International Day of Happiness : స్టోయిసిజం అనేది ప్రాచీన గ్రీస్‌లో ప్రారంభమైన ఒక ఫిలాసఫీ. నేటికీ ఈ ఫిలాసఫీకి ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇది నైతికంగా, ఆనందంగా బతకటమే అంతిమ లక్ష్యంగా కలిగి ఉన్న జీవన విధానం. 


స్టోయిసిజాన్ని ఫాలో అవుతున్న వారిని స్టోయిక్స్ అంటారు. సాధారణంగా ఈ ఫిలాసఫీ ఎంతో కఠినమైనదని చాలామంది భావిస్తారు కానీ స్టోయిక్స్ మాత్రం ఇది ఒక విముక్తి, సంతోషకరమైన జీవనవిధానం అని చెప్తారు.


స్టోయిక్స్ గొప్ప గుణం వారి నైతికత . ప్రాచీన తత్వశాస్త్రంలోని ఇతరుల మాదిరిగానే, స్టోయిక్స్ కూడా నీతిశాస్త్రం లక్ష్యం "యుడైమోనియా" అని భావిస్తారు. ఈ గ్రీకు పదానికి అర్థం 'ఆనందం'. అయితే, 'యుడైమోనియా' కేవలం ఆహ్లాదకరమైన మానసిక స్థితిని మాత్రమే వివరించదు. దానికి మరింత బలమైన భావన ఉంది. యుడైమోనియాను "మానవ అభివృద్ధి" గా అనువదించవచ్చు. ఒక మనిషి జీవితంలో ఉన్నతిని ఆనందం, గౌరవం ఎలా ఉంది అని చెప్పటానికి ఈ మాటను స్టోయిక్స్ ఉపయోగిస్తారు.


సంతోషంగా ఉండటం అంటే ఏమిటి? బయటి పరిస్థితులు మనకు ఆనందాన్ని ఇస్తాయా? లేదా మన మానసిక స్థితి, మనం ఈ పరిస్థితులను గ్రహించే విధానం బట్టి మన ఆనందం ఉంటుందా? ఇవి ఎపిక్టెటస్ అడిగిన ప్రశ్నలు. లైఫ్ లో ఎలాంటి సందేహాలూ లేకుండా జీవించిన అత్యంత ముఖ్యమైన స్టోయిక్ ఫిలాసఫర్స్ లో ఒకరు. ఇతని ఫిలాసఫీ "మనం నిజంగా సంతోషంగా ఉండటం ఎలా ?" అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి దోహదపడింది.


మన కంట్రోల్ లో ఉన్న విషయాలేవి? (Dichotomy of control)


ఎపిక్టెటస్, తన సమయంలో ఇతర స్టోయిక్స్ కంటే ఎక్కువగా, స్టోయిక్ "డైకాటమీ ఆఫ్ కంట్రోల్" సిద్ధాంతానికి చాలా ప్రాముఖ్యతనిచ్చాడు . ఎపిక్టెటస్, మనుషుల చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే వారి కంట్రోల్ లో ఏ విషయాలు ఉన్నాయి, ఏవి లేవు అనేది ముందు తెలుసుకోవటం.


"డైకాటమీ ఆఫ్ కంట్రోల్" అంటే ఏమిటి?

మన కంట్రోల్ లో ఉన్న విషయాలు.. అంటే మన అభిప్రాయం, లక్ష్యాలు, కోరికలు, ప్రతిచర్యలు, విరక్తి, మన సొంత వ్యవహారాలు. మన కంట్రోల్ లో లేని విషయాలు ఏమిటంటే.. బయటి పరిస్థితులు, మన రూపం, ఆస్తి, మన పట్ల ఇతరుల ప్రవర్తన, అవతలి వారు మన గురించి ఏమనుకుంటున్నారో అనే విషయాలను మనం నియంత్రించలేము. సంతోషంగా ఉండటానికి, మన నియంత్రణలో ఉన్న విషయాలపై మాత్రమే దృష్టి పెట్టాలి. మిగిలిన విషయాలు ఎలాగూ మనం చేసేదేమీ లేదు కనుక వదిలేయాలి.


మనుషులు తమ నియంత్రణలో ఉన్నవాటిని అర్థం చేసుకున్న తర్వాత, వారు ప్రపంచంలో జరిగే వివిధ ఘటనలకు, పరిస్థితులకు అనుకూలంగా లొంగిపోగలుగుతారు. కంట్రోల్ ఉన్నవాటిపైన మాత్రమే ఫోకస్ చేయగలుగుతారు. కంట్రోల్ లో లేని వాటికి డిస్టర్బ్ అయిపోవటమో, పట్టించుకోకుండా వదిలేయటమో మనకు ఈ రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఆ రెండోది ఎంచుకోమని స్టోయిక్ ఫిలాసఫీ చెప్తోంది.


మనకు ఇష్టంలేని ఘటనలను వదిలించుకోవటం అసాధ్యం. స్టోయిసిజం చెప్పేది అది కాదు. అలాంటి పరిస్థితులు వచ్చినపుడు ఇది మన నియంత్రణలో లేదు కాబట్టి దీన్ని అంగీకరించాల్సిందే అనే ఆలోచనా విధానాన్ని అలవరుచుకోవటం.