ఎలాన్ మస్క్.. వ్యాపార ప్రపంచానికి, సోషల్ మీడియాకు పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత, స్పేస్ ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ చేసే పనులు దాదాపు సంచలనాలుగా ఉంటాయి. సోషల్ మీడియాలో ఆయన చేసే కామెంట్లు సైతం వివాదాలకు దారితీస్తుంటాయి. ఎలాన్ మస్క్ ఇటీవల తన సంతానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనాభా పెరుగుదల కోసం తమ వంతు సాయం చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. తాజాగా మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ వంతు వచ్చింది. ఈయన ఎలాన్ మస్క్‌ను మించి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు.
భార్యకు విడాకులు, ఆమె కూతురితో డేటింగ్, సీక్రెట్‌గా పెళ్లి..!
ఎర్రోల్ మస్క్ మొదటి భార్య మాయే హెల్డెమాన్ మస్క్. ఆమె కుమారుడే ఎలాన్ మస్క్. ఆమెకు మస్క్ తండ్రి 1979లోనే విడాకులు ఇచ్చారు. తొలి భార్యకు విడాకులు ఇచ్చిన ఎర్రోల్ మస్క్ హీడే బెజుడెన్‌హౌట్‌ను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు సైతం ఇది రెండో వివాహమే. అప్పటికే ఆమెకు తొలి భర్తతో సంతానంగా కూతురు జానా బెజుడెన్‌హౌట్ ఉంది. కొన్నేళ్లపాటు సజావుగా సాగిన వీరి రెండో వివాహబంధానికి ఫుల్ స్టాప్ పడింది. కొన్నేళ్ల కిందట హీడే బెజుడెన్‌హౌట్, ఎర్రోల్ మస్క్ విడాకులు తీసుకున్నారు. ఇంతరవరకు బాగానే ఉంది, కానీ రెండో భార్యకు విడాకులు ఇచ్చిన తరువాత ఆమె కుమార్తె జానా బెజుడెన్‌హౌట్‌ను ఎర్రోల్ మస్క్ సీక్రెట్ వివాహం చేసుకున్నారట. తాజాగా యూకే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎర్రోల్ మాస్క్ పలు విషయాలను వివరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
భూమి మీద ఉన్నది అందుకే.. ఎర్రోల్ మస్క్
తల్లికి విడాకులు ఇచ్చి, సవతి కూతురు జానా బెజుడెన్‌హౌట్ (35)తో దక్షిణాఫ్రికాకు చెందిన 76 ఏళ్ల ఇంజినీర్ ఎర్రోల్ మస్క్ డేటింగ్ చేశాడు. వీరు సీక్రెట్‌గా వివాహం చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. తాజాగా ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ మాట్లాడుతూ.. భూమి మీద మనం ఉన్నది పిల్లల్ని కనడానికే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్టెప్ డాటర్ జానా బెజుడెన్‌హౌట్‌తో తాను 5 ఏళ్ల కిందట తొలి సంతానం బాబు ఇల్లియట్ రష్ ను కన్నామని వెల్లడించారు. మూడేళ్ల కిందట 2019లో కూతురితో కలిసి రెండో సంతానంగా ఓ పాపను కన్నట్లు తెలిపి మరో షాకిచ్చారు. భూమి మీద మనం ఉన్నది పిల్లల్ని పుట్టించడానికే అని కామెంట్ కూడా చేశారు.
తండ్రి నిర్వాకంపై ఎలాన్ మస్క్ ఆగ్రహం !
తన తల్లితో విడాకులు తీసుకున్నాక తండ్రి మరో మహిళను వివాహం చేసుకున్నాడు. 18 ఏళ్ల అనంతరం రెండో భార్య నుంచి సైతం మస్క్ తండ్రి ఎర్రోల్ మాస్క్ విడాకులు తీసుకున్నారు. కానీ రెండో భార్యకు తొలి భర్త నుంచి పుట్టిన సంతానమైన జానా బెజుడెన్‌హౌట్ (35)తో తండ్రి ఎర్రోల్ మస్క్ డేటింగ్ చేసి 2017లో తొలి బిడ్డను కన్నారు. ఆ సమయంలోనే ఎలాన్ మస్క్ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సోదరి వరుస, తండ్రికి కూతురు వరుస అయ్యే ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవడంపై ఎర్రోల్ మస్క్‌ను ఎలాన్ మస్క్ హెచ్చరించారు. ఎలాన్ మస్క్‌తో పాటు అతడి తోడబుట్టిన వాళ్లు సైతం తండ్రి చేస్తున్న నిర్వాకాన్ని సమర్థించడం లేదు. దాంతో కొందరు ఎర్రోల్ మస్క్‌కు దూరంగా ఉంటున్నారు.