Miss Universe 2022 Winner: R Bonney Gabriel of the United States was crowned Miss Universe
మిస్ యూనివర్స్ 2022గా అమెరికాకు చెందిన ఆర్ బొన్నీ గాబ్రియెల్ నిలిచింది. విశ్వసుందరి కిరీటాన్ని అమెరికా సుందరి బొన్నీ గాబ్రియెల్ సగర్వంగా దక్కించుకుంది. 86 దేశాల నుంచి వచ్చిన అందగత్తెలతో పోటీపడి విశ్వ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. మిస్ వెనిజులా అమండా డుడమెల్ రన్నరప్ గా నిలవగా, డొమినికా రిపబ్లికన్ భామ ఆండ్రినా మార్టినెజ్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీలు అమెరికాలోని న్యూ ఆర్లీన్స్‌లోగల మోరియల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. తన అందంతో పాటు ప్రతిభను కనబరిచిన 71వ విశ్వ సుందరి పోటీల్లో విజేతగా అమెరికా అందం బొన్నీ గాబ్రియెల్ అవతరించింది. 28 ఏళ్ల మోడల్, ఫ్యాషన్ డిజైనర్, పర్యావరణానికి సంబంధించి కార్యక్రమాలు నిర్వహించే బొన్నీ గాబ్రియెల్ తన కలను సాకారం చేసుకున్నారు. మాజీ మిస్ యూనివర్స్, పంజాబ్ సుందరి హర్నాజ్ సంధు విశ్వ సుందరికి కిరీటాన్ని అలంకరించింది.
మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొని గతంలో భారత్ సత్తా చాటింది. భారత్ నుంచి ఇప్పటివరకూ సుస్మితా సేన్, లారా దత్తా, హర్నాజ్ సంధూ మిస్ యూనివర్స్ కిరీటాన్ని చేజిక్కించుకున్నారు. భారత యువతి 21 ఏళ్ల హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్-2021 కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఇజ్రాయెల్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 80 దేశాల నుంచి ముద్దుగుమ్మలు పాల్గొన్నారు. ఈ ఏడాది అమెరికాలోని న్యూ ఆర్లీన్స్‌లో జరిగిన 71వ మిస్ యూనివర్స్ పోటీలకు భారత్ నుంచి దివితా రాయ్ పాల్గొంది. భారత అందం మిస్ యూనివర్స్ పోటీల్లో టాప్ 16లో చోటు దక్కించుకుంది, ఆపై టాప్ 5కి క్వాలిఫై కాలేకపోయింది.
ఒకవేళ నువ్వు మిస్ యూనివర్స్ అయితే మహిళా సాధికారతకు ఏం చేస్తావు అని అడిగిన ప్రశ్నలకు సింపుల్ గా బదులిచ్చింది ఈ అమెరికా అందం. రీ సైకిల్ చేసిన పదార్ధాలు, ఉత్పత్తుల ద్వారా దుస్తులు తయారు చేయాలని నిరంతరం తాపత్రయ పడుతుంటానని చెప్పి పర్యావరణంపై తనకున్న ప్రేమను చాటుకుంది. తనకు అనుభవం ఉన్న ఫ్యాషన్ రంగాన్ని మంచి కోసం వినియోగించుకుంటానని చెప్పిన బొన్నీ గాబ్రియెల్.. గృహ హింస, మనుషుల అక్రమ రవాణా లాంటి అంశాలలో మహిళలకు అవగాహనా కల్పిస్తానని జడ్జీలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఇతరుల కంటే భిన్నంగా ఉన్న టాలెంట్ ను మహిళలు వాడుకోవాలని ప్రోత్సహిస్తానని చెప్పింది. 2022 డిసెంబర్ లో 71వ మిస్ యూనివర్స్ పోటీలను నిర్వహించాల్సి ఉంది. కానీ ఆ సమయంలో ఫిఫా వరల్డ్ కప్ నిర్వహించడంతో విశ్వ సుందరి పోటీలను జనవరికి వాయిదా వేశారని తెలిసిందే.