Karnataka Elections 2023: 



గెలిచేది ఎవరో..? 


కర్ణాటకలో పోలింగ్ కొనసాగుతోంది. కీలక నేతలందరూ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. గెలుపుపై బీజేపీ కాంగ్రెస్ ధీమాగా ఉన్నాయి. ఎప్పుడూ కింగ్‌మేకర్‌గా ఉండే జేడీఎస్ కూడా ఈ సారి అధికారంలోకి రావాలని గట్టిగానే ప్రచారం చేసింది. మరోసారి కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది  తామేనని బీజేపీ చాలా ధీమాగా ఉంది. 61 సీట్లలో జేడీఎస్‌కి పట్టు ఉంది. ప్రభుత్వ ఏర్పాటులో ఈ స్థానాలే కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. శివమొగ్గలో అందరికన్నా ముందే ఓటు వేసిన ఆయన...బీజేపీ తప్పకుండా గెలుస్తుందని తేల్చి చెప్పారు. 75-80% ఓటర్లు తమ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. 


"మాకు స్పష్టమైన మెజార్టీ వచ్చి తీరుతుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమే. 130-135 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాను"


- బీఎస్ యడియూరప్ప, మాజీ ముఖ్యమంత్రి 


బొమ్మై ధీమా..


ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఓటు వేసిన తరవాత కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమైన నేతలందరూ ప్రచారం చేయడం తమకు కలిసొస్తుందని అన్నారు. అలాగే ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మద్దతునిచ్చారని వెల్లడించారు. కర్ణాటక అభివృద్ధి కోసం అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అటు కాంగ్రెస్ కూడా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తోంది. "40%" కమీషన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేయాలంటే అందరూ ఓటు వేయాలని సూచించారు రాహుల్ గాంధీ. ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తాము ఇచ్చిన 5 హామీలను ప్రస్తావిస్తూ...వాటిన్నింటినీ నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. 
 
"కర్ణాటక అభివృద్ధి కోసం మేం 5 హామీలు ఇచ్చాం.  మహిళల హక్కులు కాపాడటం, ఉద్యోగాలు, పేద ప్రజలు సంక్షేమ పథకాలు..ఇలా ఎన్నో వాటికి మేం కట్టుబడి ఉన్నాం. అందుకే కర్ణాటక అభివృద్ధికి మీరంతా కలిసి ఓటు వేయండి"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత 


జోరుగా ప్రచారం..


ప్రచారం విషయానికొస్తే...ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు 19 పబ్లిక్ మీటింగ్‌లలో మాట్లాడారు. 6 రోడ్‌షోలు నిర్వహించారు. ఇక కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ 12 రోజుల పాటు రాష్ట్రంలోనే పర్యటించారు. ఈ సారి బీజేపీ పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండటం వల్ల కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 4% ముస్లింల రిజర్వేషన్‌ను రద్దు చేయడంపైనా ఓ వర్గం బీజేపీపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అదీ కాకుండా...బీజేపీలోని ఇద్దరు కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కూడా ఉన్నారు. ఇది కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశముంది. పైగా ధరల పెరుగుదల విషయాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకుంది కాంగ్రెస్. ఓటు వేసే ముందు పలు నియోజకవర్గాల్లో సిలిండర్‌కు దండలు వేసి పూజలు చేస్తూ వినూత్నంగా నిరసన చేపట్టారు.