UPI in Sri Lanka Soon: ఇండియాలో పుట్టి, 140 కోట్ల జనాభా దైనదిన జీవితంలో భాగమైన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI), క్రమంగా విదేశాలకూ విస్తరిస్తోంది. ఇప్పటికే చాలా దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల, ఆయా దేశాల్లోని వ్యక్తులకు డబ్బు పంపడం, వారి నుంచి స్వీకరించడం చిటికె వేసినంత టైమ్‌లో, అత్యంత సులభంగా మారింది. తాజాగా, యూపీఐ పరిధిలోకి శ్రీలంక కూడా రాబోతోంది.


శ్రీలంకలో ప్రకటించిన నిర్మల సీతారామన్
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రస్తుతం శ్రీలంకలో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. గురువారం శ్రీలంకలో జరిగిన ఒక కార్యక్రమంలో, ఆర్థిక మంత్రి ఒక పెద్ద ప్రకటన చేశారు. ఆ ఐలాండ్‌ కంట్రీలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ సర్వీస్‌ అతి త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రతిపాదిత ఆర్థిక-సాంకేతిక సహకార ఒప్పందంపై జరిగిన చర్చల్లో భారత్‌, శ్రీలంక మంచి పురోగతి సాధించాయని వెల్లడించారు.


భారతీయ తమిళులు శ్రీలంకకు వెళ్లి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని గురువారం ఏర్పాటు చేశారు. భారత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీలంకలో త్వరలో యూపీఐ సేవలను ప్రారంభించడం గురించి ఆ ప్రోగ్రామ్‌లో ప్రకటించారు. భారత్-శ్రీలంక మధ్య సంబంధాలు చాలా గాఢమైనవని చెప్పారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న కనెక్టివిటీతో చాలా ఇబ్బందులను అధిగమించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవచ్చని సూచించారు. భారతదేశం, శ్రీలంకకు నిజమైన మిత్ర దేశమని, కష్టాల్లో ఉన్న శ్రీలంక ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి 4 బిలియన్ డాలర్లకు పైగా సాయం అందించామని నిర్మల సీతారామన్‌ చెప్పారు. శ్రీలంకకు ఆర్థిక సాయం చేయడానికి IMFకి ఫైనాన్సింగ్ హామీని అందించిన మొదటి దేశం భారతేనని వెల్లడించారు. దీనివల్ల, శ్రీలంకకు IMF నిధులు అందించే కార్యక్రమాన్ని సులభంగా మార్చేందుకు ఇతర దేశాలకు మార్గం సుగమం అయిందని అన్నారు.


విదేశాల్లో పెరుగుతున్న UPI ప్రభావం
భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ వినియోగం గత కొన్ని సంవత్సరాలుగా అత్యంత వేగంగా పెరిగింది. ఈ ఘన విజయాన్ని చూసిన ఇతర దేశాలు కూడా ఈ డిజిటల్ చెల్లింపు సాంకేతికతపై ఆసక్తి ప్రదర్శించాయి. భారత్‌లోనే కాదు, UPI ఏ దేశంలో అడుగు పెడితే అక్కడ ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రజల్లోకి చాలా వేగంగా చొచ్చుకెళుతోంది. ఇప్పుడు, మన పొరుగు దేశం శ్రీలంక కూడా ఈ లిస్ట్‌లో చేరబోతోంది. శ్రీలంక కంటే ముందు ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం వంటి దేశాలు ఈ పేమెంట్స్‌ టెక్నాలజీని ఆమోదించాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో, యూపీఐ వ్యవస్థకు సంబంధించిన ఒప్పందంపై భారత్‌-సింగపూర్ సంతకాలు చేశాయి. ఇప్పుడు, సింగపూర్ నుంచి భారత్‌లో ఉన్న వ్యక్తి/సంస్థకు QR కోడ్ స్కాన్‌ చేయడం ద్వారా, లేదా మొబైల్ నంబర్ ద్వారా క్యాష్‌ ట్రాన్జాక్షన్స్‌ చేయవచ్చు. ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాంలో ఉన్న వ్యక్తులు/సంస్థలతోనూ ఇదే విధంగా లావాదేవీలు జరపొచ్చు. 


మరో ఆసక్తికర కథనం: మీ దగ్గర ₹2000 నోట్లు ఇంకా ఉన్నాయా?, ఆర్‌బీఐ లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇచ్చింది


Join Us on Telegram: https://t.me/abpdesamofficial