Israel Palestine War:
పాలస్తీనా రిపోర్టర్ ఆవేదన..
ఇజ్రాయేల్, హమాస్ యుద్ధం (Israel Hamas War) రోజురోజుకీ తీవ్రమవుతోంది. గాజా వద్ద వేలాది మంది పౌరులు భయం భయంగా గడుపుతున్నారు. రెండు వైపులా ఎదురవుతున్న దాడుల్ని తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే వందలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ యుద్ధ వాతావరణంలో ఉండలేక కొంత మంది వేరే చోటుకి వలస పోతున్నారు. అయితే...ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తున్న మీడియా ప్రతినిధులూ ప్రాణాల్ని పణంగా పెట్టాల్సి వస్తోంది. ఇటీవలే ఓ మీడియా సంస్థకి చెందిన రిపోర్టర్ కుటుంబ సభ్యులు ఇజ్రాయేల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. జర్నలిస్ట్‌లకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయింది. పాలస్తీనా రిపోర్టర్ (Palestine Reporter) ఒకరు అక్కడి హాస్పిటల్ నుంచి రిపోర్ట్ చేస్తూ జర్నలిస్ట్‌లు ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో చెప్పాడు. ఇది విని లైవ్‌లోనే న్యూస్ ప్రెజంటర్ కన్నీళ్లు పెట్టుకుంది. "మేం ఏ క్షణమైనా చనిపోవచ్చు" అని ఆవేదన వ్యక్తం చేశాడు ఆ రిపోర్టర్. ఈ మాటల్ని తట్టుకోలేక మహిళా యాంకర్ భావోద్వేగానికి గురైంది. ఈ మధ్యే జరిగిన దాడిలో ఇదే ఛానల్‌కి చెందిన ఇద్దరు రిపోర్టర్‌లు మృతి చెందారు. తన తోటి జర్నలిస్ట్‌ల్లాగే తానూ ఎప్పుడో అప్పుడు చనిపోతానని చెప్పాడు ఆ రిపోర్టర్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ ఈ యుద్ధంలో దాదాపు 31 మంది జర్నలిస్ట్‌లు చనిపోయారు. వీళ్లలో నలుగురు ఇజ్రాయేల్‌లో, ఒకరు లెబనాన్‌లో, మిగతా 26 మంది గాజాలో మృతి చెందారు. ఒక్క గాజాలోనే దాదాపు పది వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు అంచనా. అందుకే...పాలస్తీనా టీవీ రిపోర్టర్ అంతగా ఎమోషనల్ అయ్యాడు. తానూ ఎక్కువ కాలం బతకనంటూ లైవ్‌లో రిపోర్టింగ్ చేశాడు.
"ఈ యుద్ధ వాతావరణంలో ఉండలేకపోతున్నాం. ఏం చేయాలో తోచట్లేదు. బాధితులకు దిక్కు తోచడం లేదు. మేమూ ఎప్పుడో అప్పుడు చనిపోతాం. జర్నలిస్ట్‌ల గురించి ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ప్రెస్ జాకెట్‌లు, హెల్మెట్‌లు పెట్టుకున్నా ఏ లాభం లేదు. ఇవేవీ మాకు రక్షణ కల్పించలేకపోతున్నాయి"
- పాలస్తీనా టీవీ రిపోర్టర్
హమాస్ ప్రతినిధి ఘాజీ హమాద్ (Ghazi Hamad) చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఇజ్రాయేల్‌కి గుణపాఠం నేర్పేందుకు మళ్లీ మళ్లీ దాడులు చేసేందుకైనా సిద్ధమే అని తేల్చి చెప్పారు. Middle East Media Research Institute (MEMRI) ఈ వ్యాఖ్యల్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఇజ్రాయేల్‌పై దాడి చేసినందుకు తాము సిగ్గుపడడం లేదని స్పష్టం చేశారు ఘాజీ హమాద్.
"ఇజ్రాయేల్‌పై దాడి చేశామే అని మేమేమీ సిగ్గు పడడం లేదు. అసలు ఆ గిల్ట్ లేనే లేదు. ఇజ్రాయేల్‌కి గుణపాఠం నేర్పాలనుకున్నాం కాబట్టే దాడులు చేశాం. మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటాం. మా నేలపై వాళ్ల పెత్తనం ఉండనే కూడదు. వాళ్లకు ఆ హక్కు లేదు. పాలస్తీనా ప్రజలకు ఆక్రమణల బాధితులుగా మిగిలిపోవాల్సిన ఖర్మ లేదు. మా దాడులతో అయినా ఇజ్రాయేల్ ఆక్రమణలు ఆగిపోతాయని అనుకుంటున్నాం. పాలస్తీనాకి చెందిన నేలను ఇజ్రాయేల్ ఆక్రమించడం ఆగిపోవాలి"
- ఘాజీ హమాద్, హమాస్ ప్రతినిధి
Also Read: బయటకు వచ్చారో బాడీలో ప్రతి అవయవం పాడైపోతుంది - ఢిల్లీ కాలుష్యంపై వైద్యుల వార్నింగ్