Karnataka Elections 2023: 



నాలుగున్నర రెట్లు ఎక్కువ..


కర్ణాటక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఎలక్షన్స్ అంటే లిక్కర్‌తో పాటు కరెన్సీ నోట్లకూ డిమాండ్ పెరుగుతుంది. ప్రచారానికి రావడం కోసం మందుని ఎరగా వేసి జన సమీకరణ చేస్తుంటాయి పార్టీలు. మాకే ఓటేయండి అంటూ డబ్బులు కూడా పంచుతాయి. ఇదంతా ఓపెన్ సీక్రెట్. అయితే...ఇలాంటి వాటిపై ఎన్నికల సంఘం నిత్యం నిఘా పెడుతూనే ఉంటుంది. అక్రమంగా డబ్బు, మద్యం పంపిణీ చేసే వారిని పట్టుకుని వాటిని సీజ్ చేసేస్తుంది. అయితే..ఈ సారి కర్ణాటకలో సీజ్ చేసిన డబ్బుల విలువ పెరిగిపోయింది. ఎన్నికల ఖర్చుపై నిఘా పెట్టిన ఈ సంస్థ..కీలక విషయాలు వెల్లడించింది. 2018 ఎన్నికలతో పోల్చి చూస్తే... ఈ సారి 4.5 రెట్లు ఎక్కువగా డబ్బుని సీజ్ చేసినట్టు స్పష్టం చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు పలు చోట్ల ఈ నోట్ల కట్టల్ని సీజ్ చేశాయి. వీటి మొత్తం విలువ రూ.375 కోట్లుగా వెల్లడించింది. రూ.147 కోట్ల క్యాష్, రూ.84 కోట్ల విలువైన లిక్కర్, రూ.97 కోట్ల బంగారం వెండి, రూ.24 కోట్ల విలువైన డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. 


"ఎలాంటి అక్రమాలు, అవినీతి లేకుండా ఎన్నికలు నిర్వహించడంపై మేం కట్టుబడి ఉన్నాం. అందులో భాగంగానే ఎన్నికల ఖర్చుపై నిఘా పెడుతున్నాం. వాటిని నియంత్రిస్తున్నాం. ఇష్టమొచ్చినట్టు ఖర్చు పెట్టడానికి వీల్లేకుండా అడ్డుకుంటున్నాం. 2018 ఎన్నికలతో పోల్చి చూస్తే ఈ సారి డబ్బు ప్రవాహం ఎక్కువగా కనిపించింది. అప్పటి కంటే 4.5 రెట్లు ఎక్కువగా సీజ్‌ చేశాం. ఇలాంటి అక్రమాలపై చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం. పొరుగు రాష్ట్రాల నుంచీ పెద్ద మొత్తంల కరెన్సీ నోట్లు తరలి వస్తున్నాయి. కో ఆర్డినేషన్ టీమ్స్‌ ఇలాంటి ముఠాలను పట్టుకునే పనిలో ఉన్నాయి. బీదర్‌లో 100 కిలోల గంజాను సీజ్ చేశాం. డబ్బులు ఏరులై పారే నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాం."


- కేంద్ర ఎన్నికల సంఘం 


హోరాహోరీ ప్రచారం..


20 రోజులుగా కాంగ్రెస్, బేజేపీ పోటాపోటీగా ప్రచారం సాగించాయి. కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపెయినర్‌లుగా రాహుల్ గాంధీ, డీకే శివకుమార్, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే ప్రజల్లో ఉత్సాహం నింపారు. ఇక బీజేపీ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ఆకట్టుకున్నారు. దాదాపు వారం రోజుల పాటు కర్ణాటకలో ప్రచారం చేశారు మోదీ. ఈ క్రమంలో 3 వేల మందితో ఇంటరాక్ట్ అయినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా కిలోమీటర్ల కొద్దీ ర్యాలీ నిర్వహించడమూ కార్యకర్తల్లో ఉత్సాహం పెంచింది. భారీ ఎత్తున ప్రజలు తరలిరావడమూ పార్టీ శ్రేణుల్లో ధీమా పెంచింది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికే మరోసారి అవకాశమివ్వాలంటూ మోదీ ప్రచారం చేశారు. అటు కాంగ్రెస్ మాత్రం బీజేపీపై విమర్శలు చేస్తూ ప్రచారం కొనసాగించింది. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన తరవాత మాటల యుద్ధం పెరిగింది. బజ్‌రంగ్ దళ్‌ బ్యాన్ చేస్తామంటూ కాంగ్రెస్ చేసిన ప్రకటన అగ్గి రాజేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలందరూ దీన్నే ప్రచార అంశంగా మలుచుకున్నారు. కాంగ్రెస్‌కు గురి పెట్టారు. చివరకు కాంగ్రెస్ సీనియర్ నేతలు స్పందించి "యూటర్న్" తీసుకోవాల్సి వచ్చింది. 


Also Read: Karnataka Elections 2023: సిలిండర్‌లకు దండలు వేసి పూజలు, బీజేపీకి కాంగ్రెస్ కార్యకర్తల కౌంటర్