Israel-Iran Tension Row: ఇజ్రాయెల్‌పై మంగళవారం క్షిపణిదాడులతో నిప్పుల వర్షం కురిపించడాన్ని ఇజ్రాయెల్ తీవ్రమైన చర్యగా పరిగణించింది. సరైన సమయంలో సరైన చోట తమకు నచ్చిన విధానంలో దాడులు తీవ్రంగా ఉంటాయని ఇరాన్‌ను ఇప్పటికే ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇరాన్‌ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్ మొదటి లక్ష్యం అన్నది సుస్పష్టం. దీనితో పాటు ఇరాన్ చమురు ఫెసిలిటీస్‌ను టార్గెట్ చేసి ఆ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ సంబంధాల నిపుణులు అంచనా వేస్తున్నారు.


మంగళవారం నాటి దాడులకు అతి త్వరలోనే ప్రతీకారం తప్పదు:


హెజ్బొల్లా అధినేత నస్రల్లాతోపాటు హమాస్‌ నేతలను ఇజ్రాయెల్‌ మట్టుపెట్టడాన్ని నిరసిస్తూ ఇజ్రాయెల్‌పై మంగళవారం ప్రతీకార దాడులకు దిగింది. గంటల వ్యవధిలో సుమారు 200 వరకు ఖండాంతర క్షిపణులను ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రయోగించింది. అమెరికా ముందస్తు సమాచారంతో ప్రజలను ఇజ్రాయెల్ అప్రమత్తం చేయడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. అంతే కాకుండా ఆ క్షిపణులను గగనతలంలోనే అడ్డుకొనే వ్యవస్థను మధ్యదరా తీరంలో ఉన్న నౌకల ద్వారా అమెరికా అప్పటికప్పుడు ఇజ్రాయెల్‌కు అందించి అనేక క్షిపణులను గాల్లోనే సమర్థంగా అడ్డుకోవడంలో సహాయ పడింది. అప్పటికి టెల్ అవీవ్‌లోని మొస్సాద్‌ కార్యాలయాన్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకోగా దాని సమీపంలో జరిగిన పేలుడు ధాటికి భారీ గొయ్యి ఏర్పడింది. కొన్ని గంటల పాటు అక్కడ దుమ్ము మేఘాలు ఆవరించాయి. ఆ స్థాయిలో ఇరాన్ దాడులు కొనసాగాయి.


ఇరాన్‌ దాడులపై ఇజ్రాయెల్ నాయకత్వం తీవ్రంగా మండిపడింది. ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తీవ్రంగా హెచ్చరించింది. ఈ దాడులు చేసి ఇరాన్ సరిదిద్దుకోలేని తప్పు చేసిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ అన్నారు. తమ పౌరులను రక్షించుకోవడంలో ఇజ్రాయెల్ శక్తి సామర్థ్యాలను ఇరాన్ తక్కువ అంచనా వేసి తొందరపాటు చర్యలకు దిగిందని మండిపడ్డారు. దీనికి తీవ్రమైన ప్రతిఘటన తప్పదని నెతన్యాహూ హెచ్చరించారు.


ఇరాన్ చమురు బావులతో పాటు అనేక వ్యూహాత్మక లక్ష్యాలు:


లెబనాన్‌ దాడుల్లో ఇరాన్ మద్దతుతో నడిచే హెజ్బొల్లా అధినేత హసన్‌ నస్రల్లా మరణంతో ఇరాన్ ముందుస్తు చర్యలకు దిగింది. నస్రల్లాను ఇజ్రాయెల్ మట్టుపెట్టిన రోజే ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీని అత్యంత భద్రత మధ్య ఇరాన్‌లోనే ఒక రహస్యమైన సురక్షిత ప్రదేశానికి తరలించింది. ఆ తర్వాత మంగళవారం నాడు ఈ దాడులకు పాల్పడింది. ఒకప్పటి మిత్రులైన ఈ రెండు దేశాలు శత్రువులుగా మారడానికి, హెజ్బొల్లా, హమాస్‌ ఇజ్రాయెల్‌పై ఇన్నేళ్ల పాటు యుద్ధం సాగించడానికి ఖమేనీనే ప్రధాన కారణంగా భావిస్తున్న ఇజ్రాయెల్, ఎప్పటి నుంచో ఖమేనీని తమ లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తోంది. మంగళవారం నాటి దాడులతో మరిన్ని లక్ష్యాలను అది పెట్టుకునే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు.        


మధ్యప్రాశ్చ్యంలో ఇరాన్ ప్రమాదకరమైన ఆటకు తెరతీసిందని, దీని పర్యవసానాలు దారుణంగా ఉంటాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ స్పోక్స్ పర్సన్ డేనియల్‌ పేర్కొన్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పద్ధతిలో అయినా తమ రిటాలియేషన్ ఉంటుందని డేనియల్ స్ఫష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం తమ కార్యాచరణ అమలు ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో ఖమేనీతో పాటు మరికొందరు ఇరాన్ అగ్రనాయకత్వంపై లక్షిత దాడులు చేసి నస్రల్లా మాదిరి వారిని మట్టుపెట్టే అవకాశాలను ఇజ్రాయెల్ సైన్యం పరిశీలిస్తోంది. ఇప్పటికే టెహ్రాన్‌లో కోవర్ట్ ఆపరేషన్ ద్వారా హమాస్ అధినేత హనియాను ఇజ్రాయెల్‌ మట్టుపెట్టిన ఘటనలు కూడా ఉన్నాయి. ప్రధాన వ్యక్తులతో పాటు ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన చోదకశక్తిగా ఉన్న ఆయిల్‌ బావులపై కూడా తీవ్రమైన వైమానిక దాడులు జరిపే అవకాశం కూడా ఉంది. వీటితో పాటు ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థపై కూడా తీవ్రమైన దాడులు జరగొచ్చని అంచనా వేస్తున్నారు.  ఇప్పటికే ఇరాన్‌ సహా మధ్యప్రాశ్చ్యంలో ఇజ్రాయెల్ ఆయుధాల నుంచి తప్పించుకోగల ప్రాంతాలు లేవని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.


Also Read: రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !