WhatsApp Privacy:
ఐటీ మంత్రి ట్వీట్
వాట్సాప్‌లో ప్రైవసీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ ఈ మెసెంజర్ యాప్‌ను "నమ్మలేం" అంటూ చేసిన కామెంట్స్ అంతర్జాతీయంగా దుమారం రేపాయి. దీనిపై భారత ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా స్పందించారు. వాట్సాప్‌లో ప్రైవసీని ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలపై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. ట్విటర్‌లోని ఇంజనీరింగ్ డైరెక్టర్ ఫోద్ దబిరి ట్వీట్‌కు స్పందిస్తూ రాజీవ్ ఈ ప్రకటన చేశారు. తాను నిద్రపోతున్న సమయంలో వాట్సాప్ తన మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేసిందని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు దబిరి. బ్యాక్‌గ్రౌండ్‌లో మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేస్తున్నట్టు చెప్పారు. ఉదయం లేచినప్పటి నుంచి కూడా ఇదే తాను అబ్జర్వ్ చేసినట్టు వెల్లడించారు. ఇదే ట్వీట్‌ని రీట్వీట్ చేస్తూ మరోసారి ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ వాట్సాప్‌పై విమర్శలు చేశారు. "వాట్సాప్‌ని నమ్మడానికి వీల్లేదు" అంటూ ట్వీట్ చేశారు. అయితే...దీనిపై స్పందించిన రాజీవ్ చంద్రశేఖర్ తప్పకుండా విచారణ జరుపుతామని వెల్లడించారు.
"ఇది కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం. ప్రైవసీని ఉల్లంఘిస్తే సహించం. వెంటనే దీనిపై విచారణ జరుపుతాం. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ పాలసీలో భాగంగా చర్యలు తీసుకుంటాం"
- రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఐటీ మంత్రి
ఈ మొత్తం వివాదంపై వాట్సాప్ కూడా స్పందించింది. ట్విటర్ ఇంజనీర్‌తో తాము 24 గంటలుగా కాంటాక్ట్‌లోనే ఉన్నట్టు వివరించింది. ఆ వ్యక్తి పిక్సెల్ ఫోన్ వాడుతున్నట్టు ట్వీట్ చేసింది. యూజర్స్‌కి మైక్రోఫోన్‌పై పూర్తి కంట్రోల్ ఉంటుందని స్పష్టం చేసింది.
"మైక్రోఫోన్‌కి యాక్సెస్‌కి యూజర్ అనుమతినిచ్చిన తరవాత వాట్సాప్ మైక్రోఫోన్‌ని యాక్సెస్ చేయడం మొదలు పెడుతుంది. అది కూడా కాల్స్ చేసినప్పుడు, వాయిస్ నోట్‌ని రికార్డ్ చేసినప్పుడు,వీడియో కాల్ చేసినప్పుడు మాత్రమే యాక్సెస్ చేస్తుంది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌కి మేం కట్టుబడి ఉన్నాం. యూజర్స్ ప్రైవసీకి ఎప్పుడూ భంగం కలిగించం"
- వాట్సాప్ యాజమాన్యం