Krishna Water Disupte : కృష్ణా జలాల పంపకం విషయం తేల్చడానికి కృష్ణాబోర్డు సమావేశం జరగనుంది. అయితే తెలంగాణ తమ విధానాన్ని ముందుగానే ప్రకటించింది. గతంలోలా కాదని కృష్ణా జలాల్లో సగం వాటా కావాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ స్పష్టమైనప ్రకటన చేశారు. గత జూన్ నుంచి ప్రారంభమైన నీటి సంవత్సరం ఈ నెలాఖరుతో ముగిసిపోనుంది. నీటి సంవత్సరం అంతా రెండు రాష్ట్రాల మధ్యన వివాదాలతోనే గడిచిపోయింది. తిరిగి జూన్ నుంచి కొత్త నీటి సంవత్సరం ప్రారంభం కాబోతోంది. కనీసం ఈసారైన కృష్ణానదీజలాల వినియోగంలో తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్యన పరస్పర ఆమోదయోగ్యమైన నీటి ఒప్పందాలు కుదురుతాయని ఈ సారి కూడా అనిపించడం లేదు.
జూన్ నుంచి నీటి వాటాల పంపకం తేల్చేందుకు సమావేశం
కృష్ణానదీయాజమాన్య బోర్డు జూన్ నుంచి ప్రారంభమయ్యే వాటర్ ఇయర్‌కు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల వినియోగంపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు బుధవారం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసింది. జలసౌధలో జరగనున్న ఈ సమావేశంలో కృష్ణానదీజలాల వినియోగంతోపాటు, రూల్‌కర్వ్‌పై కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టు నుంచి తాగునీటికి, సాగునీటికి నీటి కేటాయింపులు, జలవిద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ప్రాధాన్యతలు కూడా చర్చకు రానున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదీజలాల్లో మహారాష్ట్ర, కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటిని కేటాయిస్తూ తీర్పునిచ్చింది.
పాత ఒప్పందాలు సాధ్యం కావవి.. సగం వాటా ఇవ్వాల్సిందేనంటున్న తెలంగాణ
బచావత్ చేసిన ఆవార్డు మేరకు ఉమ్మడి ఏపికి 811టిఎంసీల నీటి కేటాయింపులు జరిగాయి. 2014లో జరిగిన ఏపి పునర్‌విభజనచట్టం మేరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో నీటికేటాయింపులు ప్రధాన అంశాలుగా మారాయి. రెండు రాష్ట్రాల మధ్యన 201516లో తాత్కాలిక ఒప్పందం ప్రకారం కృష్ణానదీజలాల వినియోగంలో ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్యన 66:34 నిస్పత్తిలో నీటికేటాయింపులు కుదుర్చుకున్నాయి. బచావత్ చేసిన 811టీఎంసీల నీటి కేటాయింపుల్లో తెలంగాణకు 299టిఎంసీలు, ఏపికి 512టింసీలు వినియోగించుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందమే ఇప్పటివరకూ కొనసాగుతూ వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నీటి అవసరాలు పెరగటంతో తాత్కాలిక ఒప్పదం కొనసాగింపు ఇక కుదరదని తెలంగాణ రా్రష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకూ కృష్ణానదీజలాల్లో సమాన వాటా నీటికి పట్టుబట్టింది. ఇప్పుడు సమావశంలో కూడా అదే అడుగుతామని తెలంగాణ స్పష్టం చేసింది. గతంలో జరిగిన కృష్ణా బోర్డు సమావేశాల్లోనూ ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించింది. బుధవారం జరగబోయే బోర్డు సమావేశంలో 50:50 నీటివాటాలే ప్రధాన చర్చనీయాంశంగా మారనుంది.
ఏపీ ప్రయోజనాల కోసం ఉంటామన్న బీఆర్ఎస్ డిమాండ్ సహేతుకం కాదంటున్న బీజేపీ !
రాజకీయాలు ప్రజల కోసం మీరు వాడుకున్న స్టీల్ ప్లాంట్ కన్నా నీటి సమస్య విస్తృతమైనదని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణాజలాల విషయంలో ఏపీకి మద్దతుగా నిలబడి మీ నిజాయితీని నిరూపించుకోవాలని కేసీఆర్, కేటీఆర్‌లకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రా కోసం మెడ తెగ్గోసుకుంటాం అన్నట్లుగా స్టీల్ ప్లాంట్ విషయంలో హడావుడి చేసిన జేడీ లక్ష్మినారాయణ ఏపీ బీఆర్ఎస్ నేతలు కృష్ణా జలాల విషయంలో ఆ పట్టుదల చూపించగలరా అని ప్రశ్నించారు. దిగువ రాష్ట్రమైన ఏపీ న్యాయమైన నీటి కేటాయింపులపై మద్దతుగా మాట్లాడాలన్నారు. సీమకు చెందాల్సిన నీటిని అనవసర విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు వదిలివేస్తున్న వైనంపై కేటీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు.