అఫ్ఘానిస్థాన్‌లో శనివారం మధ్యాహ్నం వరుసగా మూడు సార్లూ భారీ భూకంపాలు సంభవించి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కేవలం 30 నిమిషాల వ్యవధిలో మూడు భారీ భూకంపాలు వచ్చాయి. దేశంలోని పశ్చిమ ప్రాంతంలో ఈ భూకంపాలు సంభవించాయి. హెరాత్‌ ప్రాంతంలో 6.3 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం వల్ల   దాదాపు 1000  మంది  మరణించారని, వందలాది మంది గాయపడ్డారని  అక్కడి  అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జిందా జాన్‌, ఘోర్యాన్‌ జిల్లాల్లో భూకంపం కారణంగా 12 గ్రామాలు దాదాపుగా నేలమట్టమయ్యాయి. ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. సహాయక సిబ్బంది ప్రజలను శిథిలాల నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. జిందా జాన్‌ జిల్లాలోని మూడు గ్రామాల్లో కనీసం పదిహేను మంది మరణించారని, దాదాపు నలభై మంది గాయపడ్డారని నిన్న అక్కడి విపత్తు నిర్వహణ మంత్రి తెలిపారు. కాగా మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.


ఫరా, బద్గీస్‌ ప్రావిన్స్‌లలోని కొన్ని ఇళ్లు కూడా పాక్షికంగా ధ్వంసమైనట్లు మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. అమెరికా జియోలాజికల్‌ సర్వే ప్రకారం పశ్చిమ అఫ్ఘానిస్థాన్‌లో నిన్న ఆరు భూకంపాలు సంభవించాయి. అయితే అందులో అతి పెద్దది 6.3 తీవ్రతతో సంభవించింది. మొదటి భూకంపం నిన్న 12.11pm సమయంలో సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత నమోదు చేసింది. ఆ తర్వాత 12.19pm సమయానికి మరోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత 5.6 గా నమోదైంది. 12.42pm సమయంలో 6.౩ తీవ్రతతో మరో భారీ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. 


హెరాత్ నగరానికి వాయువ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో భూకంప ప్రధాన కేంద్రాన్ని గుర్తించారు.  వరుసగా మూడుసార్లు భూమి కంపించడంతో ఆ దేశం వణికిపోయింది. ముఖ్యంగా హెరాత్ పట్టణ పరిసరాలు, గ్రామీణ ప్రాంతాల్లో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. దాంతో  భారీగా ప్రాణ, ఆస్థి నష్టం సంభవించాయి. అమెరికా జియోలాజికల్‌ సర్వే ప్రకారం భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు అంచనా వేస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


అఫ్ఘాన్‌లోని భూకంపం కారణంగా భారత్‌లోని దిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. అలాగే నేపాల్‌ పశ్చిమ ప్రాంతంలోని బఘంగ్‌లోనూ శనివారం మధ్యాహ్న సమయంలో వెంట వెంటనే రెండు సార్లు భూమి కంపించింది. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.


అప్ఘానిస్థాన్ తరచూ భూకంపాలకు గురవుతుంది. హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో, ఇది యురేషియన్ భారతీయ టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ సమీపంలో ఉంటుంది. గత సంవత్సరం జూన్ లో అఫ్ఘానిస్థాన్ లోని పక్తికా రాష్ట్రంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో ఏకంగా వెయ్యి మందికిపైగా ప్రజలు మృతిచెందారు. 10 వేలకు పైగా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.