Israel Bans UN Chief Guterres From Entering Country: ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేస్తున్న క్షిపణి దాడులను ఖండించని వారి పట్ల ఇజ్రాయెల్ కఠిన వైఖరి ప్రదర్శిస్తోంది. తమ దేశంపై దాడులను ఖండించని ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు ఆంటోనియో గ్యుటెర్రస్‌ను ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. ఇరాన్ దుందుడుకు చర్యలు ఖండించని ఎవరికైనా ఇదే గతి పడుతుందని టెల్ అవీవ్ హెచ్చరించింది. ఇరాన్‌కు తగిన బుద్ధి చెబుతామని స్ఫష్టం చేసింది.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాంబుల వర్షం
హమాస్ నేతలతో పాటు హెజ్బొల్లా అగ్రనేతలను మట్టుపెట్టిన ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్ క్షిపణి దాడులు చేసింది. దాదాపు 200 వరకు ఇరాన్ గగనతలం నుంచి వచ్చి ఇజ్రాయెల్‌పై విరుచుకు పడ్డాయి. ఒక క్షిపణి టెల్‌అవీవ్‌లోని మొస్సాద్ కార్యాలయం సమీపంలో పేలగా అక్కడ భారీ గొయ్యి ఏర్పడింది. ఆ స్థాయిలో ఇరాన్ దాడి కొనసాగింది. దాడి తర్వాత అక్కడ భారీ ఎత్తున ధుమ్ము మేఘాలు ఆవరించాయి. ఇరాన్ దాడుల సమయంలో దేశ వ్యాప్తంగా సైరన్‌లు మోగడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. అందరూ బంకర్లలోకి వెళ్లారు. ప్రజలపై తాము దాడులు చేయడం లేదన్న టెహ్రాన్, హెజ్బొల్లా అధినేత నస్రల్లా, హమాస్ అధినేత ఇస్మాయిల్ హనీయా మరణాలకు ప్రతీకార దాడులు మాత్రమే చేస్తున్టన్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ మూల్యం చెల్లించక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ తేల్చి చెప్పారు.
దాడులపై ముందే ఇజ్రాయెల్‌ను అప్రమత్తం చేసిన యూఎస్:
ఇజ్రాయెల్‌పై దాడులను ఇరాన్ ప్లాన్ చేస్తున్న విషయాన్ని అమెరికా ముందుగానే ఇజ్రాయెల్ చెవిన వేసింది. మరో 12 గంటల్లో దాడులు జరుగుతాయంటూ హెచ్చరించింది. దాడికి ముందే తూర్పు మధ్యధరా తీరంలో తమ షిప్‌లను సిద్ధంగా ఉంచింది. అమెరికా తన ఇంటర్‌సెప్టార్స్‌ను అందించి చాలా వరకు బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడంతో ఇజ్రాయెల్ భూతంలపై నష్టం తక్కువగా జరిగింది. ఈ మొత్తం ఆపరేషన్‌ను జోబైడెన్ దగ్గరుండి పరిశీలించారు. ఆయన ఆదేశాలతోనే యూఎస్ నేవీ బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడంలో సహకరించింది. ఆస్ట్రేలియా, యూకే కూడా ఇరాన్ దాడులను ఖండించాయి.
యూఎన్ అధ్యక్షుడిపై ఇజ్రాయెల్ నిషేధం:
ఇజ్రాయెల్‌పై ఇరాన్ నిప్పుల వర్షం కురిపిస్తున్న వేళ మౌనంగా ఉన్న యూఎన్ చీఫ్ ఆంటోనియో గ్యుటెర్రస్‌పై తమ దేశంలోకి ప్రవేశం నిషేధిస్తూ టెల్‌అవీవ్ ప్రకటన చేసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ పేర్కిన్నారు. ఉగ్రవాదులు రేపిస్టుల పక్షాన నిలిచిన గ్యుటెర్రస్ యూఎన్‌కు మాయని మచ్చలా తయారయ్యారంటూ కాట్జ్ తీవ్ర విమర్శలు చేశారు. గ్యుటెర్రస్ సహకారం ఉన్నా లేకున్నా ఇజ్రాయెల్ తన ప్రజల ప్రాణాలను, ఆత్మాభిమానాన్ని కాపాడుకోగలదని చెప్పారు. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి చీఫ్‌ను పర్సనా నాన్ గ్రాటాగా ఇజ్రాయెల్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు.