Loy Krathong Festival 2022: కింది ఫోటోలోని యువతి బతుకమ్మని నీటిలో వదులుతున్నట్టు ఉంది కదా...! మొదటిసారి చూసినప్పుడు మీరు కూడా కన్ఫ్యూజ్ అయి ఉంటారు. నిజానికి ఈ పండుగ ఇక్కడిది కాదు థాయిలాండ్ లో కార్తీక పౌర్ణమి సందర్భంగా అక్కడి యువతీ యువకులు మన వద్ద పేర్చే బతుకమ్మ లాంటి తెప్పలను నీటిలో వదిలి తమ జీవితాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తారు. బౌద్ధాన్ని ఆచరించే థాయిలాండ్ లో శరన్నవ రాత్రుల పూజతో పాటు కార్తీక పౌర్ణమి రోజున ఇలా అలంకరించిన తెప్పలను వాటిపై దీపాలు వెలిగించి నదిలో వదిలే సాంప్రదాయం ఉంది. సంధ్యా చీకట్లు రాగానే పూర్తిగా అక్కడి సరస్సులు.. చెరువులు.. నదులలో దీపాలను వేల సంఖ్యలో వదులుతారు. అటు ఆకాశంలో తారల మెరుపులకు కింద ఉండే ఈ దీపాల మెరుపులు తోడై అద్భుతమైన కనువిందు చేస్తుంది. 




లోయ్ అంటే థాయ్ భాషలో  తెప్ప... క్రతోంగ్‌ అంటే దీపం... అరటి కాండం ఆకులను ఉపయోగించి మన వద్ద బతుకమ్మ లాంటివి పేర్చి అందులో దీపాన్ని లేదా క్యాండిల్ ని ఉంచి, సుగంధ పరిమళాలు వెదజల్లే అగరొత్తులను వెలిగించి అలంకరణ చేస్తారు. మరోవైపు అందమైన అలంకరణ చేసిన వారికి పోటీలు నిర్వహించి బహుమతులు కూడా అందజేస్తారు. ఇక యువకులు తమకు సరైన జోడి రావాలని కష్టాలు తీరిపోవాలని లాంతరులను గాలిలో ఎగరేస్తారు. దేశమంతటా బాణసంచా కాలుస్తారు. కొన్ని వందల ఏళ్ళ నుండి కొనసాగుతున్న ఈ సాంప్రదాయం అటు బుద్ధ భగవానుని పూజించడంతోపాటు మానవాళి మొదటి నుండి పూజిస్తున్న నదీ నదాలను గౌరవించడమే ఈ పండుగకి అర్థం. 
ఇక థాయిలాండ్ లో ప్రముఖ ఆలయమైన "వాట్‌ఫానతావో" అందమైన అలంకరణతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. దేశదేశాల నుండి వచ్చిన యాత్రికులు అక్కడ అద్భుత దీపాలంకరణ తమ ఫోటోల్లో బంధించి జీవితకాల జ్ఞాపకాల్లో చేర్చుకుంటారు. ప్రకృతిని ఆరాధించడం మొదటి నుండి మానవజాతికి అత్యంత ఇష్టమైన అంశం. అది మన వద్ద బతుకమ్మ రూపంలో దసరాకి వస్తే... థాయిలాండ్ లో ఈ పండుగ రూపంలో వచ్చి అక్కడి ప్రజలని సంతోషంలో  సంబరాలు జరుపుకునేలా చేస్తుంది.




ఇతర దేశాల్లోనూ ఇలా...


థాయ్‌లాండ్‌లో.. ఈ పండుగను లోయి క్రతోంగ్ అంటారు. అయితే ఇదే పండుగను థాయ్‌లాండ్ వివిధ పేర్లతో జరుపుకుంటారు. ఇందులో మయన్మార్‌లో " తాజాంగ్‌ డేయింగ్ పండుగ "గానూ , శ్రీలంకలో " ఇల్ పౌర్ణమి పోయి"గానూ , చైనాలో " లాంతర్ పండుగ " గానూ మరియు కంబోడియాలో బాన్ ఓమ్ టౌక్‌గానూ జరుపుకుంటారు.


లాయ్ క్రాథోంగ్ ఖైమర్ సామ్రాజ్యంలోని ఆంగ్కోర్ నుండి ఉద్భవించి ఉండవచ్చునని చరిత్రకారుల అభిప్రాయం. సుఖోథాయ్ రాజ్యంలో నోఫామట్ అనే ఆస్థాన మహిళచే ఈ సాంప్రదాయం ప్రారంభమైందని... గౌతమ బుద్ధుని పూజించడంతోపాటు వ్యక్తిగత జీవితంలో ఉన్నతిని కోరుతూ భగవంతుని ఆరాధించడమే లక్ష్యంగా ఈ పండుగను మొదలు పెట్టారని ప్రతీతి. వాల్స్ ఆఫ్ బేయోన్, 12వ శతాబ్దంలో కింగ్ జయవర్మన్ VII నిర్మించిన ఆలయం, లోయ్ క్రాథోంగ్ పండుగ జరుపుకుంటున్న దృశ్యాలను వర్ణిస్తుంది. 




ఆ కాలానికి చెందిన ఖైమర్ సామ్రాజ్యానికి చెందిన బోండెట్ బ్రతిబ్, చైనా లో ప్రజలు జరుపుకునే వాటర్ లాంతర్ ఉత్సవాలతోపాటు భారతదేశంలోని తూర్పు ఒడిషా రాష్ట్రంలో జరుపుకునే కార్తీక పూర్ణిమ పండుగ లాంటి మూడు ముఖ్యమైన సాంస్కృతిక ఉత్సవాల మిశ్రమ పండుగగా చరిత్రకారులు భావిస్తారు. ఆ కాలంలో వ్యాపారం వాణిజ్యం రవాణా ముఖ్యంగా నౌకల ద్వారా సముద్ర మార్గాన కొనసాగుతుండడంతో ఈ మూడు దేశాల మిశ్రమ సంస్కృతిగా ఈ పండుగ ఆవిర్భవించిందని వారి పరిశోధనలో తేలింది.