Animal Assistance: ఏదైనా నేరం జరిగినా, దొంగతనం, హత్యల్లాంటివి జరిగినా పోలీసులు, వారితో పాటు జాగిలాలు కూడా క్రైమ్ సీన్ లోకి ఎంట్రీ ఇస్తాయి. నేరస్థులను పట్టుకోవడంలో అవి చేసే సేవ అంతా ఇంతా కాదు. చాలా సార్లు నేరస్థులను పట్టుకుని అప్పగిస్తుంటాయి. ఏ క్లూ దొరకని చోట కూడా శునకాలు ఆధారాలు కనిపెట్టిన సందర్భాలు చాలానే ఉంటాయి. అయితే పోలీసులకు కేవలం కుక్కలు మాత్రమే సాయం చేస్తాయి, పోలీసులు మిగతా జంతువుల సాయం తీసుకోరు అనుకుంటే పొరబడినట్లే. పలు సందర్భాల్లో జంతువులు చేసే సాయం వల్ల నేరస్థులను పట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ సందర్భాలేమిటో ఓ లుక్కేద్దామా..
కిడ్నాపైన బాలికను గుర్తించిన 3 సింహాలు
ఇథియోపియాలో మూడు సింహాలు 12 ఏళ్ల బాలిక ప్రాణాను కాపాడాయి. ఏడుగురు వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేసి ఓ చోట దాచారు. వారిని చూసి భయపడ్డ ఆ పాప గట్టిగా ఏడ్చింది. ఆ ఏడుపు విన్న పక్కనే అడవిలో ఉన్న సింహాలు ఆ ఇంటి వద్దకు వచ్చి కాపు కాశాయి. వాటికి ఏదైన వేట దొరుకుతుందని ఎదురుచూడగా.. సింహాలు బయట ఉండటంతో లోపల ఉన్న కిడ్నాపర్లు ఏమీ చేయలేక అక్కడే ఉండిపోయారు. ఇంతలో పోలీసులు సింహాలను అక్కడ గుర్తించి, ఏదో తేడా కొడుతోందని భావించారు. చివరికి కిడ్నాపర్లను పట్టుకుని బాలికను రక్షించారు.
హంతకుడిని పట్టించిన చిలుక
ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసులకు ఏ ఆధారాలు దొరకలేదు. ఆ ఇంట్లో మృతుడు పెంచుకున్న చిలుక ఉంది. ఓ రోజు విచారణలో భాగంగా పోలీసులు ఇంటికి వచ్చారు. అదే సమయంలో మృతుడి మేనల్లుడు ఇంటికి రావడంతో ఆ చిలుక గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఉన్నట్టుండి ఇది ఇలా ఎందుకు అరుస్తుందని పోలీసులకు అనుమానం వచ్చింది. అప్పుడే మేనల్లుడు రావడాన్ని గుర్తించిన పోలీసులు అతడిని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటకొచ్చింది.
నేరగాళ్లను పట్టించిన కాకాటూ పక్షి
కాకాటూ అనే పక్షిని ఓ వ్యక్తి పెంచుకుంటున్నాడు. ఒక రోజు నిందితులు అతడి ఇంట్లోకి ప్రవేశించి తనను దారుణంగా హత్య చేశారు. అప్పుడు ఆ పక్షి జటాయువులా ఆ హంతకులపై పోరాడింది. వారిని ఇష్టమొచ్చినట్లుగా పొడిచింది. ఆ హంతకులు దానిని పట్టుకుని చంపేశారు. అయితే పోలీసులు వచ్చే సరికి ఆ పక్షి చనిపోయి ఉంది. కానీ దాని ముక్కుపై ఉన్న రక్త నమూనాలు సేకరించి నేరస్థులను పట్టుకున్నారు.
డాల్ఫిన్లు తెలివైనవే కాదు దొంగలను కూడా పట్టిస్తాయి
ఓ రోజు ముగ్గురు వ్యక్తులు ఓ ఇంట్లో దొంగతనం చేశారు. పరుగెత్తుకుంటూ వచ్చి ఓ పడవ ఎక్కారు. వీరిని గమనించిన డాల్ఫిన్ వారు ఎక్కిన పడవ ముందుకు కదలకుండా అడ్డుకుంది. పోలీసులు వచ్చే వరకు వారు ఎక్కిన పడవను కొద్దిగా కూడా ముందుకు వెళ్లనివ్వలేదు. అంతలోనే పోలీసులు వచ్చి దొంగలను పట్టుకున్నారు.
Also Read: Manipur Violence: మణిపూర్‌లో కొనసాగుతున్న హింస, పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు, తుపాకీ మోతలు
పిల్లను కాపాడుకున్న తల్లి గూస్
గూస్ అంటే బాతు లాంటి ఓ జీవి. ఒక రోజు తన పిల్ల గూస్ ఓ బెలూన్ స్ట్రింగ్ లో చిక్కుకుంది. తల్లి ఎంత ప్రయత్నించినా కాపాడుకోలేకపోయింది. వెంటనే సిన్సినాటి పోలీసు ఆఫీసర్ గివెన్స్ వద్దకు వెళ్లింది. అదేదో చెప్పడానికి ప్రయత్నించినా ఆ పోలీసుకు ఏదీ అర్థం కాలేదు. చివరికి అది ముందు వెళ్తుంటే దాని వెంటే వెళ్లాడు. అది వెళ్తూ వెళ్తూ ఒక ప్రాంతంలో ఆగింది. అక్కడ పిల్ల గూస్ బెలూన్ స్ట్రింగ్ లో చిక్కుకుని కనిపించింది. అది గమనించిన పోలీసు అధికారి ఈ పిల్ల గూస్ ను కాపాడాడు. ఆ తల్లి గూస్ ప్రేమకు మైమరిచిపోయాడు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial