China Mysterious Pneumonia:
న్యుమోనియా...
నిన్న మొన్నటి వరకూ కొవిడ్‌తో అల్లాడిపోయిన చైనా ఇప్పుడు (China Pneumonia Outbreak) మరో మహమ్మారితో సతమతం అవుతోంది. హాస్పిటల్స్ అన్నీ కిక్కిరిసిపోతున్నాయి. చిన్నారులు ఎక్కువ మంది అనారోగ్యానికి గురవుతున్నారు. బీజింగ్ సహా ప్రధాన నగరాల్లో బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అరుదైన వ్యాధులపై అధ్యయనం చేసే ProMed నిఘా సంస్థ చైనాలోని పరిస్థితులపై ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వ్యాధిని "undiagnosed pneumonia"గా నిర్ధరించింది. 2019 డిసెంబర్‌లోనూ Sars-Cov-2 అనే ఓ మిస్టరీ వైరస్ వ్యాప్తి చెందుతుందని, ఈ వైరస్ కారణంగా చాలా మంది అనారోగ్యానికి గురవుతారని అలెర్ట్ చేసింది. సైంటిస్ట్‌లు, వైద్యులతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థనూ అప్రమత్తం చేసింది. అనుకున్నట్టుగానే అప్పట్లో ఈ వైరస్ చాలా మందిని అనారోగ్యానికి గురి చేసింది. ఇప్పుడు కూడా అలాంటి వ్యాధే పిల్లల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నార్త్ చైనాలో ఇన్‌ఫ్లుయెంజా తరహా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అక్టోబర్ మధ్య నుంచే ఈ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. గత మూడేళ్లతో పోల్చి చూస్తే ఈ సారి కేసుల సంఖ్య పెరిగింది.
"ఎప్పుడీ వైరస్ వ్యాప్తి మొదలైందో తెలియదు. కానీ చాలా మంది చిన్నారులను ఇది సతమతం చేస్తోంది. చాలా తొందరగా వైరస్ సోకుతోంది. అయితే ఇది పెద్దలకు సోకుతుందో లేదో అన్నది ప్రస్తుతానికి స్పష్టత లేదు. అలా అని వాళ్లకు సోకదు అని నిర్ధరించుకోడానికీ వీల్లేదు"
- ప్రోమెడ్ అలెర్ట్
తీవ్ర జ్వరం, దగ్గు..
తైవాన్‌లోని FTV News చైనాలోని పరిస్థితులపై కీలక వివరాలు వెల్లడించింది. బీజింగ్, లియావోనింగ్‌లో బాధితులు పెరుగుతున్నారు. అంతు చిక్కని న్యుమోనియాతో హాస్పిటల్స్‌లో చేరుతున్న పిల్లల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వాళ్లలో కొంత మంది విపరీతంగా దగ్గుతున్నారు. జ్వరమూ వస్తోంది. కానీ కొందరికి ఎలాంటి లక్షణాలు లేకుండానే సోకుతోంది. The Telegraph వివరాల ప్రకారం...దీన్ని walking pneumoniaగా పిలుస్తారు. ఇప్పుడిప్పుడే చైనాలో వింటర్ సీజన్ మొదలైంది. కొవిడ్ ఆంక్షల్నీ పూర్తి స్థాయిలో ఎత్తేశారు. అందుకే ఉన్నట్టుండి ఈ న్యుమోనియా కలవర పెడుతోంది. అటు అమెరికా, బ్రిటన్‌లోనూ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డిటైల్డ్ రిపోర్ట్ అడిగింది.