Kailash Mansarovar Yatra: ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్ 2025 జరుగుతుండగా, భక్తులకు మరో శుభవార్త చెప్పింది కేంద్రం. కైలాష్ మానస సరోవర్ యాత్ర పునః ప్రారంభం కానుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం (జనవరి 27, 2025) ఈ గుడ్‌న్యూస్‌ను వెల్లడించింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ జనవరి 26-27 తేదీల్లో చైనాతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. బీజింగ్‌లో జరిగిన విదేశాంగ కార్యదర్శులు సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు విదేశాంగ శాఖ పేర్కొంది. అందులో భాగంగానే కైలాష్ మానసరోవర్ యాత్రను పునఃప్రారంభించాలని ఇరు వర్గాలు నిర్ణయించినట్టు తెలిపింది.
ఈ యాత్రను 2020లో నిలిపేశారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్య జరిగిన చర్చల్లో దీన్ని పునఃప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చారు. 2025 వేసవిలో కైలాస మానస సరోవర్ యాత్రను పునఃప్రారంభించాలని పరస్పరం అంగీకరించారు. ప్రస్తుత ఒప్పందాలకు అనుగుణంగా విధివిధానాలను సంబంధిత యంత్రాంగాలు చర్చిస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. మిగతా ప్రక్రియ కోసం భారత్-చైనా నిపుణులు సమావేశం కానున్నారు. ఈ తేదీని త్వరలోనే ఖరారు చేయనున్నారు.
దీంతోపోటు ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను కూడా పునః ప్రారంభించనున్నారు. అందుకు ఇరుపక్షాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. "రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను పునఃప్రారంభించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇరువైపుల సంబంధిత అధికారులు త్వరలో సమావేశమై దీని కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌పై చర్చలు జరుపుతారు" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
విక్రమ్ మిస్రీ రెండు రోజుల చైనా పర్యటన
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ భారత్-చైనాల మధ్య సంబంధాల కోసం రెండు రోజులుగా పర్యటిస్తున్నారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, బీజింగ్‌లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో భేటీ అయ్యారు. చైనా-భారత్ సంబంధాలు మెరుగుపరిచే ప్రక్రియ వేగవంతం చేసేందుకు అంగీకరించారు. గతేడాది జాన్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైనప్పటి నుంచి అన్ని స్థాయిల్లో సానుకూల చర్చలు జరిగాయని తెలిపారు. సమావేశం అనంతరం చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి మాట్లాడుతూ.. 'ఇరుదేశాల నేతల మధ్య కుదిరిన ముఖ్యమైన అంశాలను ఇరుపక్షాలు చిత్తశుద్ధితో అమలు చేస్తాయి.' అని అన్నారు.
Also Read: ఆ పిల్లలే నిజాయితీపరులు, స్నేహపూర్వకంగా ఉండే వాళ్లు- కెనడియన్ విశ్వవిద్యాలయాల సంచలన సర్వే