాత్రమే చెల్లిస్తున్నట్లు కొన్ని అంతర్జాతీయ పత్రికలు రాశాయి. అయితే ఇదే క్రమంలో వారు తమ పెంపుడు కుక్కలకు రోజుకు రూ.2 వేలు వెచ్చించి సాకుతున్నట్లుగా కూడా వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. స్విట్జర్లాండ్‌లోని హిందూజా హౌస్‌లో పనిచేస్తున్న పనివారు రోజుకు ఇంత తక్కువ వేతనాలకు రోజూ 15-18 గంటలు పని చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో హిందూజా కుటుంబ సభ్యులకు కోర్టు శిక్ష వేసిందని కూడా వైరల్ అయింది.


హిందూజా ఫ్యామిలీ వివరణ
ఈ వ్యవహారంపై స్వయంగా హిందూజా ఫ్యామిలీ స్పందించింది. ఈ ఆరోపణలను హిందూజా ఫ్యామిలీలోని నలుగురు కుటుంబ సభ్యులు ఖండించారు. కమల్ & ప్రకాష్ హిందూజా, నమ్రత, అజయ్ హిందూజాలపై ఎలాంటి నేరారోపణ కానీ, జైలు శిక్షలు కానీ, ఎలాంటి అరెస్టులు కాగీ జరలేదని క్లారిటీ ఇచ్చారు. 


స్విస్ చట్ట విధానాల ప్రకారం.. కేసు పై కోర్టులో ఉన్నప్పుడు దిగువ కోర్టు తీర్పు ఆమోదించదగినది కాదు. ఇక్కడ జర్నలిస్టుల సహనం చాలా ముఖ్యం. చివరి తీర్పు వరకు అందరూ వేచి ఉండాలి. మాపై వచ్చిన అత్యంత తీవ్రమైన ఆరోపణల్లో మానవ అక్రమ రవాణాను ఆరోపణల్ని కోర్టు పూర్తిగా కొట్టివేసింది. ఈ కేసులో ఇకపై ఫిర్యాదుదారులు ఎవరూ లేరని వారు ప్రకటనలో తెలిపారు. 


నలుగురు కుటుంబ సభ్యులు స్విస్ న్యాయ ప్రక్రియపై పూర్తి విశ్వాసం కలిగి ఉన్నారు, దానిపై నమ్మకంగా ఉన్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఫిర్యాదుదారులు ఎవరూ లేరు. తామే హిందూజా ఫ్యామిలీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నామని కోర్టులో అంగీకరించారు. మేం వారిపై ఎలాంటి చర్యలకు సిద్ధపడలేదు. హిందూజా ఫ్యామిలీ సిబ్బందిని గౌరవంతో కుటుంబం మాదిరిగా చూసుకుంటుంది’’ అని హిందూజా ఫ్యామిలీలోని కమల్ అండ్ ప్రకాష్ హిందూజా, నమ్రత అండ్ అజయ్ హిందూజా ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు.