Imran khan Arrest:


కోర్టులో ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారు: సుప్రీంకోర్టు 


పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌పై ఆ దేశ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా అక్రమేనని తేల్చి చెప్పారు. ఇస్లామాబాద్ హైకోర్టులో ఉండగానే ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయడం న్యాయవ్యవస్థకే మచ్చ తెచ్చిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో భయానక వాతావరణం సృష్టించారంటూ మండి పడ్డారు. కోర్టులో ఉన్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు చీఫ్ జస్టిస్. ఎవరినైనా సరే కోర్టులో అరెస్ట్ చేయడం అక్రమం అని తేల్చి చెప్పింది. గంటలోగా ఇమ్రాన్‌ ఖాన్‌ను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ఇమ్రాన్‌ ఖాన్ కోర్టుకి వచ్చే సమయంలో రాజకీయ నేతలు కానీ, కార్యకర్తలు కానీ కోర్టులోకి రావద్దని హెచ్చరించారు చీఫ్ జస్టిస్. 


"ఓ వ్యక్తి కోర్టులో హాజరయ్యారంటేనే చట్ట పరంగా అన్ని నిబంధనలు పాటిస్తున్నట్టు లెక్క. అలాంటి వ్యక్తిని కోర్టులోనే అరెస్ట్ చేయడంలో అర్థమేంటి..? భవిష్యత్‌లో ఇంకెవరైనా సరే కోర్టుకి రావాలన్నా భయపడతారు. అక్కడా భద్రతా లేదని భావిస్తారు. అరెస్ట్ చేసే ముందు పోలీసులు రిజిస్ట్రార్ అనుమతి తీసుకోవాలి"


- చీఫ్ జస్టిస్, పాకిస్థాన్ సుప్రీంకోర్టు 






ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కేసుపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. National Accountability Bureau (NAB) ఎన్నో ఏళ్లుగా ఇలానే వ్యవహరిస్తోందని ఓ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులను ఇష్టమొచ్చినట్టు అరెస్ట్‌లు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. 


వెయ్యి మంది అరెస్ట్..


పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసినప్పటి నుంచి ఆ దేశం అట్టుడుకుతోంది. తోషాఖానా కేసులోనూ కోర్టు ఇమ్రాన్‌ను దోషిగా తేల్చింది. ఇప్పటికే అల్‌ఖదీర్ ట్రస్ట్ కేసులో దోషిగా తేల్చారు. ఇమ్రాన్ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. సైన్యం వారిని నిలువరించలేకపోతోంది. ఆర్మీకి, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. పోలీసులు కూడా రంగంలోకి దిగి పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ అల్లర్లలో 130 మందికి పైగా పోలీసులు గాయపడినట్టు తెలుస్తోంది. పంజాబ్ ప్రావిన్స్‌లో భారీ సైన్యాన్ని మొహరించింది ప్రభుత్వం. ఇమ్రాన్ ఖాన్‌ను కస్టడీలోకి తీసుకున్నప్పటి నుంచి ఆయనను తీవ్రంగా వేధిస్తున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఆయనను రాత్రంతా టార్చర్ చేశారని, నిద్ర కూడా పోనివ్వలేదని ఓ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. ఈ కామెంట్స్ తరవాత ఇమ్రాన్ సపోర్టర్స్ మరింత రెచ్చిపోయారు. బిల్డింగ్స్‌ని ధ్వంసం చేస్తున్నారు. పోలీసుల వాహనాలకు నిప్పు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లో నిరసనకారులు రెచ్చిపోవడంతో పోలీసులూ అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. దాదాపు వెయ్యి మందిని అరెస్ట్ చేశారు. పోలీస్ అధికారులు ఈ అరెస్ట్‌లను ధ్రువీకరించారు. 


Also Read: Microsoft: ఈ సారి శాలరీ హైక్‌లు కష్టమే, బోనస్‌ బడ్జెట్‌ కూడా కట్ - బ్యాడ్ న్యూస్ చెప్పిన మైక్రోసాఫ్ట్!