Elon Musk  Tesla Compensation 158 Billion dollors: టెస్లా అధినేత ఎలోన్ మస్క్ వార్షిక వేతనం, పరిహారం గణాంకాలు ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను టెస్లా సంస్థ మస్క్ పరిహారాన్ని సుమారు  158 బిలియన్ డాలర్లుగా అంటే భారత కరెన్సీలో సుమారు 13.2 లక్షల కోట్ల రూపాయలుగా నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా ఏ కంపెనీ సీఈఓ కూడా ఇప్పటివరకు ఈ స్థాయి పారితోషికాన్ని అందుకోలేదు. 

Continues below advertisement

ఈ భారీ పరిహారం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటంటే, మస్క్ ఈ మొత్తాన్ని నగదు రూపంలో జీతంగా తీసుకోవడం లేదు. టెస్లా షేర్ హోల్డర్లు ఆమోదించిన మూన్ షాట్ పే ప్లాన్ ప్రకారం ఇవన్నీ స్టాక్ అవార్డుల రూపంలో ఉన్నాయి. కంపెనీ మార్కెట్ విలువను.  వివిధ ఆర్థిక లక్ష్యాలను  చేరుకుంటేనే మస్క్‌కు ఈ షేర్లు దక్కుతాయి. అంటే, కంపెనీ లాభపడితేనే ఆయనకు ఈ ఆదాయం వస్తుంది. 75 శాతం మంది వాటాదారులు ఈ ప్యాకేజీకి అనుకూలంగా ఓటు వేయడం ఆయన నాయకత్వంపై వారికి ఉన్న నమ్మకాన్ని సూచిస్తోంది.

అయితే, ఈ 158 బిలియన్ డాలర్ల  సంఖ్య వెనుక కొన్ని పరిమితులు ఉన్నాయని టెస్లా స్పష్టం చేసింది. రిపోర్ట్ చేసిన మొత్తానికి, మస్క్ నిజంగా పొందే విలువకు మధ్య చాలా తేడా ఉండవచ్చని కంపెనీ పేర్కొంది. ఉదాహరణకు, గత ఏడాది టెస్లా కొన్ని కఠినమైన ఆర్థిక లక్ష్యాలను చేరుకోలేకపోవడంతో మస్క్ పొందిన నికర పరిహారం సున్నాగా నమోదైంది. కేవలం పేపర్ మీద మాత్రమే ఈ విలువ కనిపిస్తుందని, షేర్ల ధర పెరిగినప్పుడే అది నిజమైన సంపదగా మారుతుంది. 

Continues below advertisement

ఈ పారితోషికం వివాదాలకు కూడా కేంద్రబిందువుగా మారింది. గతంలో డెలావేర్ కోర్టు మస్క్  56 బిలియన్ డాలర్ల పాత పే ప్యాకేజీని రద్దు చేసింది.  డెలావేర్ సుప్రీంకోర్టు ఆ తీర్పును పక్కన పెట్టి మస్క్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది.  ఆపై టెస్లా తన హెడ్ క్వార్టర్స్‌ను టెక్సాస్‌కు మార్చడం వంటి పరిణామాలు ఈ భారీ పరిహారానికి మార్గం సుగమం చేశాయి. బోర్డు సభ్యులు మస్క్ ప్రభావంతోనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని కొందరు ఇన్వెస్టర్లు ఇప్పటికీ ఆరోపిస్తున్నారు.

మరోవైపు, ఎలోన్ మస్క్ సంపద ప్రస్తుతం రికార్డు స్థాయికి చేరుకుంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆయన నికర విలువ  600 బిలియన్ డాలర్ల నుండి 800 బిలియన్ డాలర్లకు చేరింది.  టెస్లాతో పాటు స్పేస్ ఎక్స్ , ఎక్స్  ,   ఇతర స్టార్టప్ కంపెనీల విజయం ఆయనను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలబెట్టింది.  

ప్రస్తుతం టెస్లా మార్కెట్ విలువ సుమారు  1.43 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. కేవలం ఆటోమొబైల్ రంగానికే పరిమితం కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  , రోబోటిక్స్ ,  అటానమస్ డ్రైవింగ్ సాంకేతికతపై టెస్లా దృష్టి సారించడంతో, రానున్న కాలంలో మస్క్ పరిహారం విలువ మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో ఒక వ్యక్తికి పారితోషికం ఉండటం అనేది ఆధునిక కార్పొరేట్ చరిత్రలో ఒక అసాధారణ మైలురాయిగా మిగిలిపోనుంది.