Abortion Law in USA: అబార్షన్ హక్కులపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. అబార్షన్ హక్కులను తొలగిస్తూ, ఆ చట్టాన్ని రద్దు చేసేలా కోర్టు ఆదేశాలు ఇవ్వనున్నట్టు ఓ డ్రాఫ్ట్ లెటర్ లీక్ అయింది. ఈ మేరకు ప్రముఖ వార్తాసంస్థ వెల్లడించింది. దీంతో అమెరికాలో అబార్షన్ హక్కులపై ఆందోళన మొదలైంది.
తీర్పు ఇదే
జస్టిస్ శామ్యూల్ ఆలిటో ఈ ముసాయిదాలో కొన్ని కీలక అంశాలను పేర్కొన్నట్టు ఈ కథనం వెల్లడించింది. అమెరికాలో అబార్షన్‌కు సంబంధించి అమలులో ఉన్న హక్కులను కొట్టివేయబోతున్నట్లు సమాచారం.
1973లో రో వర్సెస్ వాడే కేసులో ఇచ్చిన తీర్పును శామ్యూల్ తప్పుబట్టినట్లు ఈ ముసాయిదాలో ఉంది. సోమవారం రాత్రి లీక్ అయిన ఈ సమాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అయితే, సుప్రీంకోర్టు నుంచి డాక్యుమెంట్ లీక్ కావడంపై న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కీలక అంశాలు
బయటకు వచ్చిన ముసాయిదాలో జస్టిస్ శామ్యూల్ అలిటో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. 1973లో రో వర్సెస్ వేడ్ కేసులో వెలువడిన చారిత్రాత్మక తీర్పును జస్టిస్ శామ్యూల్ వ్యతిరేకించారు. రో వర్సెస్ వేడ్ చారిత్రక కేసులో ఇచ్చిన వివరణ చాలా బలహీనంగా ఉందని, ఫలితంగా పరిణామాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని జస్టిస్ అలిటో లీకైన ముసాయిదాలో అభిప్రాయం వ్యక్తం చేశారు.
అబార్షన్ హక్కులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రతినిధులకు ఇవ్వాలని ఆ ముసాయిదాలో అభిప్రాయం వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది.
అప్పుడే తీర్పు
వాస్తవానికి ఈ ఏడాది జులైలో అబార్షన్ హక్కులపై సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే, తాజాగా లీక్ అయిన డాక్యుమెంట్‌లోని సమాచారంపై అమెరికా అత్యున్నత న్యాయస్థానం గానీ, వైట్ హౌస్ వర్గాలు గానీ స్పందించలేదు.
నిరసనలు
మరోవైపు లీక్ అయిన డాక్యుమెంట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డాక్యుమెంట్‌లో ఉన్న అంశాలను విభేదిస్తున్న వాళ్లు సుప్రీంకోర్టు ముందు నిరసనలు చేపట్టారు. 'మై బాడీ మై ఛాయిస్' నినాదాలను మహిళలు మళ్లీ తీసుకువ్చచారు. తమ హక్కులను కాలరాయడం కుదరదని నినదిస్తున్నారు.
సుప్రీంకోర్టుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్ లీక్ కావడం సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవలి కాలంలో ఇలాంటి పరిణామం ఎప్పుడూ జరగలేదు.
Also Read: Indian IT Firm: పెళ్లి చేసుకోరా నాయనా- ఏడాదికి 3 సార్లు హైక్ నీకే వాత్సాయనా!
Also Read: Chennai News: పార్టీ లేదా పుష్పా! అన్నావ్- ఇస్తే బిర్యానీతో పాటు నగలు కూడా మింగేశాడు!