Israel Palestine Attack:
ఫొటో జర్నలిస్ట్‌లపై ఫైర్..
Gaza News: పాలస్తీనా జర్నలిస్ట్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇజ్రాయేల్ డిమాండ్ చేస్తోంది. హమాస్ ఉగ్రవాదుల దాడుల్ని కవర్ చేసేందుకు వెళ్లిన ఫొటో జర్నలిస్ట్‌లను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇందుకు ఓ కారణముంది. హమాస్ ఉగ్రవాదులు దాడులు మొదలు పెట్టిన వెంటనే గాజాలోని పాలస్తీనా జర్నలిస్ట్‌లు (Gaza Journalists) వెంటనే ఫొటోలు తీసి పబ్లిష్ చేశారు. దీనిపైనే ఇజ్రాయేల్ అనుమానం వ్యక్తం చేస్తోంది. హమాస్ ఉగ్రవాదుల దాడుల గురించి ఆ జర్నలిస్ట్‌లకు ముందే తెలుసని, అందుకే సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చి వాటిని కవర్ చేశారని ఆరోపిస్తోంది ఇజ్రాయేల్.
"అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయేల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడులు చేశారు. ఆ సమయంలో ఫొటో జర్నలిస్ట్‌లు అక్కడే ఉండి అంతా రిపోర్ట్ చేశారు. సరిగ్గా అదే సమయానికి దాడులు జరుగుతాయని వాళ్లకి ఎలా తెలిసింది..? అంతర్జాతీయ మీడియాతో కలిసి రిపోర్ట్ చేశారు. కచ్చితంగా ఈ దాడుల గురించి ముందే తెలిసి ఉంటుంది. అలాంటి మారణకాండను దగ్గరుండి మరీ కవర్ చేశారు. వృత్తిపరమైన విలువలను వదిలేశారు"
- ఇజ్రాయేల్ ప్రభుత్వం
ఆరుగురిపై నిఘా..
ఆ ఫొటో జర్నలిస్ట్‌లు పని చేస్తున్న మీడియా సంస్థలకు (Gaza Attack) ఇప్పటికే ఇజ్రాయేల్ ప్రభుత్వం నోటీసులు పంపింది. దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. మొత్తం ఆరుగురు జర్నలిస్ట్‌ల గురించి రిపోర్ట్ చేసింది. వీళ్లలో ముగ్గురు Reuters మీడియాలో పని చేస్తున్నారు. అయితే..ఈ ఆరోపణలపై Reuters స్పందించింది. హమాస్ దాడుల గురించి తమకు ముందస్తు సమాచారం ఏమీ లేదని తేల్చి చెప్పింది. హమాస్ దాడులు జరిగిన రెండున్నర గంటల తరవాతే వాళ్లు అక్కడికి వెళ్లి ఫొటోలు తీశారని క్లారిటీ ఇచ్చింది.
రిపోర్టర్ ఆవేదన..
ఇజ్రాయేల్, హమాస్ యుద్ధం (Israel Hamas War) రోజురోజుకీ తీవ్రమవుతోంది. గాజా వద్ద వేలాది మంది పౌరులు భయం భయంగా గడుపుతున్నారు. రెండు వైపులా ఎదురవుతున్న దాడుల్ని తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే వందలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ యుద్ధ వాతావరణంలో ఉండలేక కొంత మంది వేరే చోటుకి వలస పోతున్నారు. అయితే...ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తున్న మీడియా ప్రతినిధులూ ప్రాణాల్ని పణంగా పెట్టాల్సి వస్తోంది. ఇటీవలే ఓ మీడియా సంస్థకి చెందిన రిపోర్టర్ కుటుంబ సభ్యులు ఇజ్రాయేల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. జర్నలిస్ట్‌లకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయింది. పాలస్తీనా రిపోర్టర్ (Palestine Reporter) ఒకరు అక్కడి హాస్పిటల్ నుంచి రిపోర్ట్ చేస్తూ జర్నలిస్ట్‌లు ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో చెప్పాడు. ఇది విని లైవ్‌లోనే న్యూస్ ప్రెజంటర్ కన్నీళ్లు పెట్టుకుంది. "మేం ఏ క్షణమైనా చనిపోవచ్చు" అని ఆవేదన వ్యక్తం చేశాడు ఆ రిపోర్టర్. ఈ మాటల్ని తట్టుకోలేక మహిళా యాంకర్ భావోద్వేగానికి గురైంది. ఈ మధ్యే జరిగిన దాడిలో ఇదే ఛానల్‌కి చెందిన ఇద్దరు రిపోర్టర్‌లు మృతి చెందారు. తన తోటి జర్నలిస్ట్‌ల్లాగే తానూ ఎప్పుడో అప్పుడు చనిపోతానని చెప్పాడు ఆ రిపోర్టర్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: నితీశ్ వ్యాఖ్యలపై అమెరికన్ సింగర్ ఆగ్రహం,అందుకే మోదీ బెస్ట్ లీడర్ అంటూ ప్రశంసలు