పందికి గుండె మార్పిడి చేసిన మొదటి వ్యక్తి మరణించినట్లు అమెరికాలోని మేరీల్యాండ్ ఆసుపత్రి తెలిపింది. సంచలనాత్మక ప్రయోగం చేసిన రెండు నెలల తర్వాత 57 ఏళ్ల వ్యక్తి మంగళవారం మరణించినట్లు మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం ప్రకటించింది.
డేవిడ్ బెన్నెట్ (57) యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్‌లో మంగళవారం మరణించారు. అతని మరణానికి కారణాలపై వైద్యులు ఎలాంటి ప్రకటన చేయలేదు. చాలా రోజుల క్రితం అతని పరిస్థితి క్షీణించడం ప్రారంభించిందని మాత్రమే చెప్పారు.
తన తండ్రిని బతికించేందుకు ఆసుపత్రి వర్గాలు చేసిన ప్రయత్నాన్ని బెన్నెట్ కుమారుడు ప్రశంసించాడు. పంది గుండె అమర్చిన ప్రయోగాన్ని కూడా ప్రశంసించాడు. అవయవ కొరతను అదిగమించేందు భవిష్యత్‌లో కూడా ఇలాంటి ప్రయోగాలకు సహకరిస్తామని తెలిపారాయన.
అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన యాభై ఏడేళ్ల డేవిడ్ బెన్నెట్‌కు గుండె సమస్య వచ్చింది. దీంతో ఆయనకు హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ చేయాలని నిర్ణయించారు వైద్యులు. జన్యుమార్పిడి చెందిన పంది గుండెను ఎనిమిది గంటల పాటు కష్టపడి మార్పిడి చేశారు. జనవరి 11 న ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఆ ఆపరేషన్ అయిన 24 గంటల తరువాత బెన్నెట్ గుండెను పరిశీలించారు వైద్యులు. ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందని ప్రకటించారు. ఇంతకు ముందెప్పుడు ఇలా జరుగలేదన్నారు. ఒక జంతువు గుండెను మనిషికి అమర్చడం ఇదే తొలిసారి’ అని చెప్పారు.
మానవ శరీరం తిరస్కరించే వీల్లేకుండా పందులను అభివృద్ధి చేస్తున్నారు శాస్త్రవేత్తలు. గత పదేళ్లుగా ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. కొత్త జన్యు సవరణ, క్లోనింగ్ టెక్నాలజీల ద్వారా పందుల అవయవాలు మనుషులకు కూడా నప్పేలా మార్పులు చేస్తూ వస్తున్నారు. తొలిసారి అలా జన్యు మార్పులకు గురైన పంది గుండెను మనిషికి అమర్చి విజయం సాధించారని భావించిన టైంలో ఆ వ్యక్తి మృతి కాస్త నిరాశకు గురి చేసింది. ఆ వ్యక్తి ఎన్ని నెలలు లేదా సంవత్సరాలు బతుకుతాడో మాత్రం అప్పుడే వైద్యులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ పరిశోధనల్లో భాగంగా మొదట పంది కిడ్నీని బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తికి అమర్చి పరిశోధనలు చేశారు. తరువాత ప్రాణం ఉన్న మనిషిపై ప్రయోగించారు. ఇది విఫలమైనప్పటికీ ఇలాంటి విధానాలు భవిష్యత్తులో వైద్య శాస్త్రంలో కొత్త శకాన్ని ప్రారంభిస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు.