Israel Palestine Attack:
ఇజ్రాయేల్ వల్లే ఇంత విధ్వంసం..
ఇజ్రాయేల్ వల్లే ఇంత విధ్వంసం (Israel Gaza Attack Live) సృష్టించాల్సి వస్తోందని, ఈ యుద్ధానికి కారణం ఆ దేశమే అని తేల్చి చెప్పింది పాలస్తీనా. పాలస్తీనా పౌరులకు గుర్తింపు లేకుండా చేయడంతో పాటు వాళ్ల హక్కుల్ని అణిచివేసినందుకే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందని స్పష్టం చేసింది. రాజకీయంగా కూడా తమను తొక్కేయాలని ఇజ్రాయేల్ కుట్ర చేసిందని, ఈ విషయమై తాము ఎన్నో సార్లు హెచ్చరించినా పట్టించుకోలేదని పాలస్తీనా ప్రకటించింది. ఆత్మాభిమానాన్ని కాపాడుకోడానికే ఇలా తెగించాల్సి వస్తోందని (Israel Gaza Attack) వివరణ ఇచ్చింది. అధికారికంగా ట్విటర్‌లో ఓ నోట్ కూడా విడుదల చేసింది. ఇజ్రాయేల్ పాలస్తీనా ఆక్రమణను ఆపాక కానీ...రెండు దేశాల మధ్య ప్రశాంత వాతావరణం నెలకొనే అవకాశమే లేదని స్పష్టం చేసింది. ప్రజల హక్కుల్ని లాక్కునే ప్రయత్నం చేస్తే ఇలాంటివి తప్పవని ప్రకటించింది.
"మమ్మల్ని రాజకీయంగా ఎదగకుండా అడ్డుకున్నారు. పాలస్తీనా ప్రజల హక్కుల్ని అణిచివేశారు. వాళ్లకు సొంత దేశమంటూ లేకుండా చేశారు. వీటన్నింటికీ తీవ్ర పరిణామాలు తప్పవని మేం ఎప్పటి నుంచే ఇజ్రాయేల్‌కి వార్నింగ్ ఇస్తూనే ఉన్నాం. దాడులు తప్పవనీ హెచ్చరించాం. కానీ ఇజ్రాయేల్ లెక్క చేయలేదు. పాలస్తీనా ఆక్రమణ ఆగనంత వరకూ ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. ఆక్రమణ ఆపేస్తేనే శాంతియుత వాతావరణం నెలకొంటుంది. పాలస్తీనా ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఇది తప్పదు"
- పాలస్తీనా
దేశంలో చొరబడిన హమాస్ మిలిటెంట్లను ఏరివేస్తామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఆ తర్వాత హమాస్ స్థావరాలపై ఎదురు దాడి చేస్తామని హెచ్చరించింది. చొరబాటుదారుల ఏరివేత ఆపరేషన్‌ను ఐడీఎఫ్ తీవ్రతరం చేసింది. సరిహద్దుల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో సైన్యాన్ని మోహరించింది. భారీ సంఖ్యలో చొరబాటుదారులను అదుపులోకి తీసుకుంది. మరికొందర్ని హతమార్చింది. మిలిటెంట్లు 14 ప్రాంతాల్లోకి ప్రవేశించారని, 22 చోట్ల పోరాటం కొనసాగుతోందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
Also Read: Afghanistan: అఫ్ఘాన్ భూకంపం: 1000 మంది మృతి, 12 గ్రామాలు నేలమట్టం