Mukesh Amban Meet US President Donald Trump | అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. ప్రపంచ దేశాల అధినేతలు, ప్రముఖుల మధ్య ట్రంప్​ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో భారత కుబేరుడు, రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, ఆయన భార్య రిలయన్స్​ ఫౌండేషన్​ ఫౌండర్​ నీతా అంబానీ అమెరికాలో డొనాల్డ్​ ట్రంప్‌తో భేటీ అయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం, మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్న నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్రంప్​తో ముకేశ్‌, నీతా అంబానీలు సమావేశమైన ఫొటో ఒకటి నెట్టింట సందడి చేస్తోంది. వాణిజ్య పరంగా ఏమైనా చర్చలు జరిపారా అనే విషయం తెలియరాలేదు.


భారత్​ నుంచి ఈ ఇద్దరికే..
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్​ ట్రంప్​ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచ దేశాల అధినేతలు, ప్రముఖులకు అక్కడి అధికారులు ఆహ్వానం పంపించారు. భారత కుబేరుడు అంబానీకి కూడా ఆహ్వానం అందింది. ప్రమాణస్వీకారోత్సవానికి సతీసమేతంగా పాల్గొనాలకు ఆహ్వానం అందినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 మందికి ఆహ్వానం పంపగా.. భారత్‌ నుంచి వీరిద్దరే ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే అంబానీ దంపతులు శనివారం వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు. 


క్యాండిల్‌లైట్ డిన్నర్​లో పాల్గొన్న దంపతులు
శనివారం సాయంత్రం ట్రంప్‌తో కలిసి ‘క్యాండిల్‌లైట్ డిన్నర్’కు హాజరైన 100 మందిలో వీరిద్దరూ కూడా ఉన్నారని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. వాషింగ్టన్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు విందులో ట్రంప్‌తో ముకేశ్‌ దంపతులు భేటీ అయ్యారని భారత్​లోని రిలయన్స్‌ ఫౌండేషన్‌ సైతం వెల్లడించింది. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు డొనాల్డ్‌ ట్రంప్‌నకు  శుభాకాంక్షలు తెలిపారని పేర్కొంది. ట్రంప్‌ నాయకత్వంలో భారత్‌–అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆశిస్తున్నట్లు వెల్లడించింది.


కొన్నేండ్లుగా ఇరు కుటుంబాల సత్సంబంధాలు
కొన్నేండ్లుగా ట్రంప్​ కుటుంబం అంబానీ కుటుంబంతో సత్సంబంధాలు కలిగి ఉంది. 2017లో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ కోసం ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు అంబానీలు ఆమెకు కావాల్సిన ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. 2020 ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చివరిసారిగా భారత్‌ను సందర్శించినప్పుడు కూడా ఆయన వెంట ముఖేశ్​ అంబానీ ఉన్నారు. గతేడాది జరిగిన అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ ముందస్తు వివాహ వేడుకలకు హాజరైన ప్రముఖుల్లో ఇవాంకా, ఆమె భర్త జారెడ్ కుష్నర్, వారి పెద్ద కుమార్తె అరబెల్లా రోజ్ పాల్గొన్నారు.


ప్రత్యేక అథితులు వీరే..
ట్రంప్​ ప్రమాణస్వీకారోత్సవంలో ముకేశ్​, నీతా అంబానీల జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ క్యాబినెట్ నామినీలు, ఎన్నికైన అధికారులతోపాటు ఇతర ప్రముఖ అతిథులతో కలిసి ఈ జంట వేదికను పంచుకోనుంది. కార్యక్రమంలో మాజీ ప్రెసిడెంట్ జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, సెకండ్ జెంటిల్‌మన్ డౌగ్ ఎంహాఫ్, మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ బుష్ మరియు బిల్ క్లింటన్ పాల్గొననున్నారు. 



ప్రపంచంలోని ముగ్గురు అత్యంత ధనికులు 
ప్రపంచలోని ముగ్గురు కుబేరులు సైతం కార్యక్రమంలో పాల్గొననున్నారు. టెక్ వ్యవస్థాపకుడు, ట్రంప్ మద్దతుదారుడు ఎలోన్ మస్క్ తోపాటు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్, ఫేస్‌బుక్ మాతృ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్ ఈ వేడుకల్లో భాగం కానున్నారు. ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్, ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహికు సైతం ఆహ్వానాలు అందనట్లు సమాచారం.


Also Read: Donald Trump: అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందే Elon Muskకు కీలక బాధ్యతలు అప్పగించిన డొనాల్డ్ ట్రంప్