Pakistan Protests: 


పంజాబ్‌లో అల్లర్లు 


పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసినప్పటి నుంచి ఆ దేశం అట్టుడుకుతోంది. తోషాఖానా కేసులోనూ కోర్టు ఇమ్రాన్‌ను దోషిగా తేల్చింది. ఇప్పటికే అల్‌ఖదీర్ ట్రస్ట్ కేసులో దోషిగా తేల్చారు. ఇమ్రాన్ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. సైన్యం వారిని నిలువరించలేకపోతోంది. ఆర్మీకి, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. పోలీసులు కూడా రంగంలోకి దిగి పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ అల్లర్లలో 130 మందికి పైగా పోలీసులు గాయపడినట్టు తెలుస్తోంది. పంజాబ్ ప్రావిన్స్‌లో భారీ సైన్యాన్ని మొహరించింది ప్రభుత్వం. ఇమ్రాన్ ఖాన్‌ను కస్టడీలోకి తీసుకున్నప్పటి నుంచి ఆయనను తీవ్రంగా వేధిస్తున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఆయనను రాత్రంతా టార్చర్ చేశారని, నిద్ర కూడా పోనివ్వలేదని ఓ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. ఈ కామెంట్స్ తరవాత ఇమ్రాన్ సపోర్టర్స్ మరింత రెచ్చిపోయారు. బిల్డింగ్స్‌ని ధ్వంసం చేస్తున్నారు. పోలీసుల వాహనాలకు నిప్పు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లో నిరసనకారులు రెచ్చిపోవడంతో పోలీసులూ అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. దాదాపు వెయ్యి మందిని అరెస్ట్ చేశారు. పోలీస్ అధికారులు ఈ అరెస్ట్‌లను ధ్రువీకరించారు. చట్టానికి వ్యతిరేకంగా నడుచుకున్న 945 మందిని అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించారు. 






సుప్రీంకోర్టుకి ఇమ్రాన్ 


ఇస్లామాబాద్ హైకోర్టులో హాజరైన ఇమ్రాన్ ఖాన్...కీలక వ్యాఖ్యలు చేశారు. 24 గంటలుగా తనను వాష్‌రూమ్‌కి కూడా పోనివ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. తనను చంపేస్తారేమో అని భయంగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే...ఇస్లామాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టుకున్నారు ఇమ్రాన్ ఖాన్. అటు ఆయన మద్దతుదారులు మాత్రం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. కొన్ని చోట్లు చెట్లనూ తగలబెడుతున్నారు. పెట్రోల్ బాంబులు విసురుతున్నారు. రాళ్లతో దాడులు చేస్తున్నారు. అటు ఖైబర్ పఖ్తుంక్వాలో ఆర్మీ పెద్ద ఎత్తున మొహరించింది. ఇమ్రాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన అసద్ ఉమర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. 


అవినీతి ఆరోపణల కేసులో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేశారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్టును (Imran Khan Arrest) హైకోర్టు తప్పుబట్టింది. అరెస్టు అనంతరం ఇస్లామాబాద్ పోలీసు చీఫ్, ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, అడిషనల్ అటార్నీ జనరల్‌ను 15 నిమిషాలలోగా కోర్టు ముందు హాజరుకావాలని ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అమర్ ఫరూక్‌ ఆదేశించారు. తాము ‘‘సంయమనం’’ ప్రదర్శిస్తున్నామని, ఇస్లామాబాద్ పోలీసు చీఫ్ కోర్టుకు హాజరుకాకపోతే తాను ప్రధానమంత్రిని ‘‘పిలిపిస్తానని’’ చీఫ్ జస్టిస్ హెచ్చరించారు. ‘‘ఇమ్రాన్‌ను ఎందుకు అరెస్టు చేశారో, ఏ కేసులో అరెస్టు చేశారో కోర్టుకు వచ్చి చెప్పండి’’ అని జస్టిస్ ఫరూక్ అన్నారు.


Also Read: Car Driver Beaten: నడిరోడ్డుపై కార్‌ ఆపి దాడి చేసిన యువకులు, ఒక్క ట్వీట్‌తో అరెస్ట్