Car Driver Beaten in Delhi: 


ఢిల్లీలో ఘటన..


ఢిల్లీలో నలుగురు యువకులు కార్ డ్రైవర్‌పై దాడి చేశారు. నడిరోడ్డుపై కార్ ఆపేసి..డ్రైవర్‌పై దాడికి దిగిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు ప్రవీణ్ జంగ్రా ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ చేశాక..ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కార్ డ్యాష్‌బోర్డ్‌లోని కెమెరాలో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. నంగోలి మెట్రో స్టేషన్‌ వద్ద కార్‌ను నలుగురు యువకులు అడ్డగించారు. డిప్పర్ లైట్స్‌ విషయంలో వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ నలుగురు యువకులు కార్‌ ఆపి డ్రైవర్‌పై దాడి చేశారు. ఆ తరవాత బూతులు తిడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు బాధితుడు ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ చేశాడు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ ట్యాగ్ చేశాడు. 


"కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నడిరోడ్డుపై నా కార్ ఆపేశారు. నాపై దాడి చేశారు. నంగోలి మెట్రో స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఢిల్లీలో ఈ తరహా గూండాగిరి చాలా మామూలైపోయింది. ఢిల్లీ పోలీసులు దీనిపై దృష్టి సారించాలి. కచ్చితంగా చర్యలు తీసుకోవాలి"


- బాధితుడు 






ఢిల్లీ డిప్యుటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హరేంద్ర కే సింగ్...ఈ ఘటనపై విచారణ జరిపారు. నలుగురునీ అరెస్ట్ చేసినట్టు ట్వీట్ చేశారు. "వాళ్లు దాడి చేశారు. మేం అరెస్ట్ చేశాం" అని పోస్ట్ చేశారు.