Iran Hijab Protest:
ఏడాదిగా హిజాబ్ వివాదం..
ఇరాన్‌లో హిజాబ్ వివాదం ఇంకా సమసిపోలేదు. ఎక్కడో ఓ చోట హిజాబ్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. వేలాది మందిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అయినా ఉద్యమం ఆగడం లేదు. ఇటీవలే ఓ 16 ఏళ్ల అమ్మాయిపై దారుణమైన దాడి జరిగింది. హిజాబ్‌ని వ్యతిరేకిస్తున్నందుకు మెట్రోలనే ఆమెపై దాడి చేశారు. ప్రస్తుతం ఆమె కోమాలో ఉంది. భారీ భద్రత మధ్య ఆమెకి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇది కూడా మొరాలిటీ పోలీసుల పనే అని అక్కడి ఉద్యమ సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. బాధితురాలి పేరు అర్మిత గరవంద్. మెట్రోలో ప్రయాణిస్తుండగా మహిళా పోలీసులతో వాగ్వాదం జరిగింది. హిజాబ్ ధరించాలని పోలీసులు పట్టుబట్టినట్టు సమాచారం. అందుకు అర్మిత అంగీకరించలేదు. ఈ క్రమంలోనే పోలీసులు ఆమెపై దాడి చేసినట్టు తెలుస్తోంది. కానీ...పోలీసులు మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టి పారేస్తున్నారు. ఆమె లో బీపీ కారణంగా కళ్లు తిరిగి పడిపోయిందని, ఇందులో తమ జోక్యం ఏమీ లేదని తేల్చి చెబుతున్నారు. దాదాపు ఏడాదిగా ఇరాన్‌లో ఇవే గొడవలు జరుగుతున్నాయి. హిజాబ్ ఉద్యమం మొదలైనప్పుడు మహసా అమినీ (Mahsa Amini) అనే ఓ 19 ఏళ్ల యువతిని మొరాలిటీ పోలీసులు (Morality Police)అదుపులోకి తీసుకున్నారు. ఆమె కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయింది. అప్పుడే ఈ నిప్పు రాజుకుంది. పోలీసులే హింసించి చంపేశారని దేశవ్యాప్తంగా పలు చోట్ల మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. అప్పటి నుంచి వేలాది మందిని అరెస్ట్ చేసి జైళ్లలో పెడుతున్నారు.
మెట్రోలో దాడి..
అర్మిత మెట్రోలో ప్రయాణిస్తుండగా దాడి జరిగింది. ఆమెకి తీవ్ర గాయాలయ్యాయి. ఓ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఆమెని చూసేందుకు కుటుంబ సభ్యులతో సహా ఎవరినీ లోపలికి అనుమతించడం లేదని స్థానిక మీడియా తెలిపింది. హాస్పిటల్ ఎదుట ఆమె ఫొటోలు, బ్యానర్‌లు పట్టుకుని పలు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ దాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న వారిలో ఇప్పటివరకు 400 మందికి జైలు శిక్ష విధించినట్లు తెహ్రాన్ ప్రావిన్స్ జ్యుడిషియరి చీఫ్ అలీ అల్ఘసి-మెహర్ తెలిపారు. ఇందులో 160 మందికి ఐదు నుంచి పది సంవత్సరాల జైలు శిక్ష, 80 మందికి రెండు నుంచి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, 160 మందికి రెండేళ్లలోపు జైలు శిక్ష విధించినట్టు తెలుస్తోంది. మొత్తం జైలు శిక్షలు విధించిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుంది. గతేడాది సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ ఆందోళనల కారణంగా దాదాపు 14000 మందికి పైగా జైలు శిక్ష అనుభవిస్తున్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం తెలిపింది. ఇప్పటివరకు ఇద్దరికి మరణ శిక్ష అమలు చేశారు. మరో 9 మంది మరణ శిక్షను ఎదుర్కొంటున్నారని అనడోలు అనే సంస్థ పేర్కొంది. ఇప్పటికీ అక్కడ నిరసనలు కొనసాగుతూనే ఉన్నా...ప్రభుత్వం మాత్రం వాళ్లను అణిచివేస్తూనే ఉంది. వందలాది మందిని జైళ్లకు పంపుతోంది. చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని సమర్థించుకుంటోంది.
Also Read: ప్రైవేట్‌గా మాట్లాడుకుని పరిష్కరించుకుందాం, భారత్‌కి కెనడా రిక్వెస్ట్