Manipur Violence: మణిపూర్ రాష్ట్రంలో పరిస్థితిలో మార్పు రావడం లేదు. రాష్ట్రంలోని పలు చోట్ల మరోసారి హింస చెలరేగింది. అర్ధరాత్రి వేళ బాంబు పేలుళ్లు, తుపాకుల మోత పరిస్థితి తీవ్రతను తెలియజెబుతోంది. హింస చెలరేగిన ప్రాంతాల్లో బలగాలు మోహరిస్తే పరిస్థితి అదుపులోకి వస్తోంది. కానీ రాష్ట్రంలోని వేరే చోట్ల మళ్లీ హింస చెలరేగుతోంది. తాజాగా బుధవారం అర్ధరాత్రి మణిపూర్ లోని వివిధ జిల్లాల్లో పేలుళ్లు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో తుపాకుల మోత మోగింది. బిష్ణుపూర్ జిల్లాలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(IED)తో పేలుడు సంభవించింది. ఆగి ఉన్న వాహనంలో బాంబు అమర్చినట్లు అధికారులు తెలిపారు. కాంగ్ పోక్సి జిల్లాలో నిన్న సాయంత్రం కాల్పులు జరిగాయి. భద్రతా బలగాల రంగప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే అర్ధరాత్రి 2-3 గంటల మధ్యలో మరోసారి కాల్పులు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. 


ఉరంగ్ పట్ సమీపంలోని ఇంఫాల్ తూర్పు జిల్లాలో మరో కాల్పుల ఘనట నమోదైంది. అక్కడ చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపినట్లు అధికారులు గుర్తించారు. అస్సాం రైఫిల్స్ దళాలు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి. మీరై పైబిస్ నిర్వహించిన నిరసన కారణంగా మరోసారి అశాంతి నెలకొంది. సావోన్ బంగ్-వైకేపీఐ రహదారిని చాలా చోట్ల బ్లాక్ చేయాల్సి వచ్చింది. 


ఎట్టకేలకు కదిలిన కేంద్ర సర్కారు


మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఎట్టకేలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈశాన్య రాష్ట్రంలో నెలన్నరగా జరుగుతున్న అల్లర్లను అదుపులోకి తెచ్చి రాష్ట్రంలో శాంతిస్థాపనే లక్ష్యంగా ఈ సమావేశన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో ట్వీట్ చేసింది. జూన్ 24వ తేదీన దిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు హోంశాఖ తెలిపింది.






'ప్రధాని దేశంలో లేని సమయంలో మీటింగా'


కేంద్ర సర్కారు ఇన్ని రోజుల తర్వాత అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. 50 రోజులుగా మణిపూర్ మండుతుంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మౌనం వహించారని మండిపడ్డారు. ప్రధాని దేశంలో లేని సమయంలో అఖిలపక్ష సమావేశం పెట్టారని, ఈ భేటీ ప్రధానికి ఏమాత్రం ముఖ్యం కాదని స్పష్టమైందని ఆయన విమర్శించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Also Read: పని మనుషులు కామన్ ఏరియాల్లో కనిపించొద్దని రూల్, హౌజింగ్ సొసైటీపై నెటిజన్లు ఫైర్






మే 3 నుంచి మణిపూర్ లో హింసాకాండ


ప్రశాంతతకు నెలవైన ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో మే 3వ తేదీన ఒక్కసారిగా హింస చెలరేగింది. ఇక్కడి జనాభాలో అత్యధికులు మెయిటీ, కుకీ తెగల మధ్య వైరం మొదలైంది. రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకుంటూ సృష్టించిన హింసలో అనేక మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు అధికార లెక్కల ప్రకారమే 98 మంది మృతి చెందారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు బలగాలను మోహరించినా పరిస్థితిలో ఏమార్పూ కనిపించడం లేదు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial