UAE Lucky Draw Winner: మామూలుగా ఎవరికైనా లాటరీలో ఏదైనా తగిలితే ఏమంటారు? నక్క తోక తొక్కావు అంటారు. అదే వంద రూపాయలతో కొన్న లాటరీ టికెట్టుతో రూ.45 కోట్లు వస్తే ఏమనుకోవాలి? ఒకటి కాదు..  రెండు కాదు.. ఏకంగా అక్షరాల 45 కోట్లు. అది తలుచుకుంటేనే వామ్మో అంత డబ్బే అని కళ్లు తేలేయాల్సిందే. ఆ ఆదృష్టం ఓ కేరళ వాసికి దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని వివిధ నగరాల్లో నివసిస్తున్న 5 మంది భారతీయులు యూఏఈ వారపు డ్రాలు లాటరీని గెలుచుకున్నారు. ఇందులో కేరళకు చెందిన 39 ఏళ్ల శ్రీజు బుధవారం జరిగిన మహ్జూజ్ సాటర్డే మిలియన్స్ డ్రాలో ఏకంగా రూ. 45కోట్లు గెలుచుకున్నారు. 


వివరాలు.. కేరళకు చెందిన 39 ఏళ్ల శ్రీజు దుబాయ్‌లో చమురు, గ్యాస్ పరిశ్రమ కంట్రోల్ రూమ్‌లో ‘ఆపరేటర్’గా పనిచేస్తున్నారు. ఇటీవల మహ్జూజ్ సాటర్డే మిలియన్స్‌ లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. బుధవారం ప్రకటించిన డ్రాలో శ్రీజు 2 కోట్ల దిర్హామ్‌లు గెలుపొందాడు. భారత కరెన్సీలో రూ. 45 కోట్లకు పైగా మాటే. డ్రాలో తాను గెలుపొందినట్లు తెలుసుకున్న శ్రీజు ఆనందంతో ఎగిరి గంతులేసాడు. తాను అంత పెద్ద ప్రైజ్ మని గెలుచుకుంటానని ఊహించలేదని, వార్త తెలిసి షాక్ కు గురయ్యానని తెలిపాడు.


గత 11ఏళ్లుగా అరబ్ దేశాల్లో పనిచేస్తున్న శ్రీజు కేరళలో ఒక చిన్నపాటి ఇళ్లు కూడా నిర్మించుకోలేదు. లాటరీ గెలిచిన అనంతరం ఆయన ఏమన్నారంటే.. ‘కారులో వెళ్తున్నప్పుడు లాటరీ సంస్థకు చెందిన మహ్జూద్ ఖాతాను చెక్ చేసుకున్నా..  ఆ సమయంలో నా కళ్లను నేనే నమ్మలేకపోయా. లాటరీ తగిలినట్లు మహ్జూజ్ నుంచి కన్ఫర్మేషన్ కాల్ రావడంతో ఈ అద్భుతమైన విజయాన్ని చూసి అయోమయంలో పడ్డాను’ అని చెప్పారు. 


యూఏఈ లక్కీ డ్రాలో భారతీయులు పెద్ద మొత్తాల్లో డబ్బు గెలుచుకోవడం కొత్తేం కాదు. గతంలో చాలా మంది కోట్ల రూపాయలు గెలుచుకున్నారు. తాజాగా ముంబైకి చెందిన మనోజ్ భావ్‌సర్ అనే వ్యక్తి ఇటువంటి లక్కీ డ్రాలో గెలుపొందారు. అబుదాబిలో 16ఏళ్లుగా ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇతను FAST5 రాఫిల్ అనే లాటరీలో సుమారు రూ. 16 లక్షలు గెలుచుకున్నారు. అక్కడి కరెన్సీ ప్రకారం 75 వేల దిర్హాంగా చెప్పుకొచ్చారు. ఈ లాటరీలో గెలిచిన డబ్బుల ద్వారా తన అప్పులను తీర్చుకోగలిగానన్నారు.


నవంబర్ 8న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో నిర్వహించిన ‘దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్’ ప్రమోషన్‌లో మరో భారతీయుడు అనిల్ జియాంచందానీ 1 మిలియన్ US డాలర్లను గెలుచుకున్నాడు. నవంబర్ 8 న, ‘మహ్జూజ్ సాటర్డే మిలియన్స్’ విజేతలలో, ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారని, వారు దాదాపు రూ. 22 లక్షలు గెలుచుకున్నట్లు ‘గల్ఫ్ న్యూస్’ ప్రచురించింది. గత కొన్ని వారాల క్రితం దుబాయ్‌లో జరిగి డ్యూటీ-ఫ్రీ మిలినియం మిలినియర్ డ్రాలో భారత దేశానికి చెందిన మహిళ యూఎస్‌డీ 1 మిలియన్ సాధించారు. 


యూఏలో లాటరీ టికెట్లు కొనుగోలు చేయడం అంత సులువు కాదు. టికెట్ కొనాంటే అధిక ధరలు వెచ్చించాల్సి ఉంటుంది. తమ సంపాదనలో కొంత డబ్బులు పోగుజేసుకొని అప్పుడప్పుడూ కొంటూ ఉంటారు. అయితే ఇక్కడ విజేతలకు ఓ ప్రయోజనం ఉంటుంది. కేరళలో లాటరీల మాదిరిగా కాకుండా, ఈ UAE డ్రాలు ఎలాంటి పన్ను తగ్గింపు లేకుండా విజేతకు పూర్తి మొత్తాన్ని అందిస్తాయి. అందుకే ఇక్కడ టికెట్లు కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు.