2000 RS Notes: ఇప్పటి వరకు 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయని, లేదా వాటిని బ్యాంక్/రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తిరిగి ఇవ్వని వారిలో మీరు కూడా ఉన్నారా?. అయితే మీ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో అప్‌డేట్ రిలీజ్ చేసింది. బీమా చేసిన పోస్టల్ సర్వీస్, TLR ఆప్షన్ల ద్వారా పింక్ నోట్లను బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేసుకోవచ్చని చెప్పింది.
రూ.2000 నోట్లను బ్యాంక్ అకౌంట్‌లో వేయడానికి 2 సులభమైన దారులు
1) ప్రజలు తమ దగ్గరున్న రూ.2000 నోట్లను పోస్ట్ ద్వారా ఆర్‌బీఐ రీజనల్ ఆఫీస్‌కు పంపి, వాటిని తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చు. రూ.2,000 నోట్లను బ్యాంకు ఖాతాల్లో నేరుగా క్రెడిట్ చేయడానికి, బీమా చేసిన పోస్టల్ సర్వీస్ (insured postal services) ద్వారా రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయానికి పంపొచ్చు. ఇది అత్యంత సౌకర్యవంతమైన, సురక్షితమైన పద్ధతి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఈ రీజనల్ ఆఫీసులకు దూరంగా నివసించే వారికి ఇన్సూర్డ్ పోస్టల్ సర్వీస్ ఒక ఈజీ ఆప్షన్. ఇన్సూర్ చేసిన పోస్ట్ ద్వారా పంపే కవర్‌లో రూ.2 వేల నోట్లతో పాటు, బ్యాంక్ ఖాతా వివరాలున్న ఫారాన్ని కూడా ఉంచాలి. ఈ ఫారాన్ని ఆర్‌బీఐ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనివల్ల, ఆర్‌బీఐ ఆఫీస్‌కు వెళ్లాల్సిన పని ఉండదు, ఆఫీస్ బయట క్యూలో నిలబడాల్సిన అవసరం అసలే ఉండదు.
2) ప్రజల, బ్యాంకు ఖాతాల్లో రూ. 2,000 నోట్లను జమ చేసేందుకు TLR (Triple Lock Receptacle) ఫామ్‌ను కూడా RBI అందుబాటులోకి తెచ్చింది. ఒకవేళ మీరు RBI రీజనల్ ఆఫీస్‌కు వెళ్లినా, అక్కడ క్యూలో నిలబడాల్సిన పనిని TLR ఫామ్ తప్పిస్తుంది. టీఎల్‌ఆర్ ఫామ్‌ను ఆర్‌బీఐ ఆఫీస్ ఇస్తారు. మీరు డిపాజిట్ చేయాలనుకున్న రూ.2 వేల నోట్ల సంఖ్య, బ్యాంకు ఖాతా వివరాలను టీఎల్‌ఆర్ ఫామ్‌లో నింపి, దానిని అక్కడే ఉన్న డిపాజిట్ బాక్సులో వేయాలి. RBI సిబ్బంది ఆ నోట్లను సంబంధింత వ్యక్తుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు.
TLR, బీమా చేసిన పోస్టల్ సర్వీస్ ఆప్షన్లు రెండూ రెండూ అత్యంత సురక్షితమైనవని, ప్రజలు ఎలాంటి అనుమానం లేకుండా వాటిని ఉపయోగించుకోవచ్చని ఆర్‌బీఐ రీజనల్ డైరెక్టర్ రోహిత్ పి.దాస్ చెప్పారు.
పై రెండు ఆప్షన్లే కాకుండా, మీరు నేరుగా RBI రీజనల్ ఆఫీస్‌కు వెళ్లి, అక్కడ క్యూలో నిలబడి, రూ.20,000 వరకు విలువైన రూ.2000 నోట్లను స్వయంగా మార్చుకునే ఫెసిలిటీ కూడా ఉంది.
మే 19న రూ.2000 నోట్ల ఉపసంహరణ
2023 మే 19న, రూ. 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఆ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం/ఇతర విలువల నోట్లతో మార్చుకునే వెసులుబాటును ప్రజలకు కల్పించింది. పింక్ నోట్లను మార్చుకోవడానికి లేదా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి తొలుత సెప్టెంబర్ 30 వరకు గడువు సమయం ఇచ్చింది. తర్వాత ఆ గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది. బ్యాంకు శాఖల్లో 2000 రూపాయల నోట్ల డిపాజిట్/మార్పిడి సౌకర్యాలు రెండూ అక్టోబర్ 7తో క్లోజ్ అయ్యాయి.
ఇప్పటి వరకు, రూ.2000 నోట్లలో 97 శాతం తిరిగి వచ్చాయని, ఇంకా రూ.10 వేల కోట్ల రూపాయల విలువైన రూ.2 వేల నోట్లు మాత్రమే ప్రజల దగ్గర మిగిలి ఉన్నాయని రీసెంట్ అప్‌డేట్‌లో ఆర్‌బీఐ తెలిపింది.
మరో ఆసక్తికర కథనం: మళ్లీ పెరుగుతున్న పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial