ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అపర సంజీవనిలా ఆరోగ్యోశ్రీ సేవలు అందిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. ఈ ఏడాది రూ.3336 కోట్ల బడ్జెట్‌ను ఆరోగ్య శ్రీకి కేటాయించామన్నారు. ఆరోగ్య శ్రీ పథకం అమలు తీరు, 104, 108 వాహనాలు, ఆరోగ్య ఆసరా వంటి అంశాలపై మంత్రి విడదల రజిని సంబధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఆరోగ్య శ్రీ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.3336 కోట్లు కేటాయించిందని గత ప్రభుత్వంలో కేవలం 1059 ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందాయని తెలిపారు మంత్రి విడదల రజిని. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చని వెంటనే ఈ సంఖ్యను 2446కు పెంచామని వెల్లడించారు. మళ్లీ ఈ సంఖ్యను ఏకంగా 3255కు పెంచినట్టు వివరించారు.
నాడు వెయ్యి కోట్లు- నేడు 3వేల కోట్లు..
గతంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఏడాదికి రూ.వెయ్యి కోట్ల వరకు ఖర్చయ్యేదని, ఇప్పుడు ఏకంగా ఏడాదికి ఆరోగ్యశ్రీకి రూ.3వేల కోట్ల వరకు ఖర్చవుతోందని తెలిపారు మంత్రి రజిని. ఆసరా కోసం రూ.445 కోట్లు, 108 వాహనాల నిర్వహణ కోసం రూ.187 కోట్లు, 104 వాహనాల నిర్వహణ కోసం రూ.164 కోట్లు, ఈహెచ్ ఎస్ కోసం రూ.140 కోట్లు ఈ ఏడాది బడ్జెట్ లో ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు. ఇదంతా జగన్ మంచి మనసు వల్లనే సాధ్యమైందని చెప్పారు.
2263 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు..
ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఏకంగా 2263 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయని వెల్లడించారు. ఏపీలో 2061ఆస్పత్రులు, తెలంగాణలో 132, కర్నాటకలో 49, తమిళనాడులో 22 ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ఈ స్థాయిలో ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తున్న రాష్ట్రాలు మన దేశంలో ఎక్కడా లేవని చెప్పారు.
ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందే విషయంలో , 104, 108 వాహనాల పనితీరులో సమస్యలకు సంబంధించిగాని తమ ప్రభుత్వం ఫిర్యాదుల కోసం 104 కాల్ సెంటర్‌ను తీసుకొచ్చిందని వివరించారు. ఈ కాల్ సెంటర్ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ హెచ్ ఎస్ ద్వారా ఆరోగ్య సేవలు, నగదు చెల్లింపులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఈహెచ్ ఎస్ విషయంలో ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సత్వరమే స్పందిస్తున్నదని చెప్పారు.
108 వాహనకు ఫోన్ చేస్తే లోకేషన్ తో సహ...
108 వాహనానికి ఎవరైనా ఫోన్ చేస్తే... ఆ వాహనం లొకేషన్ తో సహా ఫోన్ నంబరుకు లింక్ వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పూర్తి సాంకేతికతను ఆధారంగా చేసుకొని 108సేవలను ఆధునీకరించాలని సర్కార్ యోచిస్తోంది. చాలా సందర్భాల్లో ఆపద సమయంలో ప్రాణాలనుకాపాడుకునేందుకు బాధితులు 108కు ఫోన్ చేసినప్పటికి అటు నుంచి ఎటువంటి స్పందన లేకపోవటం తీవ్ర స్థాయిలో విమర్శలకు తావిచ్చింది. ప్రభుత్వం కోట్ల రూపాయలు వైద్య శాఖకు కేటాయిస్తున్నప్పటికి, ఎటువంటి ప్రయోజనం లేకపోవటంతోపాటుగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెడుతుంది. దీంతో ప్రజల్లో 108సేవల పై అనుమానాలు,అపోహలు కూడా వ్యక్తం అయ్యాయి.
ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే కిలోమీటర్ల మేర బాధితుడిని మోసుకొని నడుచుకుంటూ వచ్చిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి.మరి కొన్ని చోట్ల తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారిని ద్విచక్ర వాహనాల పై తీసుకువచ్చిన పరిస్థితులు కూడా లేకపోలేదు. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు సర్కార్ నూతన పంథాను అవలంభించేందుకు చర్యలు చేపట్టింది.